‘ఇట్స్ మై లవ్ స్టొరీ’తో కెరీర్ ప్రారంభించి ‘ఋషి’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అరవింద్ కృష్ణ ట్రై చేసిన మరో కొత్త తరహా మూవీ ‘అడవి కాచిన వెన్నెల’. ఈ సినిమా ద్వారా అక్కి విశ్వనాథరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మీనాక్షి దీక్షిత్, పూజ కుమార్, రిషి కీలక పాత్రలు పోషించారు. అక్కి విశ్వనాథరెడ్డి చరిత్ర నుంచి ఓ పాయింట్ తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్ కి కలిపి తీసిన తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. ఈ సినిమా కథ మన చరిత్రలో రాజులుగా రాజ్యాలు ఏలిన చోళుల కాలంలో మొదలవుతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే.. కడప జిల్లాలోని ఓ గ్రామంలో కథ మొదలవుతుంది. ఆ గ్రామంలో బాగా చదువుకున్న కుర్రాడు అరవింద్ కృష్ణ. అరవింద్ కృష్ణకి మెటల్ ని డిటెక్ట్ చేసే పవర్ ఉంటుంది. తను ఉద్యోగం చెయ్యకుండా, తన పొలాలన్నిటినీ అమ్ముకుంటూ పలు చోట్ల తవ్వకాలు జరుపుతూ ఏదో ఒక దాని కోసం అన్వేషిస్తుంటాడు. అందరూ అతను నిధి లేదా లంకె బిందెల కోసం అన్వేషిస్తున్నాడు అనుకుంటారు.
కానీ అరవింద్ కృష్ణ నిజంగా దేని కోసం అన్వేషిస్తున్నాడు? అసలు అతనికి ఏం కావాలో అది చివరికి దొరికిందా? లేదా? దీనికోసం అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చోళుల కాలానికి ఇతను వెతుకున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు కథ చోళుల కాలం నుంచి ఎందుకు మొదలు పెట్టారు? అన్నది మీరు తెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
డైరెక్టర్ కి ఇది తొలి సినిమా, అలాగే డైరెక్టర్ గా ఎలాంటి అనుభవం లేదు అయినా ఇలాంటి ఓ పాయింట్ తో సినిమా తియ్యాలి అన్న ఆలోచన వచ్చినందుకు ఆయన్ని మెచ్చుకొని తీరాలి. ఇలాంటి డైరెక్టర్ కి సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న అరవింద్ కృష్ణని కూడా మెచ్చుకోవాలి. ఈ సినిమాకి డైరెక్టర్ రాసుకున్న కంటెంట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
లవర్ బాయ్, స్టూడెంట్, జోవియల్ పాత్రలు చేసిన అరవింద్ కృష్ణ ఇందులో చాలా సీరియస్ గా కనిపించే రోల్ చేసాడు. డైరెక్టర్ అనుకున్న పాత్రకి తన పెర్ఫార్మన్స్ తో పూర్తి న్యాయం చేసాడు. డైరెక్ట్ గా తెరపై కనిపించకపోయినా ఇందులో తను చేసింది చాలా బోల్డ్ రోల్. అది తన డైలాగ్స్ లో తెలుస్తుంది. అందుకే అతన్ని మెచ్చుకున్నాను. ఇప్పటి వరకూ స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన మీనాక్షి దీక్షిత్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఒలంపిక్స్ కి వెళ్లాలనుకునే షూటర్ పాత్రలో మంచి నటనని కనబరిచింది. పూజ రామచంద్రన్ ఉన్నది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంది. తన సీన్స్ కొన్ని ఫన్నీగా ఉంటాయి.
సినిమా మొదట్లో చెప్పిన చరిత్ర, అలాగే సినిమా స్టార్టింగ్ బాగుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్, చరిత్ర గురించి, హీరోకి ఉన్న టాలెంట్ గురించి చెప్పే సీన్స్, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి బాగా హెల్ప్ అవుతాయి. సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సినిమా రన్ టైం.. రన్ టైం తగ్గించడానికి ముఖ్యంగా సినిమాలో పాటల్ని కట్ చేసెయ్యాలి. ఎందుకంటే ఐటెం సాంగ్, అరవింద్ కృష్ణ – మీనాక్షి దీక్షిత్ మధ్య వచ్చే సాంగ్, హీరోయిన్ సోలో సాంగ్ సినిమాకి అస్సలు అవసరం లేదు. ఇక మరో మైనస్ అంటే సినిమా ఫస్ట్ హాఫ్.. స్టార్టింగ్ చాలా బాగుంటుంది, కానీ మొదటి 10 నిమిషాల నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకూ ఎక్కడ ఉన్న కథ అక్కడే ఉంటుంది. కాసింత కూడా ముందుకు కదలదు, సీన్స్ కూడా రిపీటెడ్ గా అనిపిస్తాయి. అందుకే ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా వరకూ ట్రిమ్ చేయవచ్చు. రెగ్యులర్ సినిమాలో ఉండే కమర్షియల్ పాయింట్స్ ఇందులో లేవు, ఇంరికించాలని ట్రై చేసిన కొన్ని పాయింట్స్ వర్క్ అవుట్ అవ్వలేదు.
హిస్టారికల్ – సైన్స్ ఫిక్షన్ కలిసి ఉన్న సినిమా కావున లాజికల్ పాయింట్స్ మీద చాలా కేర్ తీసుకోవాల్సింది. కానీ ఇందులో లాజికల్ గా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి మరియు కొన్ని పాత్రలకి సరైన జస్టిఫికేషన్ లేదు. లంకె బిందెల్లో దొరికిన బంగారం వల్ల మనుషులు ఎందుకు చనిపోయారు, హీరో కష్టపడి ఎతుకుతున్న వస్తువు దొరికితే ఏం చెయ్యాలో తెలియదు అనడం, హీరోతో పాటు ఉండే కొన్ని పాత్రలకి ముగింపు లేకపోవడం మొదలైనవి. సిజి ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో మెచ్చుకోవాల్సిన వ్యక్తి అంటే అది కచ్చితంగా డైరెక్టర్ అక్కి విశ్వనాథరెడ్డి. తను తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. అలాగే మొదటి సినిమా డైరెక్టర్ అయినా నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ బాగా రాబట్టుకున్నాడు, అలాగే కొన్ని సీన్స్ ని కూడా చాలా బాగా తీసాడు. ఇలాంటి కాన్సెప్ట్ కి స్క్రీన్ ప్లే బాగా గ్రిప్పింగ్ గా ఉండేలా రాసుకోవాలి కానీ మొదటి సినిమా కావడం వల్ల ఆ విషయంలో తడబడ్డాడు. క్లైమాక్స్ లో చేసిన సిజి ఎఫెక్ట్స్ లో తను క్రియేట్ చెయ్యాలి అనుకున్నవి బాగా కుదిరినా పాటల్లో వచ్చే సిజి ఎఫెక్ట్స్ మాత్రం బాలేవు.
ఇకపోతే జోస్యభట్ల అందించిన పాటలు ఓకే అనేలా ఉన్నా అవి సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటర్ డైరెక్టర్ తో పోట్లాడి అయినా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని మరియు సాంగ్స్ ని కత్తిరించి పారేయాల్సింది. ఇలాంటి విలేజ్ నేటివిటీ సినిమాకి ఎలా ఉండాలో అదే తరహాలో సినిమాటోగ్రఫీ ఉంది. దర్శకుడే నిర్మాత కావడం వల్ల టేకింగ్ పరంగా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. ఉదాహరణకి సిజి ఎఫెక్ట్స్..
తీర్పు :
‘అడవి కాచిన వెన్నెల’ సినిమా ద్వారా డైరెక్టర్ అక్కి విశ్వనాథరెడ్డి అనుకున్న పాయింట్ మాత్రం ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. రొటీన్ సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ పాయింట్స్ లేకపోయినప్పటికీ అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్, నటీనటుల పెర్ఫార్మన్స్, సెకండాఫ్ ఈ సినిమాకి ప్లస్ యితే బోరింగ్ ఫస్ట్ హాఫ్, మిస్ అయిన లాజిక్స్, సినిమా ఫ్లోని పోగొట్టే పాటలు సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ‘అడవి కాచిన వెన్నెల’ సినిమా వెరైటీ సినిమాలు కోరుకునే వారిని ఆకట్టుకునే సినిమా..
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం