సమీక్ష: “బనారస్” – అక్కడక్కడ పర్వాలేదనిపించే లవ్ డ్రామా

సమీక్ష: “బనారస్” – అక్కడక్కడ పర్వాలేదనిపించే లవ్ డ్రామా

Published on Nov 5, 2022 3:04 AM IST
Banaras Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్ తదితరులు

దర్శకుడు : జయతీర్థ

నిర్మాతలు: తిలక్ రాజ్ బల్లాల్, ముజమిల్ అహ్మద్ ఖాన్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటర్: కె.ఎం. ప్రకాష్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

జైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ నటించిన పాన్ ఇండియా మూవీ బనారస్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం నేడు థియేటర్ల లోకి వచ్చింది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

సిద్ధార్థ్ (జైద్ ఖాన్) ప్రేమలో ధని (సోనాల్ మోంటెరో) పడుతుంది అని అతని ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ లో భాగం గా ధనిని లవ్ లో పడేస్తాడు. సిద్ధార్ద్ ప్రేమ ను పూర్తిగా నమ్ముతుంది ధని. సిద్ధార్థ్ కారణం గా ధని ఒక సమస్యలో పడుతుంది. తన తప్పును తెలుసుకున్న సిద్ధార్ద్ ఆమెకు క్షమాపణ చెప్పడానికి బనారస్ కి వెళ్తాడు. సిద్ధార్థ్ ధనికి క్షమాపణ చెప్పాడా? ధని అతన్ని క్షమించిందా? ఈ విషయంలో సిద్దార్థ్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాలు తెలియాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

బనారస్ అంటూ ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా వచ్చాడు జైద్ ఖాన్. ఈ చిత్రం లో చాలా బాగా నటించాడు. మొదటి సినిమానే అయిన సులువుగా నటించడం మాత్రమే కాకుండా, కీలక సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుండి చివరి వరకు సినిమా లో చాలా ఈజీ గా నటించారు. అంతేకాక తను చాల స్టైలిష్ గా కనిపించాడు. రాబోయే రోజుల్లో ఇతని నుండి మంచి చిత్రాలు ఆశించవచ్చు.

సోనాల్ మోంటెరో ఈ చిత్రం లో అందంగా ఉంది. తన పాత్రలో బాగా సరిపోయింది. సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా స్టార్ట్ అవుతుంది. సినిమా మొదటి పది నిమిషాలు సన్నివేశాల్లో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ డీసెంట్ గా ఉంది.

సుజయ్ శాస్త్రి, అచ్యుత్ కుమార్, దేవరాజ్ లు తమ తమ పాత్రల్లో చాలా డీసెంట్‌గా నటించారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. డైలాగ్‌లు, ఫన్ పోర్షన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

 

మైనస్ పాయింట్స్:

 

అసలు సమస్య ఏమిటంటే మెయిన్ ప్లాట్‌ను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం. డైరెక్టర్ అసలు మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పై అంతగా దృష్టి పెట్టలేదు. వీటి కారణం గా లవ్ ట్రాక్ కాస్త లాగ్ అనిపిస్తుంది. అసలు కథ ఇంటర్వల్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది.

సెకండాఫ్‌లోని ఇంట్రెస్టింగ్ గా సాగే సన్నివేశాల కోసం ఎదురు చూస్తాం. అయితే అసలు ట్విస్ట్ వచ్చినప్పుడు డిజప్పాయింట్ అవుతుంది. తీసుకున్న పాయింట్ కి స్క్రీన్ ప్లే కి అసలు పొంతన ఉండదు. అంతేకాక సినిమాలో చాలా జానర్‌లు మరియు కాన్సెప్ట్‌లను జోడించడానికి ప్రయత్నించాడు, అందువలన సినిమా వీటన్నింటి మధ్య ఎక్కడో మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. పాటలు స్పీడ్ బ్రేకర్లుగా వచ్చినట్లు అనిపిస్తుంది.

సినిమా ఏ విధంగా సాగింది అనేది అర్దం కాదు. సినిమాలో ఎమోషన్స్ ఇంకా బాగా చూపించవచ్చు. క్లైమాక్స్ లో ఫిలసాఫికల్ అప్రోచ్ ఉన్నప్పటికీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండదు.

 

సాంకేతిక విభాగం:

 

మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బనారస్ లో ఉన్న అందమైన లొకేషన్స్ ను చాలా బాగా చూపించారు. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.

డైరెక్టర్ జయతీర్థ దర్శకత్వం తక్కువ స్థాయిలో ఉంది. అతను స్క్రీన్‌ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది. భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే అతని ఆలోచన బాగానే ఉంది, కానీ అతను చాలా అంశాలను జోడించడం వల్ల సినిమా అంత క్లారిటీ గా ఉండదు. సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు అతను కొన్ని అంశాలకే పరిమితం చేసి ఉండాల్సింది. అలాగే, రైటింగ్ పై మరింత కష్టపడాల్సి ఉంది. అయితే, జయతీర్థ నటీనటుల నుండి సరైన పెర్ఫార్మెన్స్ లను రాబట్టడం లో విజయం సాధించారు అని చెప్పాలి.

 

తీర్పు:

 

మొత్తమ్మీద బనారస్ చిత్రం ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ సన్నివేశాలతో, అక్కడక్కడ పర్వాలేదు అని అనిపిస్తుంది. జైద్ ఖాన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అయితే స్క్రీన్ ప్లే సరైన రీతిలో సాగక పోవడం తో సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. సమయం ఉంటే ఈ వారాంతం సినిమా చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు