సమీక్ష : బ్యాక్ బెంచ్ స్టూడెంట్ – పరమ బోరింగ్ సినిమా..

విడుదల తేదీ : 15 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
దర్శకుడు : మధుర శ్రీధర్
నిర్మాత : ఎం.వి.కె రెడ్డి
సంగీతం : సునీల్ కశ్యప్
నటీనటులు : మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయ్, అర్చన కవి…

‘స్నేహ గీతం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తొలి విజయాన్ని అందుకున్న మధుర శ్రీధర్ ఆ తర్వాత తీసిన ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ తో ద్వితీయ యజ్ఞాన్ని దాటలేకపోయాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన జీవితంలో చూసిన ఓ సంఘటన ఆధారంగా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాని తీసాడు. మహాత్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో పియా బాజ్పాయ్, అర్చన కవి హీరోయిన్స్ గా నటించగా బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. ఎం.వి.కె రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ప్రస్తుతం మధుర శ్రీధర్ కెరీర్ కి హిట్ ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా మధుర శ్రీధర్ కెరీర్ కి హెల్ప్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తీక్ (మహాత్ రాఘవేంద్ర) అతని ఫ్యామిలీతో పాటు వైజాగ్ లో నివసిస్తుంటాడు. ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసిన అతను వైజాగ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతాడు. కార్తీక్ చదువులో వీక్ అయినా ఎథికల్ హాకింగ్ లో మంచి నైపుణ్యం ఉంటుంది. కాలేజ్ లో తనకి ప్రియాంక(అర్చన కవి), డాలీ, హనీ, శాంతి పరిచయమవుతారు. ఆ తర్వాత కార్తీక్ – ప్రియాంక స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. అలా అలా ఆడుతూ, పాడుతూ, తాగుతూ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంజనీరింగ్ పూర్తయ్యేటప్పటికి కార్తీక్ 16 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యి ఎం చెయ్యాలో అయోమయ స్థితిలో పడతాడు. అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రియాంకకి ఏమో యు.ఎస్ వెళ్లి ఎం.ఎస్ చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఆ సందర్భంలో కార్తీక్ – ప్రియాంక అభిప్రాయ బేధాలు రావడంతో ప్రియాంక కార్తీక్ ని వదిలి వెళ్ళిపోతుంది. అలా ప్రియాంకకి దూరమై బాధలో ఉన్న కార్తీక్ లైఫ్ లోకి చైత్ర(పియా బాజ్పాయ్) వస్తుంది. కార్తీక్ లైఫ్ లో చైత్ర ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. కార్తీక్ లైఫ్ లో సెటిల్ అయ్యాడా, లేదా? కార్తీక్ ని వదిలి వెళ్ళిపోయిన ప్రియాంక మళ్ళీ కార్తీక్ లైఫ్ లోకి వచ్చిందా? లేదా? ఒకవేళ వస్తే కార్తీక్ ఎవరిని తన లైఫ్ పార్టనర్ గా చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

తెలుగు తెరకు పరిచయం చేసిన మహాత్ రాఘవేంద్ర నటన ఓకే అనేలా ఉంది. ‘జగడ జగడ’, ‘ సచిన్ టెండూల్కర్’ పాటల్లో అతని డాన్సులు బాగున్నాయి. అర్చన కవి, పియా బాజ్పాయ్ లు ఈ సినిమాలో గ్లామర్ డాల్ పాత్రల కాకుండా ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే పోషించారు. వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సినిమా మొదట్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ముఖ్యంగా డాలీ – హనీ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగుంది. డా. నో దివాకర్ గా అలీ తెగ నవ్వించకపోయినా పాత్ర పరంగా ఓకే. హీరో తండ్రిగా శరత్ బాబు, హీరోయిన్ తండ్రిగా బెనర్జీ తమ పరిదిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

ముందుగా మహాత్ రాఘవేంద్ర తమిళ వాడు కావడం వల్ల డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాగే కొంతమంది నటీనటుల డబ్బింగ్ కి తెరపైన లిక్ సింక్ కి మ్యాచ్ అవ్వలేదు. మహాత్ రెగ్యులర్, కామెడీ సీన్స్ బాగానే చేసినప్పటికీ ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం చెయ్యలేక ఎంత కష్టపడ్డాడో అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక సినిమా విషయానికొద్దాం సినిమాకి చెప్పుకోదగ్గ కథ ఏమన్నా ఉందా అంటే నో నో ఏమీ లేదు. కథ లేకపోయినా కాలేజ్ బ్యాక్ డ్రాప్ అదీ బ్యాక్ బెంచ్ అన్నాడు మన కాలేజ్ లైఫ్ లో లాగే బాగా ఫన్నీగా ఉండే సీన్స్, చిన్న చిన్న గొడవలు, పార్టీలు ఉంటాయి అనుకోని వెళితే మాత్రం మీకు నిరాశే మిగులుతుంది, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే అన్నా ఉందా అంటే అదీ లేదు.

సినిమా మొదలైనప్పటి నుంచి సీన్ టు సీన్ ఊహించగలిగేలా ఉండటం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. దర్శకత్వంలో అయినా మధుర శ్రీధర్ తన ప్రతిభ చూపారా అంటే లేదనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శకులు తమకు తెలిసింది వదిలేసి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కొత్తరకమైన సినిమాలు చేసి తమ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు అనడానికి ఈ సినిమా మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మధుర శ్రీధర్ కూడా కమర్షియల్ హంగులు కొన్ని జత చేయాలని చూసి విఫలమయ్యాడు.

సినిమా మొదటి హాఫ్ ని తీగ తెగే దాకా లాగాడు ఎంతలా అంటే ప్రేక్షకులు మాకు బ్రేక్ కావాలిరా బాబోయ్ అని అరిచేంతలా సాగదీసాడు. ఫస్ట్ హాఫ్ లో పాటలు సందర్భానుసారంగానే వచ్చినట్టు ఉన్నా అప్పటికే సినిమా స్లోగా ఉండటం వల్ల పాట మొదలు కావడమే ఆలస్యం ఆడియన్స్ లేచి వెళ్ళిపోతున్నారు. ఇక సెకండాఫ్ ఒక మాదిరిగా పోతున్న సమయంలో మధ్య మధ్యలో పాటలు వచ్చి చిరాకు తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ కి కరీనా కపూర్(బ్రహ్మానందం) పాత్ర వస్తుంది. ఆ పాత్ర నవ్వించకపోగా తెగ టార్చర్ తెప్పిస్తుంది మరియు అప్పటి వరకూ ఉన్న ఫ్లోని కూడా చెడగొడుతుంది. అసలు ఆ పాత్ర ఎందుకొచ్చింది ఎందుకు వెళ్ళింది అనే క్లారిటీ ఇవ్వకుండా అసంపూర్ణంగానే ఆ పాత్రకి చరణ గీతం పాడేశారు. అలీ లాంటి కమేడియన్ ని సెకండాఫ్ లో చాలా సేపు ఉంచుకొని కూడా ఆడియన్స్ ని నవ్వించలేకపోయారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో 16 సబ్జెక్ట్ లో హీరో ఫెయిల్ అయినట్టుగానే మధుర శ్రీధర్ కూడా అతను ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనే మూడు విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. కథ, స్క్రీన్ ప్లేని పక్కన పెడితేసినిమాటోగ్రాఫర్ కలర్స్ విషయాలో కేర్ తీసుకోవాల్సింది. వైజాగ్ ని అందంగానే చూపించాడు. ఎడిటర్ పనితనం బాగుంది కానీ బ్రహ్మనందం ఎపిసోడ్ మొత్తాన్ని లేపెయ్యొచ్చు ఎందుకంటే దాని వల్ల సినిమాకి ఏమాత్రం ఉపయోగం లేకపోగా క్లైమాక్స్ కి అదే పెద్ద మైనస్. సునీల్ కశ్యప్ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా సీన్ కి అవసరం లేనంత ఇచ్చినా మిగతా అంతా ఓకే. గణేష్ స్వామి కంపోజ్ చేసిన ఫ్లోర్ స్టెప్స్ తప్పితే మిగతా స్టెప్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ రోటీన్ రొటీన్ పరమ రొటీన్ గా ఉండే సినిమా. ఓకే అనేలా ఉండే నటీనటుల నటన, పరవాలేదనిపించే మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులు ఇష్టపడే కామెడీ లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్స్ పాయింట్స్. ఒక వేల మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ కదా అలా ఉంటది ఇలా ఉండాది అని అంచనాలు పెట్టుకొని వెళ్ళకపోతే కాస్తలో కాస్త తక్కువ నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version