విడుదల తేదీ : జనవరి 23, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : అల్లరి నరేష్, పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను తదితరులు
దర్శకత్వం : గిరి పాలిక
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర
సంగీతం : సాయి కార్తీక్
ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ అల్లరి నరేష్ కొత్త చిత్రం ‘బంగారు బుల్లోడు’. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ గిరి పాలిక ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
భవాని ప్రసాద్ (అల్లరి నరేష్) తన తాతయ్య (తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పును సరిదిద్దే ప్రయత్నంలో ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు ఇంతకీ తన తాతయ్య చేసిన తప్పు ఏమిటి ? ఈ క్రమంలో కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆమె అతని ప్రేమ కోసం ఏం చేసింది ? వీళ్ళ ప్రేమకు వచ్చిన సమస్య ఏమిటి ? చివరకు తన తాతయ్య చేసిన తప్పును భవానీ ప్రసాద్ ఎలా సాల్వ్ చేశాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
గిరి పాలిక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే పల్లె వాసనను గుర్తు చేసే సీన్స్, అలాగే బంధాలు బంధుత్వాలకి సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లరి నరేష్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన తాతయ్య చేసిన తప్పును, సరిదిద్దే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాల్లో నరేష్ చాల బాగా నటించాడు. అలాగే కామెడీ సీన్స్ బాగున్నాయి.
అలాగే మరో కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ కొన్ని కామెడీ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు. ముఖ్యంగా తమ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నరేష్ సరసన పూజా జవేరి కథానాయికగా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రలో నటించిన పోసాని తన ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో కనిపించనంత ఆయన అలరిస్తారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు మరియు తనికెళ్ళ భరణి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్, పోసాని క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనంలో సరైన ప్లో లేదు.
ఇక కొన్ని నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని సహజంగా ఉండదు. ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.
సెకెండ్ హాఫ్ లో కూడా కథనం అసలు బాగాలేదు. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా ఆకట్టుకోదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు. సినిమాలో స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉంది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు గిరి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ తో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు కూడా బాగాలేదు. అయితే స్వాతిముత్యం సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
‘బంగారు బుల్లోడు’ అంటూ సీరియస్ పాయింట్ లో కామెడీ సీన్స్ తో మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో సాగిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని కామెడీ సన్నివేశాలు మరియు సంఘర్షణ లేని ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team