ఓటిటి సమీక్ష: ATM – జీ5 లో తెలుగు వెబ్ సిరీస్

ఓటిటి సమీక్ష: ATM – జీ5 లో తెలుగు వెబ్ సిరీస్

Published on Jan 20, 2023 9:02 PM IST
ATM Telugu Movie Review

విడుదల తేదీ : జనవరి 20, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వీజే సన్నీ, సుబ్బరాజు, పృధ్వీ, కృష్ణ బురుగుల, రవి రాజ్, రోయల్ శ్రీ, దివి వడ్త్యా, దివ్యవాణి

దర్శకుడు : సి చంద్ర మోహన్

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత

సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి

సినిమాటోగ్రఫీ: మోనిక్ కుమార్ జి

ఎడిటర్: అశ్విన్ ఎస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథతో, బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ నటించిన ATM సిరీస్ జీ లో నేటి నుండి ప్రసారం అవుతోంది. 8 ఎపిసోడ్ ల సిరీస్ ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

హైదరాబాద్‌లోని మురికివాడలకు చెందిన జగన్ (విజె సన్నీ), కార్తీక్ (కృష్ణ బూరుగుల), హర్ష (రోయల్ శ్రీ), అభయ్ (రవి రాజ్) లు బ్రతకడం కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఓ రోజు 10 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్న కారును దొంగిలించారు. 10 కోట్ల రూపాయల విషయం తెలియకుండానే కారును ఎవరికో అమ్మేశారు. వజ్రాల యజమాని వారిని కొట్టిన తర్వాత, 10 రోజుల్లో 10 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని జగన్ డీల్ ప్రతిపాదించాడు. జగన్, అతని స్నేహితులు 25 కోట్ల రూపాయల ఉన్న ఏటీఎం వ్యాన్‌ ను దొంగిలిస్తారు. హెగ్డే (సుబ్బరాజు), క్రూరమైన ACP ఈ కేసును నిర్వహించడానికి నగరానికి వస్తాడు. హెగ్డే దొంగలను పట్టుకుని దోచుకున్న డబ్బును రికవరీ చేశారా? జగన్, అతని స్నేహితులు నిజంగా డబ్బు దోచుకున్నారా? ఈ కేసులో ఎమ్మెల్యే కావాలనుకున్న గజేంద్ర (పృద్వీ రాజ్) ప్రమేయం ఎలా ఉంది? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రాసిన కథ చాలా బాగుంది. చక్కటి హీస్ట్ స్టోరీని రాసినందుకు అతన్ని మెచ్చుకోవాలి. ఈ సిరీస్ కథనం చెప్పే విధానం కూడా బాగానే ఉంది. కొన్ని ఎపిసోడ్స్‌ లో ప్రేక్షకులను కట్టి పడేసేలా సీరియస్ మూడ్‌ని క్రియేట్ చేయడంలో దర్శకుడు చంద్రమోహన్ సక్సెస్ అయ్యాడు.

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ VJ సన్నీ ఈ సిరీస్ లో చాలా ఆకట్టుకున్నాడు. తన బెస్ట్ ను అందించారు. అతని యాటిట్యూడ్, మేకోవర్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అతని డైలాగ్ డెలివరీ కూడా బాగుంది మరియు రాబోయే రోజుల్లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. రోయల్ శ్రీ పోషించిన హర్ష, సిరీస్‌లోని ఆసక్తికరమైన పాత్రలలో ఒకటి. దర్శకుడు అతని పాత్రను బాగా డిజైన్ చేశాడు.

వీజే సన్నీ కాకుండా, కనికరంలేని పోలీసు అధికారిగా సుబ్బరాజు చాలా బాగా నటించాడు. ఇటీవలి కాలంలో అతను పోషించిన ఉత్తమ పాత్రలలో ఇది ఒకటి అని చెప్పాలి. అతని ఎంట్రీ తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారింది. అతని బిహేవియర్, డార్క్ హ్యూమర్, చమత్కారమైన పంచ్‌లు బాగున్నాయి. మిగిలిన పాత్రలు వారి బెస్ట్ అందించారు.

 

మైనస్ పాయింట్స్:

 

హీస్ట్ కథను వివరించాలనుకున్నప్పుడు, దానిని ఆకర్షణీయంగా వ్రాయాలి. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉన్నంత మాత్రాన సిరీస్ ఆసక్తిని కలిగించదు. ప్రేక్షకులు తమ కళ్లను తెరపైకి అతుక్కుపోయేలా పర్ఫెక్ట్ గా నేరేట్ చేయాలి. మొదటి నాలుగు ఎపిసోడ్‌లు స్లో పేస్‌లో నడుస్తాయి, విసుగు తెప్పిస్తాయి. తరువాతి ఎపిసోడ్స్ చక్కగా ఉన్నాయి. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ATM ని ఆకర్షణీయమైన హీస్ట్ థ్రిల్లర్‌గా మార్చే అవకాశం ఉంది.

కథ బాగుంది. కానీ, ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కథలో దివి మరియు దివ్యవాణి వంటి కొన్ని అనవసరమైన పాత్రలు ఉన్నాయి. వీరికి సంబంధించిన సన్నివేశాలు కథకు పూర్తిగా అనవసరం. దానికి తోడు కొన్ని సన్నివేశాలు లాజికల్ గా లేవు.

పృధ్వీ రాజ్ పోషించిన గజేంద్ర ప్రారంభంలో పవర్ ఫుల్ పోలిటికల్ లీడర్ గా చూపించారు. కానీ స్క్రిప్ట్ రైటర్ సీజన్ ముగిసే సమయానికి అతని పాత్రను బలహీనపరిచాడు. గజేంద్ర పాత్రలో కథను మరింత ఆసక్తిని రేకెత్తించేలా మంచి సామర్థ్యం ఉన్నందున, మేకర్స్ ఒక మంచి నటుడుని ఎంపిక చేసి ఉండాల్సింది. పృధ్వీ పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన విధానం ఆకట్టుకోలేదు.

మేకర్స్ సీజన్‌ను కొనసాగించాలని భావించినట్లయితే, దానిని సరిగ్గా ముగించాలి. సిరీస్ ను చూసిన వారు, దోపిడీ వెనుక మరో వ్యక్తి ఉన్నాడని హెగ్డేకి ఎలా తెలుసు? అనేది కచ్చితం గా ప్రశ్నిస్తారు. దోపిడీ ఎలా జరిగిందో హెడ్జ్ ఊహించే సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయి. అయితే తరువాతి సీజన్ గురించి క్యూరియాసిటీని పెంచడానికి దర్శకుడు దానిని రూపొందించాడని మనం భావించాలి.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు చంద్ర మోహన్ ఈ సిరీస్‌ను అద్భుతంగా రూపొందించడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. ఈ రకమైన హీస్ట్ స్టోరీకి, ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన మరియు రేసీ స్క్రీన్‌ప్లే అవసరం. కాబట్టి అతను స్క్రీన్‌ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.

మోనిక్ కుమార్ జి కెమెరా వర్క్ బాగుంది. డ్రోన్ షాట్‌లు, స్మోక్ ఎఫెక్ట్ షాట్‌లు చాలా బాగా క్యాప్చర్ చేయబడ్డాయి. విజువల్స్‌ రిచ్‌గా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అశ్విన్ ఎస్ ఎడిటింగ్ బాగుండేది, చాలా సన్నివేశాలను కత్తిరించాల్సి ఉంది. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వీఎఫ్ఎక్స్ టీమ్ ఇంకా బాగా పని చేసి ఉండాల్సింది.

 

తీర్పు:

 

మొత్తం మీద, హరీష్ శంకర్ రాసిన ATM సిరీస్, అక్కడక్కడ ఆకట్టుకొనే హీస్ట్ థ్రిల్లర్. వీజే సన్నీ, సుబ్బరాజు లు సిరీస్ లో మంచి నటనను కనబరిచినప్పటికీ, మొదటి కొన్ని ఎపిసోడ్‌లలో స్లోగా సాగే కథనం కారణంగా ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు, ల్యాగ్ సీన్స్ పట్టించుకోకుండా ఉంటే, ఈ వారాంతంలో సిరీస్ ను చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు