విడుదల తేదీ : మార్చి 4, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బు, రాధిక శరత్‌కుమార్ మరియు ఊర్వశి
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్
శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
చిరంజీవి (శర్వానంద్) కళ్యాణమండపం నడుపుతూ ఉంటాడు. తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కారణంగా పెళ్లి కాకుండా మిగిలిపోతాడు. పెళ్లి అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. పెళ్లి సెట్ కాదు. అయితే, ఆద్య(రష్మీక మందన్న)ను చూసి ప్రేమలో చిరంజీవి ఆమెతో ట్రావెల్ చేస్తాడు. ఆద్యకి కూడా చిరు పై ఇష్టం కలుగుతుంది. కానీ పెళ్లి చేసుకోలేను అంటుంది. తన తల్లి వకుల(ఖుష్బూ)కి పెళ్లి ఇష్టం లేదు అని క్లారిటీ ఇస్తోంది. ఇంతకీ ఆమెకు ఎందుకు ఇష్టం లేదు ? ఆధ్య తల్లి మనసు మార్చడానికి చిరంజీవి ఏమి చేస్తాడు ? చివరకు చిరు – ఆద్య కలుస్తారా ? లేదా ? అనేది మిగిలన కథ.
ప్లస్ పాయింట్స్ :
పెళ్లే వద్దు అనుకునే ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అంటూ దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాని మంచి కామెడీతో చూపించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న ఎమోషనల్ సీన్ కూడా బాగానే ఉంది. నటన విషయానికి వస్తే.. చిరంజీవి పాత్రలో.. శర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అలాగే ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు.
సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వానంద్ పలికించిన ఎక్స్ ప్రెషన్స్ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీక మందన్న తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. అలాగే కీలక పాత్రలో నటించిన ఊర్వశి సినిమాలో కామెడీని తన హావభావాలతోనే బాగా పలికించింది.
కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఖుష్బూ నటన చాలా బాగుంది. అలాగే మరో ప్రధాన పాత్రల్లో నటించిన రాధికా శరత్ కుమార్, ఊర్వశీ, ఝాన్సీ, కళ్యాణి, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, రజిత తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అయినా.. ప్లే మాత్రం ఇంట్రస్టింగ్ గా సాగలేదు. అయితే, దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మరియు సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతూ బోర్ కొడుతొంది. ముఖ్యంగా సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్నీ పక్కా రొటీన్ గానే సాగుతాయి. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా పూర్తిగా ఆకట్టుకోవు.
పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. ప్రేమ జంటను కలిపే సీక్వెన్స్, రెగ్యులర్ సీన్స్ లాంటి కొన్ని సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సెకెండ్ హాఫ్ లో చాల సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. మెయిన్ గా స్లో నెరేషన్ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడిగా తిరుమల కిషోర్ పర్వాలేదనిపించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పై కూడా బాగా వర్క్ చెయ్యాల్సింది. చాల ల్యాగ్ సీన్స్ తగ్గేవి. సంగీత దర్శకుడు దేవి అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ నటన, రష్మీక గ్లామర్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్, అలాగే కొంత ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకున్నాయి. అయితే కథనం ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు బలమైన సంఘర్షణ లేని కీలక సీన్స్ మరియు రొటీన్ డ్రామా.. వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. మొత్తమ్మీద ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team