సమీక్ష: “అంటే సుందరానికీ” – క్లీన్ ఫ్యామిలీ & కామెడీ ఎంటర్‌టైనర్

సమీక్ష: “అంటే సుందరానికీ” – క్లీన్ ఫ్యామిలీ & కామెడీ ఎంటర్‌టైనర్

Published on Jun 11, 2022 3:03 AM IST
Ante Sundaraniki Movie Review

విడుదల తేదీ : జూన్ 10, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు

దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై

సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

ఎడిటర్: రవితేజ గిరిజాల


న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”. మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

కథ:

సుందర్ ప్రసాద్ (నాని) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు మరియు అతను కుటుంబానికి ఏకైక వారసుడు. సుందర్ కుటుంబం వారి గుడ్డి నమ్మకాలు మరియు సంప్రదాయాలు అతనిని చిత్రహింసలకు గురిచేస్తుంటాయి. ఒక రోజు సుందర్ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని జాతకరీత్యా అడ్డంకులు ఉన్నాయని సుందర్ కుటుంబం దానిని తిరస్కరిస్తుంది. ఇంతలో అతను ఫోటోగ్రాఫర్ అయిన లీలా థామస్ (నజ్రియా)ని చూసి ప్రేమలో పడతాడు అయితే సుందర్ హిందూ కుటుంబానికి మరియు లీల క్రిస్టియన్ కుటుంబానికి చెందడం వల్ల సమస్యలు మొదలవుతాయి, అయితే ఇటు సుందర్ కుటుంబం లీలాని కోడలిగా ఒప్పుకోరు, అదే విధంగా లీలా కుటుంబం కూడా సుందర్‌ను అల్లుడుగా అంగీకరించదు, ఇక వేరే దారి లేక సుందర్ మరియు లీలా థామస్ ఒక ప్లాన్ వేస్తారు. అయితే ఆ ప్లాన్ ఏంటి? తన ప్రేమను ఒప్పించుకోవడం కోసం సుందర్ ఏం చేశాడు? అనేవి తెలియాలంటే మీరు స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కామెడీ, యాక్షన్ ఏదైనా కూడా నాని తనదైన నటనతో మెప్పిస్తాడు. ఇక డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ కి నాని పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా సుందర్ ప్రసాద్‌గా నాని చక్కగా నటించాడు. సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశాడు.

ఇక లీలా థామస్‌గా నటిచిన నజ్రియాకి ఇది తెలుగులో తొలి చిత్రం అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించింది. ఆమె తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ మరియు లీలా క్యారెక్టర్‌కి వాయిస్ కూడా ఇవ్వడం హైలెట్ అని చెప్పాలి. నాని తండ్రిగా నరేష్ చాలా బాగా చేసాడు మరియు శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి మరియు ఇతరులు తమ వంతు పాత్రను పోషించారు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ సెన్సిటివ్ టాపిక్‌ని హర్ట్ చేయకుండా చాలా అద్భుతంగా డీల్ చేశాడు. కులాంతర వివాహాల నేపధ్యంలో మనం చాలా సినిమాలే చూసాం ఆ సినిమాలన్నీ సీరియస్‌గా డీల్ చేయబడ్డాయి. కానీ అంటే సుందరానికి కామిక్‌గా డీల్ చేయబడింది.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీయడంతో ప్రేక్షకుడిని ఒకింత బోరింగ్‌కి గురిచేసాయి. ఇక ఇంటర్వెల్ సమయానికి కాస్త ఒకే అనిపించినా ఇంకా కథ పూర్తిగా ప్రేక్షకుడికి అర్ధం కాదు.

ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్‌తో ఒకే అనిపించినా క్లైమాక్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అంతేకాకుండా ముఖ్యంగా సినిమా నిడివిపై ఒకింత దృష్టి పెట్టి అనవసరమైన దగ్గర కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా కట్ చేసి ఉండాల్సింది. ఇక కామెడీ, మెసేజ్‌కి తగ్గట్టుగా హీరో, హీరోయిన్‌ల మధ్య కాస్తంత రొమాంటిక్ సన్నివేశాలు చూపించి ఉంటే ఇంకా ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం:

ఇక సాంకేతిక విభాగం గురుంచి మాట్లాడుకుంటే దర్శకుడు వివేక్ ఆత్రేయ రచనలలో ఎల్లప్పుడూ తెలుగుదనం ప్రతిబింబిస్తుంది. అన్ని పాత్రలకి కూడా ప్రాముఖ్యత ఇస్తూ రాయడం అంత సులువేమి కాదు. కానీ ఈ విషయంలో వివేక్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.అందరూ చెప్పినట్టే రొటీన్‌గా కాకుండా కాస్త కామెడీ మరియు క్యూరియాసిటీని కథకు జోడించి మెసేజ్ ఇవ్వడం చాలా బాగుంది.

నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రెండు విభిన్నమైన విజువల్స్ మనం ఇందులో చూడవచ్చు. సుందర్ ప్రపంచం ఒకలాగా ఉంటుంది మరియు లీలా ప్రపంచం ఒలాగా కనిపిస్తుంది మరియు మరియు వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే అంటే సుందరానికీ మూవీలో సంప్రదాయాలు, కట్టుబాట్లు మనుషులకే కానీ మనసులకు కాదనీ, అలాగే కులాంతర వివాహాలు తప్పు కాదనే మెసేజ్‌కి కాస్త కామెడీనీ జోడించడం సరికొత్తగా అనిపించింది. కాస్త నిడివి ఎక్కువగా ఉండడం, హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వంటి వాటిని పక్కన పెడితే మాస్ ఆడియన్స్‌ని కాకుండా మిగతా వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు