విడుదల తేదీ : నవంబర్ 4, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
దర్శకత్వం : ఎస్.జె.చైతన్య
నిర్మాత : రవి పచ్చిపాల
సంగీతం : ఎం.టి.కవి శంకర్
నటీనటులు : కాళకేయ ప్రభాకర్, ఏ.రవితేజ, అశ్విని..
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’లో కాళకేయగా నటించిన ప్రభాకర్ ఆ సినిమా విడుదల తర్వాత బాగా పాపులర్ అయిపోయారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన కామెడీ సినిమాయే ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’. ఎస్.జె.చైతన్య దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ కామెడీ ఎంతమేరకు ఆకట్టుకునేలా ఉందో చూద్దాం..
కథ :
నెల్లూరులో కబ్జాలు చేస్తూ ఉండే ఓ రౌడీ అయిన నగరం నాని (ప్రభాకర్)కి ఆడవాళ్ళన్నా, ప్రేమలన్నా పడదు. తనను ఒక అమ్మాయి మోసం చేసిందన్న కారణంతో అప్పట్నుంచి తన చెల్లెలుతో సహా మొత్తం ఆడవాళ్ళనే ధ్వేషిస్తుంటాడు. అతడి చెల్లెలు అమృత (అశ్విని), ప్రభాస్ అనే ఒకతణ్ణి ప్రేమించి ఆ విషయం నానికి చెప్పలేక భయపడుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ (రవితేజ) అనే మరో వ్యక్తి అమృతకు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఈ ప్రభాస్ ఎవరు? అమృతకు సహాయం చేయడానికి అతడెందుకు ముందుకొస్తాడు? వీరిద్దరూ కలిసి ఏ నాటకమాడి నానిని ఒప్పిస్తారు? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సీరియస్ కథాంశాన్ని కామెడీగా చెప్పాలన్న కొత్త ఆలోచన గురించి చెప్పుకోవాలి. ఒక రౌడీకి అమ్మాయిలంటే పడకపోవడం, అతడి చుట్టూ రౌడీ గ్యాంగ్‌కు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండడం.. ఇలా సినిమాలో కామెడీ పంచగల సెటప్ అంతా బాగుంది. ప్రభాకర్ ఓ సీరియస్ పాత్రలో బాగానే నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ప్రభాకర్ బాగానే మెప్పించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ప్రభాకర్ గ్యాంగ్ లవ్‍స్టోరీల చుట్టూ వచ్చే చిన్న కామెడీ ట్రాక్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఒక్క చిన్న పాయింట్‌ను పట్టుకొని దానికొక అర్థవంతమైన స్క్రీన్‌ప్లే అంటూ ఒకటి లేకుండా సినిమాను నడిపించడమే మైనస్ అని చెప్పుకోవాలి. సీరియస్ కథాంశాన్నే కామెడీగా చెప్పాలన్న ఆలోచన చాలా బాగున్నా, దానికి తగ్గ కామెడీ సన్నివేశాలు మాత్రం బలంగా లేవు. దీంతో సినిమా ఇటు సీరియస్‌గా లేక, అటు కామెడీగానూ లేక విసుగు తెప్పించింది. కథ పరంగా మూడు ట్విస్ట్‌లున్నాయి. ఆ మూడింటిని కలపడం కోసమే సినిమానా అన్నట్టుగా సన్నివేశాలన్నీ నీరసంగా సాగుతూ కనిపించాయి.
ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం సెకండాఫ్‌లో సినిమానంతా సాగదీసిన విధానం బోరింగ్‌కే బోరింగ్ కొట్టించేలా ఉంది. ఇక హీరో రవితేజ క్యారెక్టరైజేషన్ బాగానే ఉన్నా, అతడి యాక్టింగ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. చాలాచోట్ల ఓవర్‌గా కనిపించింది. హీరోయిన్ అశ్విని కూడా చెప్పుకోడానికి ఒక్క సన్నివేశంలోనూ బాగా చేయలేదు. ఇక కమెడియన్ వేణు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక క్లైమాక్స్‌ని అర్థాంతరంగా ముగించేసి, ఆవు పులి మధ్యలో అనుష్క పెళ్ళి అంటూ సీక్వెల్‌ను అనౌన్స్ చేయడం నవ్వు తెప్పించేదే!
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు చైతన్య విషయానికి వస్తే, తనను తాను రామ్ గోపాల్ వర్మ శిష్యుడినని చెప్పుకున్న ఆయన, వర్మ తరహాలో డార్క్ కామెడీ ప్రయత్నం చేస్తున్నానని పూర్తిగా విఫలమయ్యాడు. అక్కడక్కడా సీరియస్ నేపథ్యం నుంచే కథ పుట్టించడం తప్పితే ఎక్కడా దర్శకుడి పనితనం గురించి చెప్పుకోడానికి లేదు.
రెండే పాటలున్నా ఆ రెండూ వినడానికి ఏమాత్రం బాగోలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫర్వాలేదు. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో కథ మూడ్‌కి తగ్గట్టు బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.
తీర్పు :
ఒక్క చిన్న కాన్సెప్ట్ ఏదో అనుకొని దాని నుంచి కామెడీ పుట్టించాలన్న ప్రయత్నాలన్నీ విజయం సాధించవు. ముఖ్యంగా సీరియస్ కథాంశాన్ని ఎంచుకొని అందులోనుంచి డార్క్ కామెడీ రప్పించడం మామూలు విషయం కాదు. సరిగ్గా ఈ అంశాలనే విస్మరించి వచ్చి మెప్పించలేకపోయిన సినిమాయే ఈ ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’. ఒక్క కాన్సెప్ట్‌ను పక్కనబెడితే చెప్పుకోదగ్గ అంశాలేవీ లేని ఈ సినిమాలో కనిపించేవన్నీ మైనస్‌లే! ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇటు ఆగిపోని, అటు సాగిపోని విసిగించే ఆటే ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’!
123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team