సమీక్ష : బలగం – సహజమైన పాత్రలతో సాగే పల్లెటూరి డ్రామా !

సమీక్ష : బలగం – సహజమైన పాత్రలతో సాగే పల్లెటూరి డ్రామా !

Published on Mar 4, 2023 3:03 AM IST
Konaseema Thugs Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు

దర్శకుడు : వేణు యెల్దండి (వేణు టిల్లు)

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత

సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ:ఆచార్య వేణు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నటుడు వేణు టిల్లు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వచ్చిన సినిమా ‘బలగం’. ఈ సినిమాని హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

కొముర‌య్య (సుధాక‌ర్‌ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి) పెళ్ళికి రెడీ అవుతాడు. రెండు రోజుల్లో వరపూజ (నిశ్చితార్థం) అనగా… అతని తాతయ్య కొముర‌య్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. అప్పటికే సాయిలు (ప్రియ‌ద‌ర్శి) అప్పుల్లో మునిగిపోతాడు. వరపూజ రోజున పది లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామని ఆశ పడిన అతనికి నిరాశే మిగులుతుంది. చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది. ఐతే, తన తాతయ్య భౌతిక కాయం చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్) ను చూసి ప్రేమలో పడతాడు సాయిలు. ఆమె తండ్రికి బోలెడు ఆస్తి ఉందని తెలిసి.. ఎలాగైనా సంధ్యను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుని.. అప్పు తీర్చేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఇంతకీ సాయిలు సంధ్యను ఎలా ప్రేమలో పడేశాడు ?, అందుకు తన చనిపోయిన తన తాతయ్యను ఎలా వాడుకున్నాడు ?, అసలు సాయిలు – సంధ్య తండ్రుల మధ్య జరిగిన గొడవలు ఏమిటి ? చివరకు అందరూ కలిశారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ లో, తెలంగాణ యాస‌లో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని నేటివిటీ అంశాలు చాలా బాగున్నాయి. కథలో సిరిసిల్ల నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి అమాయకపు పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండిని మెచ్చుకొని తీరాలి. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. కొన్ని సీన్స్ అయితే దర్శకుడు తీసిన విధానం చాలా సహజంగా అనిపిస్తుంది.

సినిమా చూస్తున్నంత సేపు ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ వంటి నటీనటుల పాత్రల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అదే విధంగా ఆ పాత్రల మధ్య వచ్చే సున్నితమైన హాస్యం కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. పైగా కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతంగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది.

ఇక నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన ప్రియద‌ర్శి అద్భుతంగా నటించాడు. అలాగే సుధాక‌ర్ రెడ్డి కూడా ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. అలాగే హీరోయిన్ గా కనిపించిన కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ తన సహజ నటనతో ఆకట్టుకుంది. ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గ్రామస్థులు గా నటించిన నటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.

 

మైనస్ పాయింట్స్ :

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు వేణు యెల్దండి కథనం విషయంలో మాత్రం స్లోగా అనిపించారు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్స్ ను ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది. ఇక కొమురయ్య పాత్ర చనిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడుతుంది.

నటినటులందరూ బాగా నటించినా.. సినిమాలో స్టార్ వాల్యూ లేకపోవడంతో.. ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుంది. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఆకట్టుకునే స్టఫ్ సినిమాలో ఉన్నా, స్టార్ వాల్యూ కారణంగా వాళ్ళు ఈ సినిమా చూడటానికి ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది చూడాలి.

 

సాంకేతిక విభాగం :

వేణు యెల్దండి దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. కాకపోతే సినిమా కథనం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. లో బడ్జెట్ లో పక్కాగా ప్లాన్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంది.

 

తీర్పు :

సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ బలగం సినిమా నిలిచిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు, మూర్ఖత్వంతో అమాయకపు ప్రాణుల పడే తాపత్రయం, అలాగే వారి జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అయితే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో న్యాచురల్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు