సమీక్ష : అనగనగా ఒక చిత్రమ్ – పరమ బోరింగ్ ‘చిత్రమ్’

Anaganaga-Oka-Chitram-review

విడుదల తేదీ : 11 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ప్రభాకరరెడ్

నిర్మాత : ప్రభాకరరెడ్డి – కొడాలి సుబ్బారావు

సంగీతం : వినోద్ యాజమాన్

నటీనటులు : శివ, మేఘశ్రీ..


‘జగన్ నిర్దోషి’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా నటించిన రెండవ సినిమా ‘అనగనగా ఒక చిత్రమ్’. ప్రేమకథా చిత్రమ్ కి సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించిన ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మేఘశ్రీ హీరోయిన్ గా నటించింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

సోమరాజు(శివ) ఓ అనాధ, చిన్నా చితకా పనులు చేసుకుంటూ, సినిమాలు తీయాలనే పిచ్చిలో తిరుగుతున్న తన మామ పిచ్చి కాక్(ప్రభాస్ శీను)తో కలిసి ఉంటాడు. సోమరాజు పరిమళా దేవి అలియాస్ చిట్టి(మేఘశ్రీ)ని ప్రేమిస్తుంటాడు. చిట్టి తనతో క్లోజ్ గా ఉన్నప్పటికీ తన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వదు. కానీ సోమరాజు మాత్రం చిట్టి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని ఎదురు చూస్తూ తనకి ఉన్న ఇబ్బందులను క్లియర్ చేస్తూ ఉంటాడు. అలా ఓ సారి చిట్టి కోసం 7 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది. దాని కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో సోమరాజు మామ పిచ్ కాక్ ఒక ఐడియా ఇస్తాడు.

అదేమిటంటే రోజో సోమరాజు పనిచేసే పబ్ కి వచ్చి లక్ష తిప ఇచ్చే రణవీర్ సింగ్(సాయాజీ షిండే)ని కిడ్నాప్ చేయాలనుకుంటారు. చేసేస్తారు కూడా.. చేసిన తర్వాత వారికి తెలుస్తుంది అతని హైదరాబాద్ సిటీ డిజిపి అని.. దాంతో భయపడి పోయి ఆయన్ని వదిలేయాలి అన్న ఆలోచనలో పలు మిస్టేక్స్ చేస్తాడు. దానివలన డిజిపి మరియు సోమరాజు గ్యాంగ్ ని నక్సల్ లీడర్ అయిన క్రాంతి వీర్ కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని కొన్ని డిమాండ్స్ చేస్తారు. ఆ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఆ డిమాండ్స్ ని తీర్చి డిజిపిని బయటకి తీసుకు వచ్చిందా లేక సోమరాజు అండ బాచ్ వేరే ఏమన్నా ప్లాన్ చేసి అక్కడి నుంచి బయట పడ్డారా? అన్నది మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

పరమ రొటీన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ జానర్లో వచ్చిన సినిమానే ఇది. ఇలాంటి సినిమాల్లో కథ, కథనం బాలేకపోయినా కాస్తో కూస్తో బాగుండనిపించేది కొన్ని కామెడీ బిట్స్.. అదే రీతిలో ఈ సినిమాకి కాస్తో కూస్తో హెల్ప్ అయ్యింది ఆ కామెడీనే. హీరో కావాలని రంపచోడవరం నుంచి హైదరాబాద్ కి వచ్చిన వెన్నెల కిషోర్ పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. తనకి రాసిన వన్ లైన్స్ బాగానే పేలాయి. ఇకపోతే సెకండాఫ్ లో ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కమెడియన్ గా వెలుగొందుతున్న రచ్చ రాంబాబు పాత్రలో పృధ్వీ పంచ్ డైలాగ్స్, జోగీ బ్రదర్స్ వన్ లైనర్స్, ప్రభాస్ శీను పంచ్ లు బాగానే నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్ లో నక్సల్స్ గురించి సూర్య చెప్పే సీన్ బాగుంటుంది. హీరో శివ, హీరోయిన్ మేఘశ్రీలకు సినిమాలో చేయడానికి ఏమీ లేదు. కావున వారు వారి పాత్రల్లో ఓకే అనిపించారు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ ఒకటా రెండా.. చెప్పడానికి చాలానే ఉన్నాయి.. మేజర్ గా ఆడియన్స్ కి బాగా ఇబ్బంది పెట్టె విషయాలనే మనం చెప్పుకుందాం. సినిమా కథలో ఓ లైన్ అనేది ఉండదు. సినిమా కథ ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ఎండ్ అవుతుంది. కథలో ఏ ఒక్క విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు. మొదటి నుంచి కథలో ఏవేవో సబ్ ప్లాట్స్ ని చూపిస్తూ వచ్చి చివరికి అవన్నీ వదిలేసి ట్రైబల్ ప్రజల గురించి చెప్పి సినిమాని ముగించడం అర్ధరహితంగా ఉంటుంది. కథ ఇలా ఉందంటే ఇక కథనం ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించవచ్చు. కథనంలో అస్సలు బాలేదు. కథనంలో ఏ విషయమూ ఆడియన్స్ కి ఈ సినిమా చూడాలి అని ఫీలింగ్ కలిగించలేదు. దానివలన అందరూ ఎప్పుడు ఈ సినిమా అయిపోతుందా అనే ఫీలింగ్ లో సినిమా చూస్తుంటారు. ఇలాంటి కథనానికి తోడు నేరేషన్ అనేది బాగా అంటే బాగా స్లోగా ఉంది.

ఇక డైరెక్టర్ ఎక్కడా నటీనటుల నుంచి సినిమాకి అవసరమైన నటనని రాబట్టుకోలేకపోయాడు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో పాటలకి సందర్భం అనేది లేకుండా ఎలా పడితే అలా వస్తుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో మొదటి ప్లేస్ లో ఈ సినిమాని చేర్చాలి. సినిమాలో పాటలకి అస్సలు సందర్భాలు లేవు, ఫస్ట్ హాఫ్ లో 3 పాటలు ఉండాలి, సెకండాఫ్ లో 3 పాటలు ఉండాలి అనే తరహాలో పాటలని షూట్ చేసి డైరెక్టర్ కి మూడ్ వచ్చిన ప్రతి ప్లేస్ లో వేసుకుంటూ వచ్చేసాడు. ఇక సినిమాలో కామెడీ కూడా అతి తక్కువగా వర్కౌట్ అయ్యిందే తప్ప ఆద్యంతం అయితే ఎంటర్టైనింగ్ గా లేదు. సినిమాలో ఏ పాత్రని పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. దాని వలన ఏ ఒక్కరి ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. సినిమాలో ఒక్కటంటే ఒక్క అలాజిక్ కూడా మీకు కనపడదు.

సాంకేతిక విభాగం :

అనగనగా ఒక చిత్రమ్ అనే సినిమాకి టెక్నికల్ పెదగ్గ ఆహేల్ప్ అయిన డిపార్ట్మెంట్ ఏదీ లేదని చెప్పాలి.. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ – కథనం – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది ప్రభాకరరెడ్డి. సినిమాటోగ్రఫీ జస్ట్ యావరేజ్ అనేలా ఉంది. కథనం అనేది అస్సలు బాలేదు. సినిమాలో ఆడియన్స్ ఒక్కసారి కూడా ఇదేదో బాగానే ఉండే అనే ఫీలింగ్ ని కలిగించలేదు. ఇక పోతే డైరెక్టర్ గా కూడా సీన్స్ రాసుకున్న సీన్స్ ని పర్ఫెక్ట్ గా తీయడంలో, ప్రధాన నటీనటుల నుంచి పర్ఫెక్ట్ నటనని రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక అజయ్ కుమార్ రాసిన కథలో ఇదీ పాయింట్ అని చెప్పుకునేలా ఏదీ లేదు, ఇక డైలాగ్స్ లో మాత్రం కొన్ని కొన్ని డైలాగ్స్ పరవాలేధనిపించాయి.

ఇక వినోద్ యాజమాన్య అందించిన సాంగ్స్ సందర్భానుసారంగా రాకపోయినా ఓకే ఓకే అనేలా ఉన్నాయి. కానీ నేపధ్య సంగీతం మాత్రం అస్సలు బాలేదు. చాలా చోట్ల నటీనటులు మాట్లాడే డైలాగ్స్ వినపడకుండా హై పిచ్ లో రీ రికార్డింగ్ చేసాడు. సాయి బాబు ఎడిటింగ్ అస్సలు బాలేదు. విజయ్ కృష్ణ ఆర్ట్ వర్క్ కూడా అంతంత మాత్రంగా ఉంది. ప్రభాకరరెడ్డి – కొడాలి సుబ్బారావు నిర్మాణ విలువలు డీసెంట్ అనేలా ఉన్నాయి.

తీర్పు :

కామెడీ కామెడీ అంటూ ఒక మూస ఫార్మాట్ లో తెలుగులో వస్తున్న చాలా చిన్న సినిమాలలానే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. పైన చెప్పినట్టు కామెడీ ఫ్లేవర్ నే ఎక్కువ టార్గెట్ చేస్తూ చేసిన సినిమా కావడం వలన అక్కడక్కడా వెన్నెల కిషోర్, పృధ్వీ, ప్రభాస్ శీను చేసిన కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఇక దానికి మించి బాగున్నాయి అని చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేవు. ఓవరాల్ గా ‘అనగనగా ఓ చిత్రమ్’తో ‘ప్రేమ కథా చిత్రమ్’ లా మేజిక్ క్రియేట్ చేయలేకపోయాడు డైరెక్టర్ ప్రభాకరరెడ్డి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version