విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022
123telugu.com Rating : 2/5
నటీనటులు: తమన్నా భాటియా, అభిషేక్ బజాజ్, సాహిద్ వైద్, సౌరభ్ శుక్లా, సబ్యసాచి చక్రవర్తి
దర్శకుడు: మధుర్ భండార్కర్
నిర్మాతలు: వినీత్ జైన్, అమృత్ పాండే
సంగీత దర్శకుడు : తనిష్క్ బాగ్చి, కరణ్ మల్హోత్రా
సినిమాటోగ్రఫీ : హిమ్మన్ ధమిజా
ఎడిటర్ : మనీష్ ప్రధాన్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన బబ్లీ బౌన్సర్ ఈరోజు డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. పద్మశ్రీ మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
బబ్లీ తన్వర్ (తమన్నా భాటియా) స్మాల్ టౌన్ లో ఉండే కేర్ ఫ్రీ అమ్మాయి. తల్లిదండ్రులు ఎంచుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న అమ్మాయి. ఆమె తన టీచర్ కొడుకు విరాజ్ (అభిషేక్ బజాజ్)ని ఒక ఈవెంట్‌లో కలుసుకుంటుంది, అతన్ని ప్రేమిస్తుంది. మరియు అతను ఇండిపెండెంట్ అమ్మాయిలను ఇష్టపడుతున్నందున ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. కుక్కు (సాహిద్ వైద్) సహాయం తో ఆమె ఢిల్లీ లోని ఒక నైట్ పబ్ లో బౌన్సర్ గా మారుతుంది. ఆమె ప్రేమను విరాజ్ అంగీకరించాడా? ఆ తర్వాత ఆమె జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు ప్రధాన చిత్రంలో సమాధానం లభిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
తమన్నా ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి. విభిన్నమైన పాత్రను అంగీకరించినందుకు ఆమెను అభినందించాల్సిందే. ఆమె బబ్లీ పాత్రలో బాగా సరిపోయింది. ఒక టామ్ బాయ్ తరహా పాత్ర ఇది. స్పాంటేనిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరియు అమాయకత్వం కలగలిసిన పాత్ర ఇది. తమన్నా తన పాత్ర లో చాలా బాగా నటించింది. అంతేకాకుండా సాహిద్ వైద్ కుక్కు గా మంచి నటనను కనబరిచాడు. తన సీన్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తన అమాయకమైన నటనతో మనల్ని నవ్విస్తాడు.
అభిషేక్ బజాజ్, సౌరభ్ శుక్లా మరియు సబ్యసాచి చక్రవర్తి తమ పాత్రల కి తగిన విధంగా న్యాయం చేశారు. క్రిస్పీ రన్‌టైమ్ సినిమాకి ప్లస్ అయింది అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్:
ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే పెద్ద నిరాశ. జాతీయ అవార్డు గ్రహీత నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేరు. అతని సంచలన ఫిల్మోగ్రఫీ గురించి తెలిసిన వ్యక్తి ఈ చిత్రాన్ని చూసిన తర్వాత దర్శకుడి పట్ల ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది.
కథ చాలా సింపుల్ గా మరియు పూర్తిగా ఊహించదగినది గా ఉంది. సినిమాలో ఏ సన్నివేశం కూడా ఫ్రెష్‌గా లేదు. మరియు ప్రేక్షకులను అలరించలేకపోయింది. పస లేని స్క్రీన్ ప్లే తో కూడిన కథ, బబ్లీ బౌన్సర్ ను రొటీన్ డ్రామాగా మార్చింది. సన్నివేశాల ల్యాగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు తమన్నా ఈ చిత్రాన్ని భుజానకెత్తుకున్నప్పటికీ, ఆసక్తికరమైన కథ, ఆకర్షణీయమైన నేరేషన్ లేక పోవడంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో మధుర్ భండార్కర్ ఏం చెప్పాలనుకున్నారనేది అతి పెద్ద ప్రశ్న గా మారింది. ఈ సినిమా కోసం తమన్నా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని చెప్పాలి.
మధుర్ భండార్కర్ టైటిల్‌ను జస్టిఫై చేసే విధంగా మంచి కథను రాసి ఉండవచ్చు. కానీ, అలా జరగలేదు. బహుశా అందుకే మేకర్స్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ను ఎంచుకున్నారు అని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా లేదు, కథను పూర్తి గా తప్పు బట్టారు.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ మధుర్ భండార్కర్ బబ్లీ బౌన్సర్ చిత్రంతో మ్యాజిక్ చేయడంలో విఫలమయ్యాడు. తనిష్క్ బాగ్చి మరియు కరణ్ మల్హోత్రా లు అందించిన సంగీతం యావరేజ్‌గా ఉంది. మరియు పాటలు కూడా అంతగా లేవు. ఎడిటింగ్ విభాగానికి వస్తే కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా వర్క్ కూడా బాగుంది.
తీర్పు:
మొత్తం మీద, బబ్లీ బౌన్సర్ చిత్రం పేలవమైన రచన, దర్శకత్వం తో ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం లో తమన్నా ఆకట్టుకుంది. మరియు ఆమెను అభిమానించే వారికి ఈ చిత్రం నచ్చవచ్చు. రెండవ ఆలోచన లేకుండా, ప్రేక్షకులు బబ్లీ బౌన్సర్‌ను స్కిప్ చేయవచ్చు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team