సమీక్ష : అనుభవించు రాజా – కొన్ని నవ్వుల కోసం మాత్రమే

Anubhavinchu Raja Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుకలం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా

దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి

నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ

సంగీత దర్శకుడు: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: విజయ్ బిన్ని

ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా “అనుభవించు రాజా”. ట్రైలర్ మరియు టీజర్ లతో ఆడియెన్స్ లో మంచి బజ్ ని తెచ్చుకుంది. ఇక ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎంతమేర ప్రేక్షకుడిని ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టైతే.. హైదరాబాద్ లోని ఓ సెక్యూరిటీ గార్డ్ గా రాజు(రాజ్ తరుణ్) చిన్నపాటి ఉద్యోగం చేస్తూ బ్రతుకుతాడు. మరి ఈ సమయంలోనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయినటువంటి హీరోయిన్ కాశీష్ ఖాన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడ నుంచి తన లైఫ్ లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మరి తనకి ఎదురైన సవాళ్లు ఏంటి? అతడిని చంపే వరకు పరిస్థితులు ఎలా మారుతాయి? సినిమాలో తన విలేజ్ బ్యాక్ డ్రాప్ కి ఎలా కనెక్షన్ ఉంటుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మంచి ఫన్ కోరుకునే వారికి సందర్భానుసారం మంచి కామెడీ దొరుకుతుంది. అలాగే రాజ్ తరుణ్ ఈ సినిమాలో మంచి లుక్స్ మరియు నటనలతో ఇంప్రెస్ చేస్తాడు. ఆల్రెడీ తన కామెడీ టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అందరికీ తెలుసు అవి ఈ సినిమాలో తన రెండు షేడ్స్ లో దర్శకుడు కరెక్ట్ గా రాబట్టగలిగాడు. ఓ సెక్యూరిటీ గార్డుగా పల్లెటూరులో సరదా యువకుడిగా సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు.

ఇక హీరోయిన్ కాశీష్ ఖాన్ కి ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. తన లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ, నడవడిక అంతా నీట్ గా సినిమాలో కనిపించాయి. అలాగే రాజ్ తరుణ్ కి తనకి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యింది. అలాగే తమిళ నటుడు నరేన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు.

వీరితో పాటు కమెడియన్ సుదర్శన్ తాను ఉన్న కాసేపు మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. ఇంకా నటుడు అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ రోల్స్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. అలాగే సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ వీక్షకులను ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక సినిమాలో అంతగా ఆకట్టుకోని విషయాలకు వస్తే..అవి ఒకింత ఎక్కువే అనిపిస్తాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పర్వాలేదు అనిపించినా తర్వాత కనిపించే భాగం అంతా కాస్త సంబంధ రాహిత్యంగా అనిపిస్తుంది. ఒక సరైన ఫ్లో లేకుండా విలేజ్ డ్రామాలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది.

పోనీ అదైనా కొత్తగా ఉంటుందా అనుకుంటే అక్కడ కథనం కూడా రొటీన్ గానే ఉంటుంది. దీనితో సెకండాఫ్ లో కొత్తదనం పెద్దగా అనిపించదు. అలాగే సెకండాఫ్ కాస్త ఎక్కువ గానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకో పెద్ద మైనస్ ఏమిటంటే క్యాస్టింగ్ పరంగా లోపం కనిపిస్తుంది.

రవి, అరియనా లాంటి వాళ్ళని పెట్టుకున్నా వాళ్లకి డిజైన్ చేసిన పాత్రలు వాటి ఎమోషన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం. అలానే రాజ్ తరుణ్, అజయ్ ల మధ్య ఎపిసోడ్స్ కూడా ఏమంత ప్రభావంతంగా అనిపించవు. రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించి డీటెయిల్స్ కూడా అంత అర్ధవంతంగా ఉండవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాతల నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి. టెక్నీకల్ టీం లో విజయ్ బిన్నీ సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా ఉంది, ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ కి వెళ్ళినప్పుడు. అలాగే గోపి సుందర్ ఇచ్చిన స్కోర్ కానీ పాటలు కానీ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ చెయ్యాల్సింది.

ఇక దర్శకుడు శ్రీను గవిరెడ్డి విషయానికి వస్తే ఓవరాల్ గా తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు. కొంతవరకు తన పనితనం బాగానే ఉన్నా మిగతా సగం ప్రెజెంటేషన్ లో పునరాలోచన చేసుకోవాల్సింది. కథలో అంత కొత్తదనం లేకపోయినా కథనం అయినా కూడా కొత్తగా ప్రెజెంట్ చెయ్యాల్సింది. అలాగే క్యాస్టింగ్ పరంగా కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంది.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ “అనుభవించు రాజా” అక్కడక్కడా నవ్వుకోడానికి బాగానే ఉంటుంది, రాజ్ తరుణ్ మరియు డెబ్యూ నటి కాశీష్ ఖాన్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడం సరైన ఎమోషన్స్ లోపం వంటివి నిరాశపరుస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకండాఫ్ మాత్రం అంతగా రుచించదు సో కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఈ వారాంతానికి ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version