సమీక్ష : ఆకాశం నీ హద్దురా – ప్రేరణగా నిలిచే ఎమోషనల్ జర్నీ !

విడుదల తేదీ : నవంబర్ 12th,2020

123telugu.com Rating : 3.5/5

నటీనటులు : సూర్య, మోహన్ బాబు, అపర్ణ బాలమురళి తదితరులు.

రచన, డైరెక్టర్ : సుధా కొంగర

నిర్మాతలు : సూర్య, గునీత్ మోంగా

సంగీతం : జీవీ ప్రకాష్

సినిమాటోగ్రఫీ : నిఖిత్ బొమ్మిరెడ్డి

ఎడిటర్ : సతీష్ సూర్య

 

 

సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. కాగా తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

సూర్య (మహా) గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఓ మాములు మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? ఇంతకీ తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే ఆలోచన చుట్టే మహా జీవితం ఎందుకు సాగింది ? దానికి కారణం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో మహా పాత్ర, ఆ పాత్ర తాలూకు గోల్.. ఆ గోల్ కు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మోహన్ బాబు మరియు మిగిలిన ప్రధాన పాత్రలు.. అలాగే సినిమాలో కొన్ని ప్రేరణగా నిలిచే సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఇక తన పాత్రలో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు. ఇక మోహన్ బాబు తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. అపర్ణ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకురాలు సుధా రియలిస్టిక్ స్టోరీ కాబట్టి పర్ఫెక్షన్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు. నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషనన్స్ తో కథ నేపథ్యానికి తగట్లు కొన్ని సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు.

 

మైనస్ పాయింట్స్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకుంటూ.. మళ్లీ ఆ నిజ జీవితాన్ని రెండు గంటల సినిమా కథగా చెప్పాలి అంటే.. ఆ వ్యక్తి తాలూకు మొత్తం జీవితంతో పాటు అతని ఆలోచనా విధానాన్ని, అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవడం అంత తెలికేం కాదు. ఈ విషయంలో సుధా గోపినాధ్ జీవితాన్ని ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆమె రాసుకున్న స్క్రిప్ట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఆ స్క్రిప్ట్ కి తగట్లు సరైన ట్రీట్మెంట్ ను రాసుకోలేదు.

పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో నిజ జీవిత కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకురాలు చాలా సినిమాటిక్ గా చూపించారు. ఆమె ఈ చిన్న జాగ్రత్తలు పై కూడా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ ఇంకా అద్భుతంగా ఉండేది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని మెయిన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు జివీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో నేపథ్య సంగీతం చాల బాగుంది. ఎడిటర్ సతీష్ సూర్య ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకురాలు గోపినాధ్ జీవితాన్ని
అంతే బలంగా చూపించాలనుకోవడం బాగుంది గానీ, అందుకు తగ్గట్లు ఇంకా ఉత్కంఠభరితమైన కథాకథనాలను రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు :

డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా కథ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే సుధా రాసుకున్న స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఇంట్రస్ట్ గా సాగకపోవడం, అలాగే చాల సీన్స్ లో నాటకీయత ఎక్కువడం.. వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచినా.. మిగిలిన సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సాగాయి. ఇక సూర్య నటనతో పాటు అపర్ణా, మోహన్ బాబు నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓవరాల్ గా ఈ ‘చిత్రం’ ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారికి చాలా బాగా నచ్చుతుంది.

123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

 

సంబంధిత సమాచారం :