విడుదల తేదీ : 25 జూలై 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5 | ||
దర్శకత్వం : వివి వినాయక్ |
||
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు |
||
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ |
||
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం.. |
టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ‘అల్లుడు శీను’. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి హిట్ ఇచ్చిందో? లేదో? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శీను(బెల్లంకొండ శ్రీనివాస్), తన మామయ్య నరసింహా(ప్రకాష్ రాజ్) అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటునుంచి దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెక్కిన ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళుతుంది. అక్కడ అల్లుడు శీను హైదరాబాద్ లో దందాలు, సెటిల్ మెంట్లు చేసే భాయ్(ప్రకాష్ రాజ్) అచ్చం తన నరసింహా మామలా ఉండడం చూస్తాడు.
అప్పుడు అల్లుడు శీను తన మామ నరసింహానికి భాయ్ లా గెటప్ వేసి భాయ్ పిఏ అయిన డింపుల్(బ్రహ్మానందం)ని వాడుకొని చిన్న చిన్న దందాలను సెటిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అదే సమయంలో అల్లుడు శీను భాయ్ కూతురు అంజలి(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. నిధానంగా సమంత కూడా అల్లుడు శీనుని ప్రేమిస్తుంది. ఆ సమయంలోనే భాయ్ కి నరసింహా గురించి తెలుస్తుంది.
అప్పుడే కథలో అసలైన ట్విస్ట్.. నరసింహానికి – భాయ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకున్న అల్లుడు శీను ఏం చేసాడు? ఎలా తను ప్రేమించిన అంజలిని దక్కించుకున్నాడు? అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏంటి? నరసింహానికి – భాయ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం అందరి చూపు అతని పైనే ఉంది కనుక మొదట అతని గురించి చెబుతా.. బెల్లంకొండ శ్రీనివాస్ లో ఎనర్జిటిక్ లెవల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా శ్రీనివాస్ డాన్సులు సింప్లీ సూపర్బ్. మామూలుగా వినాయక్ సినిమా అంటే కావాల్సినన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అలాంటి సీక్వెన్స్ లు చెయ్యాలంటే కాస్త రిస్క్ తో కూడుకున్న పని, కానీ శ్రీనివాస్ మొదటి సినిమా అయినాసరే ఏ మాత్రం జంకకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు. అలాగే మొదటి సినిమానే సీనియర్ డైరెక్టర్ తో చేయడం వలన మంచి నటనని కనబరిచాడనే చెప్పాలి.
ఇక ఈ సినిమాకి రెండవ హీరో కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఎందుకంటే ఆయన లేకపోతే సినిమానే లేదు. సినిమాలో బ్రహ్మానందం కనిపించిన ప్రతి చోటా ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. ముఖ్యంగా సెకండాఫ్ లో హీరో తనకిచ్చే షాక్ లకి బ్రహ్మానందం ఇచ్చిన హావ భావాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత గురించి.. సమంతకి పాత్ర నిడివి తక్కువ కావడం వల్ల తను ఎక్కువగా పాటలతోనే ఆడియన్స్ ని ఆకట్టుకోవాల్సి వచ్చింది. సమంత మునుపెన్నడూ ఇంత గ్లామరస్ గా కనిపించలేదు. ఎందుకంటే ఈ మూవీలో తను అందాలు ఆరబోసినట్టు మరే సినిమాలోనూ చేయలేదు. అన్ని పాటల్లోనూ ఎంత స్టైలిష్ గా కనిపించిందో అంతే హాట్ హాట్ గా కనిపించింది.
ఇక ద్విపాత్రాభినయం చేసిన ప్రకాష్ రాజ్ భాయ్, నరసింహా పాత్రల్లో మంచి నటనని కనబరిచాడు. ఇక షీలా బేబీగా తమన్నా చేసిన ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా అక్కట్టుకుంటుంది. రవిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు, ప్రదీప్ రావత్ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ బాగుంటుంది. ఓవరాల్ గా బ్రహ్మానందంపై వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతాయి. అలాగే ప్రకాష్ రాజ్ – సమంత మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ బాగుంది. క్లైమాక్స్ చేజింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాటలన్నిటి కోసం బాగా ఖర్చు పెట్టి బాగా రిచ్ గా తీసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం. ఇప్పటికే ఇలాంటి కథని మనం చాలా సినిమాల్లో చూసేసాం. కథ పాతదే అయినా ఆడియన్స్ ని సీట్లో కూర్చో బెట్టాలి అంటే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కానీ స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. ఎందుకంటే కథలో ఉన్న ఒక్క ట్విస్ట్ రివీల్ అయిపోగానే నెక్స్ట్ ఏమేమి జరగబోతుంది అనేది ప్రేక్షకుడు చాలా ఈజీగా ఊహించేయగలడు. చెప్పాలంటే ‘రెడీ’, ‘బాద్షా’ ‘దేనికైనా రెడీ’ మొదలైన సినిమాల ఫార్మాట్లోనే ఈ సినిమా కూడా ఉంటుంది.
సినిమాలో చాలా సీన్స్ బాగా రొటీన్ గా ఉంటే, కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. సెకండాఫ్ ని కూడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. పాటలు బాగా రిచ్ గా తీసినప్పటికీ సెకండాఫ్ లో పాటలను సరైన ప్లేస్ లో వచ్చేలా చూసుకోలేదు. దానివల్ల కథ ముందుకు వెళ్ళదు. సెకండాఫ్ లో పాటలు వెంటవెంటనే వచ్చేయడం ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. తనికెళ్ళ భరణి, అతని గ్రూప్ లోని పాత్రకి సరైన జస్టిఫికేషన్ లేదు. బ్రహ్మానందం కామెడీ తప్ప మిగతా వాళ్ళంతా ట్రై చేసిన కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అలాగే కొన్ని చోట్ల చేసిన సిజి సీన్స్ సరిగా సెట్ అవ్వలేదు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ లో చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఒకటి. నిర్మాత పెట్టిన ఖర్చుని చోటా కె.నాయుడు దాదాపు తన విజువల్స్ లో చూపించాడు. సూపర్బ్ విజువల్స్ తో సినిమాని చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా విదేశాల్లో తీసిన పాటలని చాలా బాగా షూట్ చేసారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. ఇక ఎప్పటిలానే తను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ కి బాగా హెల్ప్ అయ్యింది కానీ కొన్ని కంటెంట్ లేని సీన్స్ కి కూడా ఏదో చెయ్యాలని సంబంధం లేకుండా నేపధ్య సంగీతం ఇవ్వడం బాలేదు. కోన వెంకట్ డైలాగ్స్ జస్ట్ ఓకే.. కోన వెంకట్ డైలాగ్స్ కంటే బ్రహ్మానందం కి రాసుకున్న సిచ్యువేషనల్ కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. గౌతంరాజు గారు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండాలని ఎడిటింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
కెఎస్ రవీంధ్ర అందించిన కథ చాలా పాతది. ఇక గోపి మోహన్ – వివి వినాయక్ కలిసి రాసుకున్న స్కీన్ ప్లే కూడా అంతతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న వివి వినాయక్ కొత్త హీరోతో సినిమా చేస్తున్నా తన మార్క్ ఎక్కడా పోకుండా ఈ సినిమా తీసాడు, అందువల్లే డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. కథ కథనం ఎలా ఉన్నా తనకు తెలిసిన కమర్షియల్ పాయింట్స్ ని బాగా డీల్ చెయ్యడం వలెనే సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. బెల్లంకొండ గణేష్ బాబు ఈ సినిమా బాగా రిచ్ గా ఉండాలని భారీగానే ఖర్చు పెట్టారు.
తీర్పు :
బెల్లంకొండ శ్రీనివాస్ ని పరిచయం చేస్తూ చేసిన ‘అల్లుడు శీను’ అనే సినిమా వివి వినాయక్ మార్క్ ఉన్న పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సినిమాగా ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎంచుకోవడం వలన మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే అవకాశం ఉంది. కథ – కథనం అంతంతమాత్రమే అయినప్పటికీ వివి వినాయక్ తనకు తెలిసన కమర్షియల్ అంశాలను కథలో బాగానే జోడించడం వలన మాస్ ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యగలరు. బ్రహ్మానందం కామెడీ, బెల్లంకొండ శ్రీనివాస్ ఫైట్స్, డాన్సులు, ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్ మరియు సమంత గ్లామరస్ టచ్ సినిమాకి ప్రధాన హైలైట్స్ అయితే రెగ్యులర్ కథ, కథనం, రొటీన్ అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ మరియు సెకండాఫ్ ని కాస్త సాగదీయడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ‘అల్లుడు శీను’ కి బాక్స్ ఆఫీసు వద్ద వేరే సినిమా పోటీ లేకపోవడం మరియు భారీ ఎత్తున రిలీజ్ చేయడం వలన కలెక్షన్స్ బాగా వస్తాయనే ఆశించవచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం