విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు
దర్శకుడు : రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సంగీత దర్శకులు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్
ఎడిటర్: తమ్మిరాజు
సంబంధిత లింక్స్: ట్రైలర్
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అమిగోస్. కాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఒకేలా కనిపించే వ్యక్తి(ల)ని కలవడం వల్ల కలిగే పరిణామాలపై ఈ చిత్రం సాగింది. కల్యాణ్ రామ్ (సిద్దార్థ్) తనలాంటి వ్యక్తి కోసం ఓ వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తాడు. ఈ క్రమంలో మంజు (కళ్యాణ్ రామ్ 2), అలాగే మైఖేల్ (కళ్యాణ్ రామ్ 3) పరిచయం అవుతారు. ముగ్గురు కలుస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, అసలు మైఖేల్ ఎవరు ?, ఎందుకు సిద్దార్థ్ ను టార్గెట్ చేశాడు ?, ఈ మధ్యలో మంజు ఎలా బుక్ అయ్యాడు ?, చివరకు వీరి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ గత చిత్రాలు కంటే భిన్నంగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అమిగోస్ లో మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. కళ్యాణ్ రామ్ తన స్టైలిష్ లుక్స్ తో అండ్ తన గ్రేస్ యాక్షన్ తో అదరగొట్టాడు. అన్నిటికీ మించి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా మైఖేల్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక క్లైమాక్స్ లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో వచ్చే చేజ్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి.
దర్శకుడు రాజేంద్ర రెడ్డి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా చాలా బాగా నటించింది. అలాగే బ్రహ్మాజీ, సప్తగిరిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తమ్మీద కళ్యాణ్ రామ్ నటుడిగా బాగా ఆకట్టుకున్నాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కోర్ పాయింట్ బాగున్నా.. దాని అనుగుణంగా కథనం లేదు. రెగ్యూలర్ గా, రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఒకేలా ఉన్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించి.. ఈ సినిమాలో చూపించినట్లు మరీ అంతలా ఒకరిగా మరొకరు చలామణి అయ్యే పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో ఉన్నాయా అనేది అనుమానమే.
అయితే, సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా ఎంటర్ టైన్ గా సాగదు. హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఓ కొత్త పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న కథలో కూడా డెప్త్ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
వినూత్న పాయింట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ అమిగోస్ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన స్టైలిష్ యాక్టింగ్ తో అండ్ యాక్టింగ్ లో తన వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన మరియు మెయిన్ పాయింట్, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team