సమీక్ష : అయాలి – జీ 5 లో తెలుగు డబ్బింగ్ సిరీస్

సమీక్ష : అయాలి – జీ 5 లో తెలుగు డబ్బింగ్ సిరీస్

Published on Jan 28, 2023 3:07 AM IST
Hunt Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: అభి నక్షత్ర, అన్మోల్, మదన్ లింగా, సింగంపులి, టిఎస్సార్, ధర్మరాజ్, లవ్లిన్, గాయత్రి తారా, ప్రగదీశ్వరన్, జెన్సన్, రాజమణి మెలోడీ త‌దిత‌రులు.

దర్శకుడు : ముత్తు కుమార్

నిర్మాతలు: ఎస్ కుష్మావతి

సంగీత దర్శకులు: రెవా

సినిమాటోగ్రఫీ: రాంజీ

ఎడిటర్: గణేష్ శివ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం అలరించే సినిమాలు, వెబ్ సిరీస్ లతో జీ 5 వారు తమ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా బాలనటి అభి నక్షత్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అయాలి నేడు జీ 5 ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి దాని సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

 

కథ :

వీరపన్నై అనే కుగ్రామంలో ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆచారాలు మరియు సంప్రదాయాలకు సంబంధించి ఒక విధానం అనుసరిస్తుంటారు. దీని ప్రకారం, యుక్త వయస్సు వచ్చిన అమ్మాయిలు పాఠశాలకు వెళ్లడం నిషేధించబడడంతో పాటు ఆ వెంటనే వారు వివాహం చేసుకోవాలి. అయితే ఎవరైనా ఆ ఆచారాలను ఉల్లంఘిస్తే గ్రామం నాశనం అవుతుందని అక్కడి గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే అదే గ్రామంలోని ఎజిల్ సెల్వి (అభి నక్షత్ర) అనే అమ్మాయి గ్రామంలోని మహిళల అభివృద్ధిని నిరోధించే పురాతన సంప్రదాయాలను సవాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అలానే ఆమె ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ డాక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకి సాగుతుంది. మరి ఆమె తన లక్ష్యాన్ని సాదించిందా, మధ్యలో ఆమెకు గ్రామస్థుల నుండి ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి అనేవి వెబ్ సిరీస్ మొత్తం చూస్తే సమాధానాలు దొరుకుతాయి.

 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఇటీవల మన ముందుకి వచ్చిన ఆలోచింపచేసే పలు వెబ్ సిరీస్ లలో అయాలీ కూడా ఒకటని చెప్పాలి. నేటి ప్రపంచంలో ఇప్పటికీ ఉన్న స్త్రీద్వేషం, మూఢనమ్మకాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ముఖ్యంగా మహిళా సాధికారతను తొక్కిపట్టడంతో పాటు మహిళలు కేవలం ఇంటి పనులు చేయడం, పిల్లలకు జన్మనివ్వడం వంటి వాటికే పరిమితం కాదని తెలిపే గొప్ప సందేశాన్ని అందజేస్తుంది. మంచి సందేశంతో సెన్సిబుల్ విధానంలో ఈ వెబ్ సిరీస్ ని దర్శకుడు ముత్తు కుమార్ తెరకెక్కించాడు. ముఖ్యంగా రైటింగ్ విభాగం వారు చాలా బాగా వర్క్ చేశారనే చెప్పాలి. కీలకమైన సన్నివేశాల్లో ఆడియన్స్ పూర్తిగా లీనమవడంతో పాటు విలన్ పై విరుచుకుపడాలి అనేంతలా మూవీ ఆకట్టుకుంటుంది. ఇక ఎజిల్ సెల్వి పాత్రలో అభి నక్షత్ర ఎంతో అద్భుతంగా నటించింది.

నిజానికి ఈ సినిమాకి ప్రధానమైన పాత్రధారి నటన కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోతే సినిమా మొత్తం దెబ్బతిని ఉండేదేమో, కానీ ఎక్కడా కూడా ఎజిల్ సెల్వి తన పాత్రలో తడబడలేదు సరికదా కీలక సన్నివేశాల్లో ఆమె నటన మరింత అత్యద్భుతం. ఇక మొదటి సీన్ నుండి ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుంది. అలానే చాలా సీన్స్ మనసుకు ఎంతో హత్తుకుంటాయి. ఎజిల్ సెల్వి తన యుక్త వయసుని గ్రామస్థులకు కనపడకుండా దాచిపెట్టే సన్నివేశం ఆడియన్స్ కి ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఇక రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఎజిల్ తల్లి గా అనుమోల్ అద్భుతంగా నటించారు. సింగంపులి, టిఎస్సార్, ధర్మరాజ్, లవ్లిన్ వంటి వారికి కూడా కథలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా డైలాగులు కథనాన్ని బాగా ఎలివేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయి.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఇందులో కొన్ని నెగటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే కథాగమనంలో మధ్యలో వచ్చే కొన్ని సాంగ్స్ కథనాన్ని ఇబ్బంది పెడతాయి. ఇక వాటిని తెలుగులో డబ్ చేయకపోవడంతో కొందరు ఆడియన్స్ కి అర్ధం కాకపోవడంతో అవి కనెక్ట్ కావు. అలానే డబ్బింగ్ లేకుండా తమిళ పాటలను అలా ఉంచడంలోని లాజిక్ మనకు విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ వర్కౌట్ కాలేదు, అలానే ఆ సీన్స్ అనవసరంగా ఇరికించి పెట్టినట్లుగా అనిపిస్తుంది. మధ్యలో వచ్చే దొంగ పాత్ర ఆకట్టుకున్నప్పటికీ దానిని స్క్రీన్ పై ఎక్కువగా చూపించలేదు. అలానే కొన్ని సన్నివేశాల్లో ప్లేస్మెంట్ మరింత మెరుగ్గా ఉంటె బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా అయాలి లో పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ ఆడియన్స్ ని దానికి కనెక్ట్ చేసేలా రాంజీ అందించిన ఫోటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉంటె బాగుండేది. ఇక రెవా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నిర్మాత యొక్క భారీ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక మొత్తంగా దర్శకుడు, రచయిత అయిన ముత్తు కుమార్ అయాలి వెబ్ సిరీస్ ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. మంచి కాన్సెప్ట్ తో కూడిన మేసేజ్ ని ఎంచుకుని దానిని ఎక్కడా అతిగా లేకుండా దీనిని తెరకెక్కించారు. ఎమోషనల్ సన్నివేశాలు అయితే హృదయానికి హత్తుకుంటాయి. ఆర్టిస్టులు అందరి పెర్ఫార్మన్స్ కూడా బాగుండడంతో మొత్తంగా అయాలి అందరినీ అలరిస్తుంది.

 

తీర్పు :

సమాజంలోని పితృస్వామ్యాన్ని వెలుగులోకి తెచ్చే మంచి కథాంశం అయాలి. పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ లు హత్తుకునే ఎమోషనల్ అంశాలు, పవర్ఫుల్ సోషల్ మెసేజ్ తో పాటు మంచి సీరియస్ సబ్జెక్టు ని ఆకట్టుకునే తీరులో దర్శకుడు ఎంతో బాగా తెరకెక్కించారు. అక్కడక్కడా కొంత నెమ్మదిగా సాగె కథనం వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ మొత్తంగా అయితే అయాలి అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు