సమీక్ష : అవతార్ : ద వే ఆఫ్ వాటర్ (అవతార్ -2) – విజువల్ ట్రీట్!

సమీక్ష : అవతార్ : ద వే ఆఫ్ వాటర్ (అవతార్ -2) – విజువల్ ట్రీట్!

Published on Dec 17, 2022 3:04 AM IST
Avatar : The Way of Water Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్ తదితరులు

దర్శకుడు : జేమ్స్ కామెరూన్

నిర్మాతలు: జేమ్స్ కామెరూన్

సంగీత దర్శకులు: జేమ్స్ హార్నర్

సినిమాటోగ్రఫీ: మారో ఫియోర్

ఎడిటర్స్: స్టెఫాన్ రివ్కిన్, జాన్ రెఫూవా, జేమ్స్ కామెరాన్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రానికి ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలయింది. భారత్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. మరి దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

జేక్ సల్లీ ఓమటికాయ తెగకు నాయకుడై ఉంటాడు. తన భార్య నేతిరితో పాటు తన పిల్లలతో సంతోషంగా ఉంటాడు. జేక్ సల్లీ – నేతిరి దంపతులకు నెటెయమ్, లోక్ అనే ఇద్దరు కొడుకులు, టక్ అనే కూతురు ఉంటారు. కిరి అనే పెంపుడు కూతురు కూడా ఉంటుంది. ఈ పిల్లలతో పాటే స్పైడర్ అనే మానవబాలుడు కూడా కలసి ఉంటాడు. అందరూ కలిసకట్టుగా ఆనందంగా ఉంటారు. అయితే, మరోవైపు జేక్ సల్లీ – నేతిరి లపై పగతో క్వారిచ్ రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా తన పగను తీర్చుకోవడానికి క్వారిచ్ తన మనుషులతో జేక్ సల్లీ – నేతిరి లను వెతుక్కుంటూ వస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో జేక్ తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి అందర్నీ మెట్కాయినా అనే సముద్ర ప్రాంతానికి తీసుకు వెళ్తాడు. మరీ ఆ సముద్ర వాసులతో జేక్ సల్లీ ఫ్యామిలీ ఎలా కలిసి పోయింది ?, ఈ మధ్యలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?, చివరకు క్వారిచ్ వీరిని ఎటాక్ చేశాడా? లేదా ?, ఎటాక్ చేస్తే ఎవరు గెలిచారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మనకు పరిచయం లేని అద్భుతమైన సముద్రపు గర్భంలోకి వెళ్లి, అక్కడి అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతి చెందుతాం ఈ సినిమా చూస్తున్నంత సేపూ. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అడుగడుగునా గ్రేట్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. నవతరం ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ లో రూపొందించడం మరో ప్రధాన ప్లస్ పాయింట్.

ప్రేక్షకుల ఊహల అన్నిటినీ మరిపిస్తూ టెక్నాలజీతో మాయ చేశారు జేమ్స్. అందుకు సినిమాటోగ్రాఫర్ పనితనం, మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బలంగా తోడయ్యాయి. మొత్తంగా జేమ్స్ కామెరూన్ అద్భుతమైన దర్శకత్వ పని తీరు గొప్ప అభినందనీయం. అలాగే అవతార్ 2 అమేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు గ్రేట్ ఎమోషన్స్ తో నిండిపోయి ఉంది. బలమైన విలన్‌‌ ను ఎదురుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి.

ముఖ్యంగా క్లైమాక్స్ లో విలన్ వర్గం పై దాడి చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విలన్ క్వారిచ్ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్ర తాలూకు సీన్స్ బాగున్నాయి. అలాగే పిల్లల పాత్రలను ఎలివెట్ చేసే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఆ ఆసక్తికరమైన పాత్రల్లో నటించిన సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్ వంటి నటీనటులు తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.

మొత్తమ్మీద ఈ అవతార్ 2 లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్, గ్రేట్ యాక్షన్ ఎపిసోడ్స్, గుడ్ ఎమోషన్స్, అండ్ గుడ్ మెసేజ్ వంటి అంశాలు అద్భుతంగా అనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

 

‘అవతార్-1’ను గుర్తుంచుకున్నవారికే ఈ సినిమా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ‘అవతార్-1’చూడని వారికి అలాగే గుర్తులేని వారికి, ఈ చిత్రంలోని కొన్ని క్యారెక్టర్స్ అండ్ పాత్రల గతం తాలూకు సంఘటనలు పూర్తిగా కన్ ఫ్యూజన్ గా అనిపిస్తాయి. అదే విధంగా క్వారిచ్, అతని కొడుకు స్పైడర్ మధ్య ట్రాక్ అడివి శేష్ ‘గూఢచారి’లో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ ను గుర్తుకు తెస్తోంది.

నేటివిటీ సమస్య కూడా కనిపించింది. కొన్ని డైలాగ్స్ బి.సి ప్రేక్షకులకు సరిగ్గా అర్థం కావు. సినిమాలో తెలుగు నేటివిటీ కోసం డైలాగ్స్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఉదాహరణకి గతంలో అవెంజర్స్‌ సినిమాలో డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను వాడి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాంటిది ఏదో ఈ సినిమాకి కూడా చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమా సాంకేత చరిత్రలోనే ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. 3డి విజువల్స్, వీ.ఎఫ్.ఎక్స్, యాక్షన్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.

 

తీర్పు :

 

13 ఏళ్ల కిందట రికార్డుల వరద పారించిన ‘అవతార్’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను అద్భుతమైన అందమైన మరో ప్రపంచంలో విహరింపజేసింది. సముద్రపు లోతుల్లోకి వెళ్లి మరీ యావత్తు ప్రేక్షక లోకం మైమరచిపోయింది. అయితే, అవతార్ 1 ఫాలో అవ్వని వారికి ఈ భాగం కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తోంది. కానీ, సినిమాలో వండర్ ఫుల్ విజువల్ కంటెంట్ తో పాటు సూపర్ స్పెషల్ ఎఫెక్ట్స్, అమేజింగ్ ఎమోషన్స్, గ్రేట్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. మొత్తమ్మీద అవతార్ 2 అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా గొప్ప విజువల్ ట్రీట్ ను ఇస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు