ఆడియో సమీక్ష : కృష్ణం వందే జగద్గురుమ్ – మణిశర్మ ఈజ్ బ్యాక్

ఆడియో సమీక్ష : కృష్ణం వందే జగద్గురుమ్ – మణిశర్మ ఈజ్ బ్యాక్

Published on Oct 8, 2012 10:00 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్ర ఆడియో వేడుక నిన్న హైదరాబాద్లోని సినీమాక్స్ లో జరిగింది. స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ ఆల్బంలో ఆరు పాటలు మరియు ఒక థీం మ్యూజిక్ ఉంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం …

1. పాట : అరరే పసి మనసా
గాయనీ గాయకులు : నరేంద్ర, శ్రావణ భార్గవి
రచయిత : ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి

తన కవిత్వపు పదజాలంతో ఆకట్టుకునే ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి ఈ రొమాంటిక్ డ్యూయెట్ ని రచించారు. చాలా ఫ్రెష్ ఫీల్ ఉండే ఈ ట్రాక్ కి నరేంద్ర మరియు శ్రావణ భార్గవి తమ గాత్రంతో పూర్తి న్యాయం చేసారు. ఈ లవ్ ఫీల్ పాటలో మణిశర్మ వీణతో మరియు చేతులతో వాయించే వాయిద్యాలతో వినసొంపుగా పాటను తీర్చిదిదారు. ఒక రెండు మూడు సార్లు వింటే ఈ పాట మీకు బాగా కనెక్ట్ అవుతుంది.

 

2. పాట : సై అంద్రి నాను
గాయనీ గాయకులు : శ్రేయా ఘోషల్, రాహుల్ సిల్పిగంజ్/ దీపు
రచయిత : ఈ.ఎస్ మూర్తి

ఇది సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ మరియు ఇది ‘లీడర్’ సినిమాలో వచ్చే ‘రాజశేఖరా’ పాటని పోలి ఉంది. ఈ పాటలో శ్రేయా ఘోషల్ వాయిస్ చాలా సూపర్బ్ అని చెప్పుకోవాలి మరియు ఈ పాటకి తగ్గట్టుగా ఆమె ఎంతో హై ఎనర్జీ లెవల్స్ పాడడంతో ఇది వినడానికి చాలా బాగుంది. ఈ.ఎస్ మూర్తి తెలుగు మరియు కన్నడ పదాలు కలగలిపి ఈ పాటను రాసారు. మంచి ఫాస్ట్ బీట్ తో సాగే ఈ పాటకి సరిపోయే విధంగా మణిశర్మ మ్యూజిక్ ఉంది. ఈ పాటకి సమీరా రెడ్డి చిందేయనుండడంతో, పాట విజువల్స్ చాలా బాగుంటాయని ఆశించవచ్చు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ పాటలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్నారు.

 

3. పాట : కృష్ణం వందే జగద్గురుమ్
గాయకుడు : డా. ఎస్.పి బాలసుబ్రమణ్యం
రచయిత : ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి

ఈ పాట వినగానే మీకు రెండు విషయాలు అర్ధమవుతాయి. మొదటిది ఈ పవర్ఫుల్ పాటకి డా. ఎస్.పి బాలసుబ్రమణ్యం తప్ప వేరెవరూ న్యాయం చెయ్యలేరు, రెండవ దానికొస్తే ఇప్పుడున్న తెలుగు పాటల రచయితలలో ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి తప్ప ఇంకెవరూ ఇలాంటి పాటను రాయలేరు. ఆ ఇద్దరూ కలిసి ఈ పాటని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించారు. మణిశర్మ ఈ పాటని హాన్స్ జిమ్మర్ ని స్ఫూర్తిగా తీసుకొని చేసినట్టు ఉంది, కానీ ఈ పాటలో మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. ఈ పాట 9 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. మన భారతీయ వేదాంతంతో సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.

 

4. పాట : స్పైసీ స్పైసీ గర్ల్
గాయనీ గాయకులు : హేమచంద్ర, చైత్ర, శ్రావణ భార్గవి
రచయిత : ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి

ఈ పాట విన్న తర్వాత ఈ పాట ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారే రాసారా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను. ‘స్పైసీ స్పైసీ గర్ల్’ ఇప్పటి తరం కోరుకునే మోడరన్ ఫీల్ తో సాగే డ్యూయెట్. హేమచంద్ర, చైత్ర మరియు శ్రావణ భార్గవి తమ వాయిస్ తో ఓకే అనిపించుకున్నారు. ఈ పాటలో ప్రత్యేకించి మణిశర్మ సంగీతం గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సాంగ్ ఓకే, తెరపై ఈ పాట విజువల్ బాగుంటే అందరికీ చేరువవుతుంది.

 

5. పాట : రంగ మార్తాండ
గాయనీ గాయకులు : రఘుబాబు, హేమచంద్ర, సాయి మాధవ్ బుర్ర
రచయిత : సాయి మాధవ్ బుర్ర

మూడు నిమిషాల పాటు ఎంతో ఆహ్లాదకరంగా నాటకాల గురించి మరియు నాటకాలు వేసే వారి జీవితాల గురించి సాగే ఈ పాట సినిమాలో నాటకాల సన్నివేశాలు వచ్చేటప్పుడు బ్యాక్ గ్రౌండ్లో రావచ్చు లేదా ఇది రానా ఇంట్రడక్షన్ పాట కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ పాటలో కమెడియన్ రఘుబాబు కొన్ని లైన్స్ పాడారు. సాయి మాధవ్ బుర్ర లిరిక్స్ ఓకే అనిపించగా, మణిశర్మ ఈ పాట మ్యూజిక్లో ఎక్కువ భాగం సింథసైజర్ ను ఉపయోగించారు.

 

6. పాట : ఛల్ ఛల్ ఛల్
గాయకుడు : జోఅన్న
రచయిత : సాయి మాధవ్ బుర్ర

ఈ సోలో సాంగ్ కి జోఅన్న తన గాత్రాన్ని అందించగా, సాయి మాధవ్ బుర్ర సాహిత్యాన్ని అందించారు. క్లబ్ సాంగ్ ఫీల్ ని కలుగ జేసే ఈ పాటని ఎలా చిత్రీకరించి ఉంటారా అని ఆసక్తిగా ఉంది. ఈ పాటకి మణిశర్మ సంగీతం ఓకే, సాయి మాధవ్ బుర్ర సాహిత్యం గురించి మాట్లాడుకోవాల్సినంత ఈ పాటలో ఏమీ లేదు.

7. పాట : పరిణామం (థీం)

చాలా బాగా కంపోజ్ చేసిన ఇన్స్ట్రుమెంటల్ థీం సాంగ్ ఇది. ఈ పాటలో కూడా హన్స్ జిమ్మర్ సంగీతం స్ఫూర్తి కనిపిస్తుంది. 6 నిమిషాల 39 సెకన్లు సాగే ఈ లాంగ్ థీం సాంగ్ ని సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో వాడి ఉంటారు. ఈ థీం కోసం ఆర్కెస్ట్రాని బాగా వాడుకున్నారు మరియు ఈ ట్రాక్ వినడానికి చాలా బాగుంది.

 

తీర్పు :

‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఆల్బమ్ బాగుంది, స్వతహాగా నాకు ఇందులో మూడు పాటలు బాగా అనిపించాయి, అవి ‘ కృష్ణం వందే జగద్గురుమ్’, ‘అరరే పసి మనసా’ మరియు ‘సై అంద్రే నాను’. అలాగే థీం సాంగ్ గా ఇచ్చిన ‘పరిణామం’ సాలిడ్ గా ఉంది. ఈ పాటలతో మణిశర్మ మన పురాతన సంగీతాన్ని మళ్ళీ వినిపించారు. ముఖ్యంగా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ థీం సాంగ్ కంపోసింగ్ మరియు రికార్డింగ్ కి మణిశర్మకి హాట్సాఫ్ చెప్పాలి. గత కొంత కాలంగా తన మ్యూజిక్ తో అంతగా ఆకట్టుకోలేకపోతున్న మణిశర్మ ఈ సినిమాతో తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించారు. ఇప్పటివరకు రానా కెరీర్లో వచ్చిన పూర్తి కమర్షియల్ ఆల్బమ్ ఇదే, అలాగే దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని బాగా తీర్చిదిద్దారు.

Click Here To Listen To KVJ Audio Songs

సంబంధిత సమాచారం

తాజా వార్తలు