సమీక్ష : బాహుబలి – ఎమోషనల్ విజువల్ వండర్..

baahubali-review

విడుదల తేదీ : 10 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి

నిర్మాత : శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని

సంగీతం : ఎం.ఎం కీరవాణి

నటీనటులు : ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ..

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ఎక్కడ చూసిన ఏ నోట విన్నా ఇదే పేరు, అందరూ ఈ సినిమా టికెట్స్ కోసం విశ్వప్రయత్నాలు చేసారు. భారత చలన చిత్ర దశ దిశని మార్చేలా కొన్ని వందల మంది రెండున్నరేళ్ళు కష్టపడి అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో, భారీ సెట్టింగులతో మన ముందుకు తీసుకువచ్చిన ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి – ది బిగెనింగ్’. బాహుబలి ప్రాంచైజ్ లో ఇది మొదటి పార్ట్. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా కనిపించగా అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా కనిపించారు. ఇంకా ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ తో పాటు, అవార్డు విన్నింగ్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా ఈ రోజు 4 భాషల్లో విడుదలైంది. టాలీవుడ్ జక్కన్నతో పాటు నటీనటులు, టెక్నికల్ టీం మొత్తం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసిన ‘బాహుబలి’ మూవీ ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పించింది.? ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుంది.? అనేది ఇప్పుడు చూద్దాం..

గమనిక : ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ సుమారు మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి చేసారు. కావున ప్రతి డిపార్ట్ మెంట్ లో అందరి గురించి కాస్త క్లియర్ గా చెబుతా.. కాస్త ఓపికతో చదవండి..

కథ :

శివగామి(రమ్యకృష్ణ) పొత్తిళ్ళలో ఉన్న తన కొడుకు బిడ్డని ఎత్తుకుని శత్రువుల నుంచి తప్పించుకుంటూ వస్తూ ఉండగా ఓ భారీ జలపాతంలో పడిపోతుంది. తను చనిపోయి ఆ బిడ్డని కాపాడుతుంది. అ బిడ్డ వరద ప్రవాహంలో కొట్టుకుంటూ అంబలి గ్రామంకి చేరుకుంటాడు. అక్కడ ఆటవిక తెగకి చెందిన రోహిణి ఆ బిడ్డని పెంచుతుంది, అలాగే తనకి శివుడు అనే పేరు పెడుతుంది. చిన్నప్పటి నుంచి తన గ్రామానికి ఆనుకొని ఉన్న కొండలకి పైన ఏముంది తెలుసుకోవాలనే కోరిక శివుడులో బలంగా ఉంటుంది. ఒకరోజు ఆ జలపాతం నుంచి జారి పడిన మాస్క్ ద్వారా కొండపైకి చేరుకుంటాడు. అక్కడ అవంతిక(తమన్నా)ని చూసి ప్రేమలో పడతాడు.

కానీ అవంతిక ఒక వారియర్ లా మాహిష్మతి రాజ్యానికి రాజు అయిన భళ్లాలదేవ దగ్గర బందీగా ఉన్న దేవసేన(అనుష్క)ని విడిపించి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో శివుడు – అవంతిక ప్రేమలో పడతారు. దాంతో అవంతిక లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకొని శివుడు దేవసేనని కాపాడి తీసుకురావడానికి మాహిష్మతికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన శివుడు దేవసేనని కాపాడటం కోసం ఏం చేసాడు.? దేవసేనని కాపాడే సమయంలో శివుడు తెలుసుకున్న నిజం ఏమిటి.? ఆ మాహిష్మతి కథ ఏంటి? అవంతికకి దేవసేనకి ఉన్న సంబంధం ఏమిటి.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఎస్ఎస్ రాజమౌళి స్పెషాలిటీ ఏంటంటే సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైనా ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఓ సీన్ రావాల్సిందే అంటాడు.. అలాంటి సీన్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అలా సినిమాలో వచ్చే ఓ ఐదు సీన్స్ ని, వార్ ఎపిసోడ్ ని చాలా బాగా ఎలివేట్ చేసాడు. విజువల్స్ పరంగా రెండున్నర గంటలు మీకు థియేటర్లో ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. రాజమౌళి తను రాసుకున్న ప్రతి పాత్రలోని ఎమోషన్ ని ది బెస్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. నటీనటులు పూర్తి న్యాయం చెయ్యడం బాహుబలికి మేజర్ ప్లస్ పాయింట్. మాహిష్మతి రాజ్యం కోసం క్రియేట్ చేసిన ప్రతి సెట్స్ మిమ్మల్ని అబ్బుర పరుస్తాయి, అలాగే చూడటానికి రెండుకళ్ళు సరిపోవేమో అనేలా సెట్స్ ని డిజైన్ చేసారు. ఆ సెట్స్ మీకో కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

ఈ సినిమాకి మేజర్ గా హైలైట్ గా అనిపించే అంశాల విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం చాలా బాగుంది. మొదటి 2 నిమిషాల్లోనే మిమ్మల్ని బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు. శివుడుగా ప్రభాస్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత శివలింగంతో వచ్చే ఎపిసోడ్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది. తమన్నా కోసం ప్రభాస్ కొండల్లో చేసిన రిస్క్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక తమన్నా ఎంట్రీలో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్, మంచుకొండల్లో వచ్చే ఎపిసోడ్ బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంటర్వెల్ తర్వాత దేవసేనని కాపాడే సీన్, అక్కడ అడవి శేష్ గ్యాంగ్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని తారా స్థాయికి తీసుకెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ మరియు రానాల ఇంట్రడక్షన్, శివగామి పాత్రలోని ఎలివేషన్ సీన్స్ సూపర్బ్. ఇక సుమారు 30 నిమిషాల పాటు సాగే వార్ ఎపిసోడ్ ఆడియన్స్ మతి పోగొడుతుంది. ఈ వార్ లో వాడే టెక్నిక్స్, ప్రభాస్, రానా, సత్యరాజ్ లు పోరాడే సీన్స్ మరియు వారి పై షూట్ చేసిన కొన్ని సీన్స్ ఆడియన్స్ ని సీట్లలో కూర్చో నివ్వవు. రాజమౌళి, సెంథిల్ కుమార్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ కలిసి క్రియేట్ చేసిన మాహిష్మతి రాజ్యం, ఆ రాజ్యం కోసం వేసిన సెట్స్ మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.

బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదటగా సినిమాలోని కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ తర్వాత ఆ పాత్రలను అల్లుకుంటూ కథను రాసుకున్నారు. ఈ సినిమా కోసం నటీనటులంతా మూడేళ్ళు సమయం కేటాయించారు. అందుకే వారందరి గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్తా..

‘శివుడు’గా ప్రభాస్ – చిన్నప్పుటి నుంచే ఆటవిక ప్రాంతంలో పెరిగిన శివుడుకి కొండలు, కోనల్లో సాహసాలు చేయడంలో దిట్ట. అలాంటి పాత్రలో ప్రభాస్ రిస్కీ స్టంట్స్ బాగా చేసాడు. ముఖ్యంగా కేరళలో షూట్ చేసిన సీన్స్, తమన్నా కోసం వెళ్ళినప్పుడు వచ్చే కొన్ని సీన్స్ మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇంట్రడక్షన్ సీన్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చెప్పాడు.

‘బాహుబలి’గా ప్రభాస్ – బలమైన బాహువులు కలిగిన బాహుబలి లుక్ లో ప్రభాస్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి పాత్రలో ప్రభాస్ మునుపెన్నడూ కనపడని భారీ కాయంతో, బలమైన కండలతో కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కటౌట్ చూస్తే మీ ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంటుంది. బుద్ధిబలం – కండబలం కలగలిపిన ఈ పాత్రలో ప్రభాస్ పెర్ఫార్మన్స్ అదరహో అనేలా అంది. వార్ సీక్వెన్స్ లో ప్రభాస్ చూపిన వీరత్వం మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.ప్రభాస్ బాహుబలి, శివుడు పాత్రలకి మధ్య వైవిధ్యం బాగా చూపించాడు.

‘భళ్లాలదేవ’గా రానా – ఇప్పటివరకూ చూసిన రానా ఒక లెక్క, బాహుబలిలో కనపడే రానా ఒక లెక్క.. రాజమౌళి అంటేనే విలననిజంలో ఉచ్చస్థాయిని చూపిస్తాడు, ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రానా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. శత్రువు ఎదురొస్తే బుద్ది బలంకంటే కండబలంని నమ్ముకునేవాడిగా, కౄరత్వం అనేది అతన్ని చూసే పుట్టిందా అనే స్వభావం కలిగిన భళ్లాలదేవ పాత్రలో రానా చూపిన పెర్ఫార్మన్స్ న భూతో న భవిష్యత్ అని చెప్పాలి. యుద్ద భూమిలో భళ్లాలదేవగా రానాని స్క్రీన్ పై చూస్తుంటే కూర్చున్న ప్రేక్షకుల వెన్నులో వణుకు పుడుతుంది. అంతలా నెగటివ్ షేడ్స్ ని చూపించాడు.

‘అవంతిక’గా తమన్నా – ఇప్పటి వరకూ మిల్క్ బ్యూటీ, గ్లామ్ డాల్ అనిపించుకున్న తమన్నా ఈ సినిమాలో అవంతికగా అందమైన కుందనపు బొమ్మలా కనపడడమే కాదు శత్రువు ఎదురుపడినా, ఒక ఆపద వస్తున్నా నిలబడి ఢీ కొట్టే పాత్రలో బాగా చేసింది. తమన్నా చేసిన స్టంట్స్, కత్తి యుద్దాలు కచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి. పచ్చబొట్టేసినా సాంగ్ లో తమన్నా అందాలు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ప్రభాస్ – తమన్నాల కెమిస్ట్రీ బాగుంది.

‘దేవసేన’గా అనుష్క – దేవసేనగా అనుష్క కనపడేది చాలా తక్కువ టైం. అది కూడా మీరు ట్రైలర్ లో చూసిన లుక్ లో ఓ ఖైదీగా కనిపిస్తుంది. కానీ తను మొదటి సారి నోరు తెరిచి కట్టప్పతో మాట్లాడే సీన్స్ మాత్రం సూపర్బ్.

‘శివగామి’గా రమ్యకృష్ణ – ది పవర్ అఫ్ విమెన్ ని చూపే పాత్ర శివగామి. ఒక రాజ్యాన్ని తన ఆధీనంలో సమర్ధవంతంగా నడిపించగల సత్తా ఉన్న రాణిలా రమ్యకృష్ణ నటన, ఆ పాత్రలోని రౌద్రం అందరినీ కట్టిపడేస్తుంది. శివగామి పాత్రని రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. ప్రతి సీన్ లోనూ సూపర్బ్ ఎమోషన్స్ ని చూపారు.

‘కట్టప్ప’గా సత్యరాజ్ – నమ్మకాని, ధైర్యానికి మారుపేరైన సైన్యాధిపతిగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనిపిస్తారు. సత్యరాజ్ ఎమోషన్స్ చూపించడంలో ది బెస్ట్ అని కట్టప్ప పాత్రతో మరోసారి మెప్పించాడు. ఇది పక్కన పెడితే తన 60 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ళ కుర్రాడిలా ప్రభాస్ తో చేసిన ఫైట్, వార్ ఎపిసోడ్లో చేసిన స్టంట్స్ చూసి కచ్చితంగా షాక్ అవుతారు. ఆ వయసులో కూడా హీరోలైన ప్రభాస్, రానాలకు దీటుగా కత్తి తిప్పుతూ చేసిన రిస్కీ స్టంట్స్ మీ చేత శభాస్ అనిపిస్తుంది.

‘బిజ్జలదేవ’గా నాజర్ – మోసం, స్వార్ధపూరితమైన స్వభావం కలిగిన బిజ్జలదేవ పాత్రలో నాజర్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. నాజర్ ఒక చెయ్యి లేని అవిటివాడిగా నెగటివ్ ఎమోషన్స్ ని బాగానే చూపించాడు.

‘కాలకేయ’గా ప్రభాకర్ – ఓ కౄరమైన ఆటవిక తెగకి చెందిన రాజుగా ప్రభాకర్ నటించాడు. కాలకేయగా ప్రభాకర్ రూపమే ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంటుంది. దానికి తోడు ఇతని చేత చెప్పించిన కిలికి భాష డైలాగ్స్ లో ఇంటెన్స్ కనిపించడం తన విలనిజాన్ని మరింత పెంచేలా ఉంటుంది. వార్ ఎపిసోడ్ లో బాగా చేసాడు.

ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా అతిధి పాత్రలో కనిపించిన సుధీప్ అస్లామ్ ఖాన్ పాత్రలో మెప్పించాడు. ఆటవిక ప్రాంతానికి చెందిన లేడీ పాత్రలో రోహిణి నటన బాగుంది. భళ్లాలదేవ దగ్గర ఉండే ఓ యువరాజు అయిన భద్ర పాత్రలో అడవి శేష్ లుక్ బాగుంది. భళ్లాలదేవ కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడే అడవి శేష్ నెగటివ్ షేడ్స్ బాగా చూపించాడు. తనికెళ్ళ భరణి ఓకే. ‘మనోహరి’ సాంగ్ లో కనిపించిన నోర ఫతేహి, స్కార్లెట్ విల్సన్ లు తమ అందచందాలతో ముందు బెంచ్ వారిని ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా వచ్చిన బాహుబలి సినిమాలో చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సినిమా మొత్తం అయిపోయాక కథా పరంగా చూసుకుంటే అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకు అంటే చాలా సినిమాల్లో చెప్పే రెగ్యులర్ రివెంజ్ స్టొరీనే ఇందులోనూ చెప్పారు. కావున కథా పరంగా మీకు కొత్త పాయింట్ ఏమీ చెప్పరు. అలాగే సినిమాలో కీ పాయింట్స్ ని ఎలివేట్ చేయడానికి కోసం కొన్ని బిల్డప్ సీన్స్ ని రాసుకోవాలి. అలా రాసుకున్న సీన్స్ కొన్ని డ్రాగ్ చేసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. వీటివలనే సినిమా రన్ టైం కూడా ఎక్కువ అయ్యిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్న తర్వాత చాలా సీన్స్ లో రాజమౌళి రియాలిటీ అనే దానికి బాగా దూరంగా వెళ్ళారు అనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ ని ఓ మంచి బ్లాక్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత స్పీడ్ ని తగ్గించేసారు. ముఖ్యంగా మనోహరి సాంగ్ వలన సినిమా రన్ టైం పెరగడమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. అన్నిటికంటే మించి క్లైమాక్స్ ఏదో అసంపూర్ణంగా ముగించేసినట్టు ఉండడం నిరుత్సాహపరుస్తుంది. అలాగే శివుడు – అవంతిక ఫస్ట్ మీటింగ్ అంతా ఒక మాయలా క్రియేట్ చెయ్యడం వెనకున్న అసలు రహస్యం ఏంటనేది ఎవ్వరికీ చెప్పలేదు, బహుశా సెకండ్ పార్ట్ లో చెప్తారేమో..

సాంకేతిక విభాగం :

అందరూ అనుకుంటున్నట్టు తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ సినిమా ‘బాహుబలి’ ఈ రోజు రిలీజ్ అవుతోంది అంటే దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఎస్ఎస్ రాజమౌళినే అన్నది అక్షర సత్యం. బాహుబలి సినిమాలో ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేసి ఏ రేంజ్ అవుట్ పుట్ వచ్చినా అవన్నీ రాజమౌళి విజన్ మరియు ఊహనుంచి పుట్టినవే కావున బాహుబలికి సంబందించిన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్రెడిట్ రాజమౌళికి ఇవ్వాలి. ఇక ఆయన ఈ సినిమాలో చేసిన ది బెస్ట్ వర్క్ మరియు మిస్టేక్స్ విషయానికి వస్తే.. మొదటగా ఆయన చేసిన మిస్టేక్ అంటే కథా పరంగా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ని ఎంచుకోకపోవడం. విజయేంద్ర ప్రసాద్ గారు బాహుబలి కోసం చాలా బలమైన పాత్రలని సృష్టించారు కానీ ఆ పాత్రలని కలుపుతూ బలమైన కథని మాత్రం రాసుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఎక్కడో మిస్ అయినట్టున్నారు రాజమౌళి. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే.. ఇక రాజమౌళి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా సినిమాకి 70% న్యాయం చేసాడు. కథాపరంగా చెప్పాల్సింది, బిల్డప్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఎక్కువ ఉండడం వలన ఆ 30% అక్కడక్కడా బాగా డ్రాగ్ అవ్వడం, ఈ సీన్ కథకి అవసరం లేదేమో అనే ఫీలింగ్ ని కలిగించాయి. అలాగే క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. ఇక దర్శకుడిగా మాత్రం రాజమౌళి ‘ఆల్వేస్ ది బెస్ట్’ అని మరోసారి నిరూపించుకున్నాడు. కథలో రాసుకున్న 8 పాత్రలకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చాడు, ప్రతి పాత్ర నుంచి ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి బాహుబలి టీంలోని ప్రతి ఒక్కరి నుంచి ‘న భూతో న భవిష్యత్’ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. ఓవరాల్ గా ఈ సినిమాకి కెప్టెన్ అయిన రాజమౌళి తెలుగులో ఇలాంటి ఓ సినిమాని అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ ని అంతా మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడి చేసారు కావున వారి గురించి కూడా పేరు పేరునా చెబుతా..

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ – డైరెక్టర్ విజన్ ని మొదట అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఫ్రేంని సెట్ చేసి పర్ఫెక్ట్ విజువల్స్ రాబట్టుకోవాల్సిన పనిని సెంథిల్ కుమార్ 100% సక్సెస్ఫుల్ గా పూర్తి చేసాడు. వార్ ఎపిసోడ్, కేరళ వాటర్ ఫాల్స్ ఎపిసోడ్, ఇంటర్వల్ తర్వాత వచ్చే ఫైట్ ని తను షూట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.

ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ – మాహిష్మతి రాజ్యం అనగానే రాజమౌళి మదిలో కొన్ని ఊహా చిత్రాలు ఉంటాయి ఆ ఊహా చిత్రాలను అర్థం చేసుకొని వాటికి పర్ఫెక్ట్ రూపాన్ని కల్పించి ఆ సెట్లతో ఆడియన్స్ ని మరో లోకానికి తీసుకెళ్ళిన క్రెడిట్ మాత్రం సాబు సిరిల్ కే చెందుతుంది. సెట్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఇది అసలు తెలుగు సినిమానేనా అని సీట్ చివర్లో కూర్చొని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. సెట్స్ మాత్రమే కాకుండా ప్రతి పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన ఆయుధాలు అద్భుతం అని చెప్పాలి.

విఎఫ్ఎక్స్ సూపర్ విజన్ శ్రీనివాస్ మోహన్ – రాజమౌళి, సాబు సిరిల్ కలిసి ఒక రూపం తెప్పించిన సెట్స్, వార్ ఫీల్డ్, భారీ విజువల్స్ ని తన గ్రాఫికల్ మాయాజాలంతో ప్రాణం పోసింది మాత్రం శ్రీనివాస్ మోహన్. ప్రతి సీన్ లో తన సిజి షాట్స్ కోసం బ్లూమాట్ ఎక్కడ ఎలా సెట్ చెయ్యాలో చూసుకొని, ఆన్ స్క్రీన్ మునుపెన్నడూ చూడని గ్రాండ్ విజువల్స్ తో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసాడు శ్రీనివాస్ మోహన్. రాజమౌళి కలల మాహిష్మతి రాజ్యానికి ప్రాణం పోసి మనకో సరికొత్త అనుభూతిని క్రియేట్ చేసిన సెంథిల్ కుమార్, సాబు సిరిల్ మరియు శ్రీనివాస్ మోహన్ లకు తెలుగు ఆడియన్స్ అందరి తరపునా స్పెషల్ థాంక్స్ చెప్పాలి.

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి – ఇంతమంది కలిసి స్క్రీన్ మీదకి తెచ్చిన ఓ ప్రోడక్ట్ కి తన సంగీతంతో ప్రేక్షకులకు చేరువ చేయడంలో కొంతమేర ఎంఎం కీరవాణి సక్సెస్ అయ్యాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా పాత్రల ఎలివేషన్ సీన్స్ లో, వార్ ఎపిసోడ్ లో రీ రికార్డింగ్ బాగుంది. కానీ కొన్ని చోట్ల ఆయన నుంచి 100% అవుట్ పుట్ రాలేదని అనిపిస్తుంది.

నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని – ఎంత స్టార్ డైరెక్టర్ అయినా, తన దగ్గర ఎంత గొప్ప కథ ఉన్నా నిర్మాత అనే వ్యక్తి లేకపోతే ఆ ప్రాజెక్ట్ అటక ఎక్కేయాల్సిందే. కానీ రాజమౌళి చెప్పిన కథని దానిని నమ్మి తెలుగు సినిమా చరిత్ర దశ దిశని మార్చాలనే కోరికతో ఈ సినిమా చెయ్యడానికి సై అన్న శోభు, ప్రసాద్ లకు మా హ్యాట్సాఫ్. వీరు లేకపోతే ఈ సినిమా లేదు. అందుకే వారి రిస్క్ అండ్ డేరింగ్ కి సెల్యూట్ చేస్తున్నాం.

పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. శివుడుపై బురదలో వచ్చే ఫైట్, బిగ్గెస్ట్ వార్ ఎపిసోడ్ ని బాగా కంపోజ్ చేసాడు. విజయ్ కుమార్ – అజయ్ కుమార్ కలిసి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక మదన్ కార్కీ క్రియేట్ చేసిన కిలికి భాష కూడా ఓకే. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ లో చాలా చోట్ల డ్రాగ్ అయిన సన్నివేశాలను ఇంకాస్త కట్ చేసి ఉండాల్సింది. కానీ చాలా చోట్ల ఆయన చేసిన షార్ప్ ఎడిటింగ్ ఆడియన్స్ ని కట్టి పడేస్తుంది. ముఖ్యంగా వార్ ఎపిసోడ్ ని ఎడిట్ చేసిన విధానం మాత్రం సూపర్బ్.. సతీష్ సౌండ్ డిజైనింగ్ ఓకే. రమా రాజమౌళి – ప్రశాంతి త్రిపిరినేని కలిసి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ క్రీస్తు శఖం 540సంవత్సరానికి చెందిన టైం లైన్ ని ప్రతిబింబించేలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి.

తీర్పు :

పరాజయమే లేని ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి సినిమా అందరినీ సంతృప్తి పరిచే సూపర్బ్ గ్రాఫికల్ విజువల్ వండర్ గా నిలిచిపోయింది. ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ మీరు మునుపెన్నడూ చూడలేదు. స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎమోషన్స్ కి గ్రాండ్ విజువల్స్ తోడవడం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. రాజమౌళి మాస్టర్ మైండ్ మరియు మాటల్లో వర్ణించలేని తన విజన్ కి ప్రతి రూపమే ఈ బాహుబలి. రాజమౌళి కథలోని బలమైన పాత్రల్లో ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ మరియు ఇతర ముఖ్య పాత్ర దారులు ప్రాణం పోస్తే, అతని టెక్నికల్ టీం తమ టాలెంట్ తో సినిమాని విజువల్ వండర్ గా మార్చారు. కథా పరంగా కంటెంట్ లేదు, అక్కడక్కడా సాగాదేశారు, కొన్ని అనవసరపు సాంగ్స్ మైనస్ అయితే, సినిమాకి కీలకమైన 8 పాత్రలు, అబ్బురపరిచే విజువల్స్, ఇంట్రడక్షన్ సీన్స్, సూపర్బ్ సెకండాఫ్ అన్ని సెంటర్స్ వారినీ ఆకట్టుకుంటుంది. రెండున్నరేళ్ళ పాటు ఈ చిత్ర టీం ఎంతో కష్టపడి ఇలాంటి గొప్ప విజువల్ మూవీని తీసిన జక్కన్న టీంకి హ్యాట్సాఫ్ చెబుతున్నాం. ఓవరాల్ గా బాహుబలి అనే ఎమోషనల్ విజువల్ వండర్ బాక్స్ ఆఫీసు వద్ద మరో రెండు వారాలు కాసుల వర్షం కురిపిస్తుంది. అంచనాలను తగ్గించుకొని మీ ఫ్యామిలీ తో వెళ్లి చూడదగిన చూడాల్సిన సినిమా ‘బాహుబలి’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version