ఆడియో సమీక్ష : రామయ్యా వస్తావయ్యా – మెలోడియస్ అండ్ పెప్పీగా సాగే ట్యూన్స్

Ramayya_Vasthavayya_Audio_Review

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సమంత – శృతి హాసన్ హరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో నిన్న సాయంత్రం జరిగింది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత, హరీష్ శంకర్ డైరెక్టర్. సూపర్ హిట్ మూవీ ‘బృందావనం’ తర్వాత ఎన్.టి.ఆర్ – థమన్ – దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఈ ఆడియోపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పుడు ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ఎలా ఉందో చూద్దాం..

1. పాట : జాబిల్లి నువ్వే చెప్పమ్మా

గాయకుడు : రంజిత్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

‘జాబిల్లి నువ్వే చెప్పమ్మా’ పాట ఆల్బంలో వచ్చే మొదటి మెలోడి మరియు సోలో సాంగ్. మెలోడియస్ గా సాగే ఈ పాటని రంజిత్ ఎంతో కేర్ తీసుకొని పాడాడు. పాటకి అతని వాయిస్ బాగా సెట్ అయ్యింది. థమన్ ఈ పాటలో వయొలిన్ మరియు డ్రమ్ బీట్స్ ని చాలా లో సౌండ్ వచ్చేలా ఉపయోగించడం వల్ల మ్యూజిక్ బాగా వచ్చింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం వినసొంపుగా ఉంది. ఇది సినిమాలో ఎన్.టి.ఆర్ తనపై కోపంగా ఉన్న లేదా అలిగిన సమంతని బుజ్జగించడానికి పాడే పాట అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్ వన్ మినిట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి సాంగ్ ఇంకా బాగుంటుందని ఆశించవచ్చు. ఆల్బంలో ఇదొక బెస్ట్ సాంగ్ అవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

 

2. పాట : పండగ చేస్కో

గాయకుడు : కె.కె

సాహిత్యం : శ్రీ మణి

‘పండగ చేస్కో’ సాంగ్ సినిమాలో హీరోపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ అయ్యే అవకాశం ఉంది. శ్రీ మణి ఈ పాటకి సాహిత్యం అందించాడు. పాట మధ్య మధ్యలో ఇంగ్లీష్, హిందీ పదాలని వాడి రాసిన ఈ పాట హీరో పాత్ర ఎలా ఉంటుందో మనకు చెప్పేలా ఉంది. శ్రీమణి సాహిత్యం ఓకే. పాటకి తగ్గట్టు కె.కె తన చక్కని గాత్రాన్ని అందించాడు. ఈ పాటలో తమన్ వయొలిన్, కీ బోర్డు సౌండ్స్ కి డ్రమ్ బీట్స్ ని జత చేసి పాటకి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అలాగే పాట మధ్యలో వచ్చే సన్నాయి సౌండ్, అలాగే దానితో పాటు వచ్చే బీట్స్ బాగున్నాయి. ఈ పాట విన్నప్పుడు నాకు ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ఊర్వశి ఊర్వశి’ పాటని గుర్తుకు తెచ్చుకుంది. ఈ పాటలో ఎన్.టి.ఆర్ నుంచి ప్రేక్షకులు కొన్ని మంచి మంచి స్టెప్స్ ఆశించవచ్చు.

3. పాట : ఓ లైలా

గాయకుడు : రాహుల్, కోరస్

సాహిత్యం : భాస్కర భట్ల

ఆల్బంలో ‘ఓ లైలా’ అంటూ సాగే మరో సోలో సాంగ్ ని సింగర్ రాహుల్ పాడారు. ఈ పాట హీరో హీరోయిన్ వెనకపడుతూ ప్రేమించమని సరదాగా ఏడిపించే సాంగ్ గా ఉంటుందని ఆశించవచ్చు. ఈ పాట మధ్యలో ‘నేనేమంటానంటే’ అని వచ్చే ఎన్.టి.ఆర్ వాయిస్ బాగుంది. భాస్కర భట్ల అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఎక్కువగా డ్రమ్స్ మాత్రమే వాడి థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది, అలాగే ఈ పాట మ్యూజిక్ లో కాస్త తమిళ్ ఫ్లేవర్ మరియు వెడ్డింగ్ ఆర్కెస్ట్రా సాంగ్ లా అనిపిస్తుంది. ఈ పాటని సరిగ్గా షూట్ చేస్తే మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చే అవకాశం ఉంది.

 

4. పాట : నేనెప్పుడైన

గాయనీ గాయకులు : శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్

సాహిత్యం : సాహితి


‘నేనెప్పుడైన’ పాటని శంకర్ మహదేవన్ – శ్రేయా ఘోషల్ కలిసి పాడిన డ్యూయెట్ సాంగ్. వీరిద్దరూ వాయిస్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని పాటకి ప్రాణం పోసారు. పాట వినడం మొదలు పెట్టగానే మనల్ని మనం మరిచిపోయే రీతిలో ఈ పాటని ఆలపించారు. శంకర్ మహదేవన్ – శ్రేయా ఘోషల్ ల వాయిస్ ఈ పాటకి హైలైట్ అని చెప్పుకోవాలి. సాహితి అందించిన సాహిత్యం చాలా బాగుంది. ఈ పాటలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చెప్పుకునే సాహిత్యాన్ని సాహితీ గారు చాలా బాగా రాశారు. థమన్ మ్యూజిక్ కూడా పాటకి బాగా సరిపోయింది, అలాగే ట్యూన్ ఎంతో కాచీగా ఉంది. వినేకొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాటని స్పెయిన్ లోని సూపర్బ్ లోకేషన్స్ లో షూట్ చేసారు. కావున ఈ పాట చూడటానికి చాలా బాగుంటుందని ఆశించవచ్చు. ఈ ఆల్బంలో ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

5 పాట : కుర్రఈడు

గాయకుడు : శంకర్ మహదేవన్, సుచిత్ర

సాహిత్యం : శ్రీ మణి

‘కుర్రఈడు’ పాట ముందు బెంచ్ వారిని ఆకట్టుకునే మాస్ డ్యూయెట్ సాంగ్. శంకర్ మహదేవన్ – సుచిత్ర ఈ పాటని ఆలపించారు. వీరిద్దరూ పాటలో ఫీల్ మరియు ఎక్కడా జోష్ తగ్గకుండా బాగా పాడారు. శ్రీమణి సాహిత్యం బాగుంది. ఒక పెళ్ళిలో వచ్చే ఈ పాటకి తగ్గట్టుగానే డ్రమ్స్, వయొలిన్, గిటార్ ని ఉపయోగించి థమన్ ట్రేడ్ మార్క్ మ్యూజిక్ తో సాంగ్ ని కంపోజ్ చేసాడు. కానీ ఈ పాటలో వచ్చే బీట్స్ ఇది వరకు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఈ పాటలో ఎన్.టి.ఆర్ – సమంత మధ్య కెమిస్ట్రీ మరియు కలర్ఫుల్ గా చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు, అలాగే ఎన్.టి.ఆర్ నుంచి మంచి డాన్స్ లను కూడా ఆశించవచ్చు.

 

6. పాట : ఇది రణరంగం

గాయకులు : రంజిత్, రాహుల్

సాహిత్యం : శ్రీ మణి

‘ఇది రణరంగం’ అంటూ సాగే సాంగ్ ఆల్బంలో ఎంతో హై ఎమోషనల్ గా సాగుతుంది. ఈ పాటని రంజిత్ – రాహుల్ కలిసి పాడారు. ఇద్దరూ ఎంతో జాగ్రత్త తీసుకొని పాటలో ఎనర్జీ ఎక్కడా తగ్గకుండా, సాహిత్యంలోని రౌద్రం తగ్గకుండా, ఫీల్ పోకుండా బాగా ఆలపించారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించాడు. పాట మధ్యలో వచ్చే గణగణ గణగణగణనం అని వచ్చే లైన్స్ మనలో ఏదో తెలియని ఉత్తేజాన్ని నింపేలా ఉన్నాయి. థమన్ వయొలిన్, డ్రమ్స్ ఉపయోగించి కంపోజ్ చేసిన మ్యూజిక్ పాటకి బాగా సెట్ అయ్యింది. అలాగే మ్యూజిక్ చాలా వేగంగా సాగడం, ‘నేనెప్పుడైన’ సాంగ్ లోని కొన్ని మ్యూజిక్ బిట్స్ ని పాటకి తగ్గట్టుగా ఉపయోగించడం బాగుంది. ఈ పాట సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో శత్రువులని వేటాడేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించే అవకాశం ఉంది. ఈ పాటకి పర్ఫెక్ట్ యాక్షన్ విజువల్స్ తోడైతే థియేటర్లో అభిమానుల అరుపులకి టాప్ లేచిపోద్ది.

తీర్పు :

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రామయ్యా వస్తావయ్యా ఆడియో ఆల్బం కొన్ని మెలోడీ పాటలతో మరియు పెప్పీ ట్యూన్స్ తో సాగిపోతుంది. ఈ ఆల్బం నుంచి నాకు నచ్చిన పాటలు ‘జాబిల్లీ నువ్వే చెప్పమ్మా’, ‘నేనెప్పుడైన’, ‘ఇది రణరంగం’. ముఖ్యంగా ‘జాబిల్లి చెప్పమ్మా’ సాంగ్ ఎన్.టి.ఆర్ కెరీర్ బెస్ట్ మెలోడియస్ సాంగ్స్ లిస్టులో చేరిపోతుంది. హరీష్ శంకర్ – థమన్ కలిసి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లోని టాలెంట్ ని చూపించడానికి వీలుగా మంచి సాంగ్స్ తో మన ముందుకు వచ్చారు.

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version