సమీక్ష : వీరుడొక్కడే – అజిత్ మాస్ ఎంటర్టైనర్

Veerudokkade విడుదల తేదీ : 21 మార్చి 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : శివ
నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : అజిత్, తమన్నా, నాజర్…

తమిళ సూపర్ స్టార్ తల అజిత్ హీరోగా మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘వీరం’.  సంవత్సరం సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ చేసి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తుమ్మల పల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. గతంలో తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలను అందించిన శివ ఈ సినిమాకి డైరెక్టర్. తమిళ ప్రేక్షకులని మెప్పించిన శివ తన తమిళ సినిమాతో తెలుగు వారిని ఎంత వరకూ ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓపెన్ చేస్తే వీరవరం అనే ఊరు.. ఆ ఊరిలో వీరేంద్ర(అజిత్) మార్కెట్ యార్డ్ లో ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. వీరేంద్రకి ధర్మ, ఫణీంద్ర, గజేంద్ర, ఉపేంద్ర అనే నలుగురు తమ్ముళ్ళు ఉంటారు. ఈ ఐదుగురు పంచ పాండవులను సపోర్ట్ చేయడానికి లాయర్ అయిన బెయిల్ పెంచలయ్య సపోర్ట్ గా ఉంటాడు. వీరేంద్ర పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అన్నదమ్ములను విడగొడుతుందని భావించి పెళ్లి చేసుకోకుంటా ఉంటాడు.

కానీ తన తమ్ముళ్ళు మాత్రం ప్రేమలో ఉంటారు. వారి పెళ్లి జరగాలంటే తన అన్న పెళ్లి జరగాలని ఆలోచింది ఆ ఊరుకి వచ్చిన గోమతి దేవి(తమన్నా)తో తన అన్న ప్రేమలో పడేలా ప్లాన్ చేస్తారు. చివరికి వారనుకున్నట్టుగానే వీరేంద్ర – గోమతి దేవి ప్రేమలో పడతారు. గొడవలంటే అస్సలు ఇష్టంలేని గోమతి దేవి తండ్రి అయిన నాజర్ ని ఒప్పించడానికి గొడవలన్నీ వదిలేసి వెళ్ళే సమయంలో వీరేంద్రకి నాగరాజు(అతుల్ కులకర్ణి) గోమతి దేవి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.

అసలు నాగరాజు ఎవరు? గోమతి దేవి ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఈ విషయం తెలిసిన వీరేంద్ర ఏం చేసాడు? వీరేంద్ర – గోమతి దేవి చివరికి కలిసారా? లేదా? అనేది మీరు తెరపైనే చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన హైలిట్ మరియు వన్ మాన్ ఆర్మీ అంటే అది అజిత్ మాత్రమే. సినిమా మొత్తం తన భుజాలపైనే నడిపించాడు. అజిత్ నటన, ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మరో హైలైట్ గా చెప్పుకోవాలి. అలాగే సినిమా మొత్తం వైట్ అండ్ వైట్ పంచ కట్టు లుక్ తో చాలా స్టైలిష్ గా కనిపించాడు. మిల్క్ బ్యూటీ తమన్నా చూడటానికి చాలా అందంగా ఉంది, నటనపరంగా తను చేయడానికి ఏమీ లేకపోయినా ఉన్నంత వరకూ మెప్పించింది. అలాగే రెండు పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో సంతానం తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు.
అజిత్ తమ్ములుగా నటించిన నలుగురు, నాజర్ తమ పాత్రల పరిధిమేర నటించారు. సెకండాఫ్ లో సత్యమూర్తి పాత్రలో తంబి రామయ్య ప్రేక్షకులను నవ్విస్తాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ బి,సి సెంటర్ వారిని బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలా చోట్ల హీరోయిజంని ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. వాటికి దేవీశ్రీ అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకునే సీన్స్ ఉన్నప్పటికీ సినిమాని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న ఒక్క ట్విస్ట్ ని సెకండాఫ్ లోనే రివీల్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ ని కాస్త అనవసరమైన సీన్స్ తో నింపేశాడు. సినిమా కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అలాగే రెగ్యులర్ గా సినిమాలు చూసే చిన్న పిల్లలు కూడా ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఊహించేంతగా కథనం ఉంటుంది.

మన తెలుగులో వచ్చిన చాలా మాస్ మసాలా ఎంటర్టైనర్స్ సినిమాల ఫ్లేవర్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇదే సీన్ నిమ్న తెలుగులో ఎక్కడో చూసాం అన్న ఫీలింగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ సినిమాకి పాటలు పెద్ద మైనస్ అలాగే క్లైమాక్స్ దగ్గర ఆడియన్స్ అంతా ఓ ఫీల్ ఉండగా వచ్చే జాతర సాంగ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

వీరుడొక్కడే సినిమాకి వెట్రి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. పాటల్లో విదేశీ లోకేషన్స్ ని బాగా చూపించాడు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకి హెల్ప్ అవ్వలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ నిడివిని తగ్గించడానికి తగ్గించి ఇంకాస్త ఆసక్తికరంగా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. తెలుగు రాసిన డైలాగ్స్ బాగున్నాయి, అలాగే డబ్బింగ్ వెర్షన్ కూడా బాగుంది.

ఇక తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ అనే సినిమాలు తీసిన శివ తెలుగు సూపర్ హిట్ మాస్ మసాల ఎంటర్టైనర్స్ లో నుంచి కాపీ కొట్టి రాసుకున్న కథకి తమిళ రంగులు అద్దేసి ఈ సినిమాని తీసారు. ఈ సినిమా కథకంటే శౌర్యం మంచి కథ అని చెప్పాలి. అలాగే కథనంపై పెద్దగా శ్రద్ధ తీసుకున్నట్టు లేరు అందుకే సినిమా ఊహాజనితంగా ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘వీరుడొక్కడే’ సినిమా చూసినంతసేపు అజిత్ ఒక్కడే వీరుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా కామెడీ, మాస్ మసాలా ఆశించే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అజిత్ పెర్ఫార్మన్స్, కామెడీ, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే, పాటలు, కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వీరుడొక్కడే సినిమాని అజిత్ ఫాన్స్, రెగ్యులర్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారు బాగా ఎంజాయ్ చేస్తారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version