విడుదల తేదీ : అక్టోబర్ 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాజేంద్రప్రసాద్, సంజోష్, హర్షిత తదితరులు.
దర్శకత్వం : రమేష్ చెప్పాలా
నిర్మాతలు : పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్
సంగీతం : సునీల్ కశ్యప్
స్క్రీన్ ప్లే : రమేష్ చెప్పాలా
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బేవర్స్’. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సత్యమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ఓ చిన్న వ్యాపారవేత్త, తన కుమారుడు (సంజోష్) ఏ పని చెయ్యకుండా ఖాళీగా జులాయిగా తిరుగుతుంటాడు. దాంతో సత్యమూర్తి తన కొడుకు భవిష్యత్తు గురించి ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఈ కారణంగా తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అయితే సత్యమూర్తి కూతురు సిరి మాత్రమే తన అన్నయ్య సంజోష్ కి మద్దతిస్తూ సపోర్ట్ చేస్తుంటుంది. కానీ తండ్రి కొడుకుల గొడవల కారణంగా.. కుటుంబ సమస్యల కారణంగా సిరి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. సిరి ఆత్మహత్యకు సంబంధించి సాగే కథనంలో ఎవరూ ఉహించని ట్విస్ట్ తో సినిమా సాగుతుంది.
అయితే సిరి ఆత్మహత్య చేసుకుంది కుటుంబ సమస్యల కారణంగానేనా ? సంజోష్ తన చెల్లి ఆత్మహత్య విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఆ తరువాత ఆటను ఏం చేసాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ మంచి భావోద్వేగమైన ప్రదర్శనను కనబర్చారు. ముఖ్యంగా తన కుమార్తె మరణం తర్వాత.. వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన జీవించారు. తన ఎక్స్ ప్రెషన్స్ తో అద్భుతమైన భావోద్వేగాలను పలికించారు. అలాగే పతాక సన్నివేశంలో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
దర్శకుడు రమేష్ చెప్పాల రాసుకున్న తండ్రి కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కూతురు సిరి పాత్రను పోషించిన నటి చాలా చక్కగా నటించింది. సినిమాలో ఆమెది కీలకంగా ఆమె పాత్ర డిజైన్ చెయ్యడం మరియు ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.
మొదటి సారి హీరోగా నటించిన సంజోష్ లుక్స్ పరంగా బాగానే ఉన్నాడు. తన తండ్రికి, తనకు మధ్య సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో సంజోష్ నటన పర్వాలేదనిపిస్తోంది. ఇక కథానాయకిగా నటించిన హర్షిత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తన గ్లామర్ తో ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తోంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన సంజోష్ పర్వాలేదనిపించిన.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో పేలవ ప్రదర్శన చేశాడు. హాస్యనటుడు మధు ఎపిసోడ్లు కూడా చాలా సాగతీత వ్యవహారంతో సాగుతూ విసుగు తెప్పిస్తాయి.
సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ లైన్ కి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో విఫలమయ్యారు. పైగా చాలా సన్నివేశాలను చాలా బోర్ గా తెరకెక్కించారు. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీలో చాలా సన్నివేశాలు ఆకట్టుకున్నే విధంగా సాగవు. పైగా చాలా చోట్ల సినిమాటెక్ గానే సాగుతాయి. ఒక్క ట్విస్ట్ మినహా మిగతా స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.
మొత్తానికి దర్శకుడు సినిమాలో మంచి స్టోరీ లైన్ తీసుకున్నా సినిమాని ఇంట్రస్టింగ్ గా మలిచే ప్రయత్నం చేసినా .. స్క్రీన్ ప్లే లో ఆసక్తి లోపించడం, పైగా ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో అని ఆడియన్స్ కి అర్ధమై లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అప్పటికే ఆడియన్స్ సినిమా పై పూర్తి అసంతృప్తికి లోనవుతాడు.
సాంకేతిక విభాగం :
రమేష్ చెప్పాలా రచయితగా పర్వాలేదనిపించిన దర్శకుడిగా మాత్రం విఫలమయ్యారు. ఆయన షాట్ కంపోజింగ్ మీద , కథనం మీద ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. తల్లి తల్లి చాలా బాగా ఆకట్టుకుంటుంది . సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఏం అనిపించదు సినిమాలోని నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లే ఉంది.
తీర్పు :
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో వచ్చిన ‘బేవర్స్’ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ మంచి భావోద్వేగమైన ప్రదర్శనను కనబర్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన జీవించారు. ఇక సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపించినా.. మిగిలిన కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team