సమీక్ష : తీయని కలవో – ఈ కల ఓ చేదు అనుభవం

Theeyani-Kalavo-Movie-Wallp విడుదల తేదీ : 6 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : శివాజీ. యు
నిర్మాత : బలమూరి రామోహన్ రావు
సంగీతం : రవీంద్ర ప్రసాద్
నటీనటులు : అఖిల్ కార్తీక్, శ్రీ తేజ, హుదాశా

టాలీవుడ్ లో ఈ మధ్యన ప్రతివారం రెండు మూడు చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. అదే విధంగా ఈరోజు, ‘తీయని కలవో’ అనే పేరుతో మరో చిన్న సినిమా విడుదల అయింది. ఈ ప్రేమకథలో అఖిల్ కార్తీక్, శ్రీ తేజ, హుదాశాలు ముఖ్యపాత్రలలో నటించగా శివాజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథ ఎలా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

అజయ్ (శ్రీ తేజ) మరియు గీత (హుదాశా), ఈ ఇద్దరికీ ట్రైన్ లో పరిచయం ఏర్పడుతుంది. అజయ్ మొదటి చూపులోనే గీతపై మనసు పారేసుకుంటాడు. ట్రైన్ దిగగానే, గీత ఫోన్ నెంబర్ తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కుదరదు. కానీ అనుకోకుండా ఇద్దరు ఒకే కాలేజీ, ఒకే క్లాసులో చేరుతారు. అజయ్ రోజు రోజుకి గీతపై ప్రేమను పెంచుకుంటాడు, కానీ గీత మాత్రం అతనిని పెద్దగా పట్టించుకోదు.

అనుకోకుండా ఒక రోజు గీత ఫ్లాష్ బ్యాక్ గురించి అజయ్ కి తెలుస్తుంది. గీత ఇదివరకే కార్తీక్ (అఖిల్ కార్తీక్) అనే ఒక రాక్ స్టార్ ని ప్రేమించిందని, వారీద్దరికి పెళ్ళి కూడా కుదిరిందని తెలుసుకుంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే కార్తీక్ – గీత పెళ్లి జరగదు. వారిద్దరి పెళ్ళి ఎందుకు ఆగిపోయింది? అసలు కార్తీక్ ఏమయ్యాడు? గీత అజయ్ ప్రేమని ఒప్పుకుంటుందా?… ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

హుదాశా, కొత్త అమ్మాయి అయినప్పటికీ బాగానే నటించింది, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ని బాగా పండించింది. రాక్ స్టార్ గా నటించిన కార్తీక్ నటన ఓకే అనేలా ఉంది, కానీ అతని డైలాగ్ డెలివరీపై కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. సినిమాలో కామెడీ బాగుంది. జబర్దస్త్ టీం నుండి సుదీర్, రచ్చ రవి, ఫణి, చంటిలతో పాటు చిత్రం శ్రీను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీలు పండించిన కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది.

అంతేకాకుండా చంద్రమోహన్, కాశి విశ్వనాధ్, శివాజీ రాజా, సుధా వంటి సీనియర్ నటినటులు తమ తమ పాత్రలలో బాగా అలరించారు. చంద్రమోహన్, సుధాల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగుంటాయి. సినిమాలో అక్కడక్కడా వచ్చే ప్రేమకు సంబంధించిన ఎమోషనల్ డైలాగులు యూత్ ని కాస్త ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరోల గురించి. శ్రీ తేజ, మంచి హ్యాండ్సం లుక్ ఉన్నప్పటికీ, అతని హావ భావాలు మాత్రం సీన్ కి తగ్గట్టుగా లేవు. అక్కడక్కడా అవసరానికి మించి చేసిన ఓవర్ యాక్షన్ ని తగ్గించుకొని అవసరమైనంత చేస్తే సరిపోతుంది. ఇలాంటి ప్రేమకథ ఉన్న సినిమాలకు సంగీతం ప్రాణం పోస్తుంది, కానీ ఈ సినిమాలో మాత్రం ఏ ఒక్క పాట బాగోలేదు. అంతేకాకుండా సందర్భం పాడు లేకుండా వచ్చే పాటలు ప్రేక్షకుల నోట మళ్ళి పాటా? అని అనిపిస్తుంది.

సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాలేజీ సన్నివేశాలు బాగా సాగదీశారు. అనవసరమైన డైలాగులను సాగదీసి దీసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. సినిమాలో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఉండవు. అలాగే డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేకపోవడం వలన ప్రతి ఒక్కరు తదుపరి ఏం జరుగుతుందా అనే విషయాలను ఈజీగా ఊహించేయగలరు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. రొటీన్ కామెడీ పెట్టడం వల్ల క్లైమాక్స్ ఇంకా ఎప్పుడు వస్తుందా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించారు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రాఫర్ తనకు ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించాడు. ఎడిటర్ మాత్రం సినిమాపై కాస్త శ్రద్ధ పెట్టి ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాలేజీ సన్నివేశాలలో చాలా బాగం కట్ చేసి ఉంటే బాగుండేది. ఇక సంగీతం గురించి మాట్లాడుకుంటే, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాకి సంగీతం పెద్ద మైనస్. ఏ ఒక్క పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక దర్శకుడు శివాజీ విషయానికి వస్తే పాత ప్రేమకథనే తీసుకొని కొత్తగా చూపిద్దాం అనుకునప్పటికి అందులో పూర్తిగా విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లేని మరింత వేగావంతగా ఉండేలా చూసుకొని, మంచి సంగీతాన్ని రాబట్టుకొని ఉంటే మంచి పేరు తెచ్చుకునే వాడు.

తీర్పు :

‘తీయని కలవో’ సినిమా తీయగా లేకపోవడమే కాకుండా చాలా చప్పగా, బోరింగ్ గా కూడా ఉంటుంది. ఏవో కొన్ని కామెడీ సన్నివేశాలు పక్కన పెడితే, మీగతా సినిమా రొటీన్ గానే ఉంటుంది. డైరెక్టర్ చాలా విషయాల్లో ఫెయిల్ అవ్వడం వల్ల సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించే అవకాశం లేదు. ఈ ఎండల వేడికి తట్టుకోలేక రెండున్నర గంటలపాటు సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకునే వారు ఈ సినిమాకి పోకపోవడమే మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version