సమీక్ష : బి.ఎ.పాస్ – డార్క్ రియలిస్టిక్ డ్రామా.!

B.A. Pass review

విడుదల తేదీ : 28 ఆగష్టు 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : అజయ్ భాల్

నిర్మాత : ఎం. అచ్చిబాబు

సంగీతం : అలోకనంద దాస్‌గుప్తా

నటీనటులు : శిల్పా శుక్లా, షాదబ్ కమల్..

బాలీవుడ్‌లో డార్క్ సినిమాగా సంచలన విజయం సాధించడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్థాయిలో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను కూడా సొంతం చేసుకున్న సినిమా బి.ఎ. పాస్. అజయ్ భాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎం.అచ్చిబాబు తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు డబ్ చేశారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ ఏ సర్టిఫికేట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ సినిమాలో ఇప్పుడిప్పుడే మొదలైన డార్క్ సినిమా జానర్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకునేలా ఉంది? చూద్దాం..

కథ :

బి.ఎ.పాస్ కథ ముఖేష్ (షాదబ్ కమల్) అనే టీనేజర్ చుట్టూ తిరుగుతూంటుంది. ఇంటర్ పూర్తై బి.ఎ. చదువు మొదలుపెట్టిన సమయంలోనే ముఖేష్ తన తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ క్రమంలోనే ముఖేష్‌, ఢిల్లీలో ఉండే అతడి మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకునేలా ముఖేష్ తాతయ్య ఏర్పాట్లు చేస్తాడు. ముఖేష్ ఇద్దరు చెల్లెల్లు మాత్రం వాళ్ళ తాతయ్యతోనే ఉండిపోతారు. ఇక అత్తయ్య ఇంట్లో ఉంటూ డబ్బులు చాలని పరిస్థితుల్లో, అవమానాలను తట్టుకుంటూ ఉండే ముఖేష్‌కు సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది. పరిచయమైన వెంటనే ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు.

ముఖేష్ కథను అర్థం చేసుకున్న సారికా.. అతడిని పెళ్ళై, శారీరక సరదాల కోసం తపించే తనలాంటి ఇతర మహిళలకు పరిచయం చేస్తుంది. ఈ తరహా వ్యవహారాలతో డబ్బులు సంపాదించడం మొదలైన తర్వాత ముఖేష్ జీవితంలో ఒక ఆశ మొదలవుతుంది. తాతయ్య కూడా చనిపోయాక ఢిల్లీకి దగ్గర్లో హాస్టల్లో ఉంటూన్న చెల్లెలిద్దరినీ తనతో పాటే సంతోషంగా ఉంచేలా ఏర్పాట్లు చేసుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే ముఖేష్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. అన్ని ఇబ్బందులూ ఒకేసారి మీదపడి జీవితం ఎటూపోని ఒక సంగ్ధిందంలో పడిపోతుంది. ఆ తర్వాత అతడి కథ ఏమైంది? అన్నదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే అనుకున్న కథను వీలైనంత రియలిస్టిక్‌గా, ఎక్కడా కథను డీవియేట్ చేయకుండా చెప్పిన విధానం గురించే చెప్పుకోవాలి. తెలుగులో ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. బాలీవుడ్‌లో గత కొద్దికాలం క్రితం మొదలైన ఈ ట్రెండ్‌లో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచన కూడా మంచిదే. కథ పరంగా ఈ సినిమాలో కొత్తదనమేమీ లేదు. ఒక సాధారణ జీవితంలో అసాధారణ సంఘటనలతో రూపొందిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. సినిమా ద్వారా వీలైనంత మేర సమాజానికి ఉపయోగపడే అంశం చెప్పాలనే అభిప్రాయాలను ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ ఎవ్వరూ పెద్దగా ట్రై చెయ్యరు. ఈ సినిమా కావాలని ఎక్కడా మెసేజ్ లాంటిది ఇవ్వకున్నా ఓవరాల్‌గా ఓ బలమైన మెసేజ్‌ను ఇవ్వడంలో సఫలమైంది.

ఇక ఈ సినిమాలో ప్రధానంగా కనిపించేది ముఖేష్, సారికా అన్న రెండు పాత్రలే. సారికగా శిల్పా శుక్లా అద్భుతంగా నటించింది. ఒక అడల్ట్ సినిమా అనే ముద్ర ఉన్న సినిమాలో హాట్ హాట్ సన్నివేశాల్లో కూడా ఆమె నటన సినిమా చెప్పాలనుకున్న అసలైన పాయింట్‌ను క్యారీ చేసింది. ఇక ముఖేష్‌గా షాదబ్ కమల్ కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ పరిధిమేర చాలా బాగా నటించారు. నటీనటులంతా ఈ సినిమాకు ఓ ప్రత్యేకతను తీసుకురావడంలో సఫలమయ్యారు.

సినిమా పరంగా చూస్తే.. ఈ సినిమాకు సెకండాఫ్‌ను మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్స్ అన్నీ కలిపి ఈ సినిమాకు ఓ మంచి రియలిస్టిక్ డార్క్ మూడ్‌ను తెస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఫస్టాఫ్ మొత్తం సెక్స్ సీన్స్‌తో నింపేయడం గురించి చెప్పుకోవాలి. రియలిస్టిక్‌గా ఉండాలన్న ఆలోచనో, మరొకటో కానీ ఎక్కువగా ఈ తరహా సన్నివేశాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చెప్పాలనుకున్న పాయింట్‌ను కనెక్ట్ చేస్తున్నా, ఈ సీన్స్‌లో మాత్రం సెక్స్ అప్పీల్ కనిపిస్తుంది. సాధారణంగా మన సినిమాల్లో సింబాలిక్ షాట్స్ లేదా షాట్ కంపోజిషన్‌లోనే సెక్స్‌ని కాకుండా అసలైన విషయాన్ని చెప్పడం లాంటివి చూపితే బాగుండేది. అయితే ప్రత్యేకంగా ఇలాంటి సన్నివేశాలను మాత్రమే కోరుకొని వచ్చే వారికి ఈ పాయింట్ పాజిటివ్‌ అనే చెప్పొచ్చు.

సినిమా రన్‌ టైమ్ తక్కువే అయినా కూడా సింగిల్ పాయింట్ సినిమా కావడంతో అక్కడక్కడా సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక సాధారణ సినిమాల్లా ఇందులో పాటలు, కామెడీ లాంటివి అస్సలు లేవు. కమర్షియల్ అంశాలతో నిండిన సినిమాలనే బాగా ఇష్టపడే వారికి ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవు. అలాగే ఈ సినిమా రీచ్ కూడా చాలా తక్కువ. సినిమాలోని ఓ సబ్‌ప్లాట్, దానిచుట్టూ తిరిగే కథ మెట్రో సిటీస్‌ వారికి బాగా కనెక్ట్ అయ్యే అంశం. ఇక మాస్ ఆడియన్స్‌కి చెప్పుకోవడానికి సెక్స్ సీన్స్ మాత్రమే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

లో బడ్జెట్ సినిమా అయినా సాంకేతికంగా ఈ సినిమాను ఎక్కడా తప్పు పట్టలేం. ముందుగా దర్శకుడు అజయ్ భాల్ గురించి చెప్పుకోవాలి. ఎంచుకున్న రియలిస్టిక్ కథను ఎక్కడా అయోమయానికి గురిచేయకుండా నేరుగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు. ముఖ్యంగా సినిమా ఫ్లో ఎక్కడా తగ్గకుండా చేయడంలో రచయితగా అజయ్ భాల్ ప్రతిభను మెచ్చుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా రెండు విభాగాలనూ చూసుకుంటూ సినిమా మూడ్‌ను, చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా తప్పుదోవ పట్టించకుండా ఒక రియలిస్టిక్ సినిమా తీసిన విధానానికి అజయ్ భాల్ పూర్తి క్రెడిట్ కొట్టేస్తారు. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువ అవ్వడం పట్ల కొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఈ సినిమాలో పాటల్లేవు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అలోకనంద పూర్తిగా విజయం సాధించారు. సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పుకుంటున్న విషయాన్ని కూడా తన మ్యూజిక్‌తో కొంతమేర కవర్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషన్స్ మారిపోతూ ఉండే సన్నివేశాల్లో ఎడిటర్ పనితనం కనిపిస్తుంది. తెలుగు మాటలు అందించిన వి.ఎస్.పీ తెన్నేటి కూడా సినిమా నేపథ్యాన్ని పాడు చేయకుండా మంచి తెలుగు డైలాగ్స్ రాశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. లో బడ్జెట్‌తోనే హై క్వాలిటీ సినిమా అనే విషయానికి ఇదో మంచి ఉదాహరణ.

తీర్పు :

బి.ఎ.పాస్.. ఒక రియలిస్టిక్ కథతో అంతే రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో వచ్చిన సినిమా. ఇలాంటి జానర్ తెలుగు సినిమాకు చాలా కొత్త. చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా కమర్షియల్ అంశాల జోలికి పోకుండా చెప్పిన విధానం ఈ సినిమాకు మేజర్ హైలైట్. ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయం, ఒక గ్రూప్‌కు ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుందనే పాయింట్‌ ఈ సినిమాకు మేజర్ కనెక్టింగ్ పాయింట్. రియలిస్టిక్ కథనం, శిల్పా శుక్లా, షాదబ్ కమల్‌ల యాక్టింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, దర్శకుడి విజన్ ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఇక అడల్ట్ కంటెంట్ ఎక్కువవడం, కొన్నిచోట్ల కథనం మందగించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక రియలిస్టిక్ సినిమాను, లైఫ్‌ను చూపించే సినిమాను కావాలనుకునే వారికి ఈ సినిమా ఓ మంచి ఆప్షన్. కేవలం అడల్ట్ కంటెంట్ కోసం మాత్రమే కోరేవారికి కూడా ఈ సినిమా మంచి ఆప్షనే. ఇక రెగ్యులర్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాల్లేవ్!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version