విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు
దర్శకత్వం : ప్రదీప్ వర్మ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సంబంధిత లింక్స్: ట్రైలర్
విలక్షణ నటుడు శ్రీవిష్ణు హీరోగా యువ దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కాప్ థ్రిల్లర్ మూవీ అల్లూరి. ఈ మూవీలో శ్రీవిష్ణు నీతి, నిజాయితీ, ధర్మం అనుసరించే ఎస్సై పాత్రలో నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన అల్లూరి మూవీ నేడు ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
నాజీరుద్దీన్ (తనికెళ్ళ భరణి) కొడుకైన ఇక్బాల్ పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరికతో ఎన్నో ఏళ్ళ పాటు ఎంతో ప్రయత్నం చేసి చివరకు కాలేకపోవడంతో ఇతర ఉద్యోగం చేస్తుంటాడు. అయితే గతంలో ఎస్సై సీతారామరాజు తో కలిసి పని చేసిన తన అనుభవాన్ని, అతడి స్ఫూర్తిదాయకమైన జీవిత కథని వివరిస్తాడు అతని తండ్రి నజీరుద్దీన్. కాగా మిగతా సినిమా మొత్తం పోలీస్ అధికారి అల్లూరి సీతారామరాజు జీవితం, అతడు తన లైఫ్ లో ప్రొఫెషన్ లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అనేవి చూపించడంతో సినిమా సాగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
ముందుగా ఈ మూవీ కోసం శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడ్డ హీరో శ్రీవిష్ణు, అల్లూరి పాత్రలో అత్యద్భుతంగా నటించారు అనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని కీలక ఎమోషనల్, ఇంటెన్స్ సీన్స్ లో అయితే తన పెర్ఫార్మన్స్ అయితే అదరహో అనే చెప్పాలి. సినిమాలో కీలక సీన్స్ లో పోలీసులు నక్సల్స్ తో కలిసి పని చేసే సీన్ బాగుంటుంది. అలానే థ్రిల్లింగ్ క్లైమాక్స్ సన్నివేశాలు, నిజంగా అందరినీ ఎమోషనల్ గా కదిలిస్తాయి. నజీరుద్దీన్ పాత్రలో కనిపించిన తనికెళ్ళ భరణి తన పాత్రలో ఎంతో ఒదిగిపోయారు, సెకండ్ హాఫ్ లో ఆయన పాత్ర ఎంతో బాగుంటుంది. అలానే ఇతర పాత్రల్లో నటించిన సుమన్, రాజారవీంద్ర వంటివారు తమ పాత్రలకు బాగా న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్ :
ముందుగా సినిమాలో స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ అని చెప్పాలి. చాలా వరకు పాత సినిమాలను మనకు గుర్తు చేస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే పెద్దగా ఆకట్టుకోవు సరికదా, అవి పేపర్ మీద బాగున్నాయని టీమ్ కి అనిపించినా స్క్రీన్ మీద ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు ప్రదీప్ ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. మరికొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడి పేలవమైన పనితనాన్ని నిరూపిస్తాయి. హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ సైతం పెద్దగా పండలేదు. మధ్యలో వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్స్ మాదిరిగా వచ్చి వెళ్తుంటాయి. అలానే యాక్షన్, వయొలెంట్ సన్నివేశాలు అయితే కొందరు ఆడియన్స్ కి పెద్దగా రీచ్ కావు. చాలా వరకు సినిమా సాగతీత గా ఉండడంతో పాటు సెకండ్ హాఫ్ అయితే కొంత ఆడియన్స్ కి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది అనే చెప్పాలి. అలానే గతంలో వచ్చిన పలు సినిమాల్లోని సీన్స్ ని అవి మనకు గుర్తు చేస్తాయి.
సాంకేతిక వర్గం :
సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ కి అద్భుతంగా మ్యూజిక్ అందించారు. ఇక కెమెరా మ్యాన్ రాజ్ తోట విజువల్స్ బాగున్నాయి. అయితే మూవీకి పెద్ద మైనస్ అయిన ఎడిటింగ్ విషయంలో టీమ్ మరింత శ్రద్ధ తీసుకుని కొంత రన్ టైం ట్రిమ్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా దర్శకుడు ప్రదీప్ వర్మ గురించి చెప్పాలి అంటే, ఒక ఇంటెన్స్ యాక్షన్ కాప్ స్టోరీ చెప్పాలనుకున్న ఆయన అందుకు అవసరమైన విధంగా డెప్త్ ఉన్న స్టోరీని రాసుకోవడం, అలానే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి.
తీర్పు :
ఫైనల్ గా అల్లూరి మూవీలో కేవలం కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి. నిజానికి దర్శకుడు మూవీ కోసం తీసుకున్న పాయింట్ బాగున్నా, దానిని స్క్రీన్ పై ఆకట్టుకునేలా తీయడంలో మాత్రం విఫలం అయ్యారు. అయితే శ్రీవిష్ణు పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నా మధ్యలో చాలావరకు సాగతీత స్క్రీన్ ప్లే, మూవీ మీద ఆసక్తికి పూర్తిగా తగ్గిస్తుంది. అయితే అల్లూరి మూవీలోని కొన్ని సీన్స్ మాత్రం మాస్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం నచ్చవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team