విడుదల తేదీ : 30 జూలై, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : ప్రభాకర్ జైని
నిర్మాత : విజయలక్ష్మి జైని
సంగీతం : ఘంటశాల విశ్వనాథ్
నటీనటులు : శ్యామ్‌కుమార్, పావని
ప్రముఖ రచయిత ‘నవీన్’ రచించిన తొలి పుస్తకం ‘అంపశయ్య’, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘క్యాపస్ – అంపశయ్య’. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మాణంలో దర్శకుడు ‘ప్రభాకర్ జైని’ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
1965- 70 ల మధ్యకాలంలో తెలంగాణాలోని ఓ మారు మూల పల్లెటూరిలో చదువుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి రవి (శ్యామ్‌కుమార్) ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీకి చేరుకుంటాడు. ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం సిద్దమవుతున్న ఆ విద్యార్థి ఒకరోజు తనలోని మానసిక సంఘర్షణల కారణంగా తీవ్రమైన అభద్రతా భావానికి లోనవుతూ క్యాంపస్ అంటేనే భయపడుతుంటాడు. అసలు అతని భయానికి కారణం ఏమిటి ? ఆ ఒక్కరోజు అనుభవాలు అతనికి ఎలాంటి పాఠం నేర్పాయి ? ఆ అనుభవాలేమిటి ? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవలసింది ఈ సినిమాకి ఎంచుకున్న కథాంశం. సుప్రసిద్ధ నవలాకారుడు ‘నవీన్’ గారు రచించిన తొలి పుస్తకమైన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ఒక మధ్యతరగతి చెందిన వయసులో ఉన్న కుర్రవాడు ఎలాంటి ప్రలోభాలకు లోనవుతాడు, ఆ ప్రలోభాలకు, కర్తవ్యానికి మధ్య అతను ఎలా నలిగిపోతాడు అనే అంశాలను చూపడం బాగుంది. హీరోగా నటించిన శ్యామ్‌కుమార్ నటన పర్వాలేదు. రతి పాత్రలో నటించిన ‘పావని’ నటన బాగుంది. సినిమా రెండవ భాగంలో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే భవోద్వేగపూరిత సన్నివేశాలు కొన్ని ఆకట్టుకుంటాయి. అలాగే ఒకప్పటి తెలంగాణాలో బ్రతికిన మధ్య తరగతి రైతు కుటుంబం పడే కష్టాలను కూడా కాస్త బాగానే చూపారు.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానైకొస్తే ముందుగా ఓ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన గొప్ప నవలను తెరపై చూపాలనుకున్నప్పుడు అందులోని లోతైన భావాలను ఖచ్చితంగా ప్రేక్షకుడి కళ్ళకు కట్టినట్టు చూపాలి కానీ ఇక్కడ దర్శకుడు ఆ విషయంలో చాలా వరకూ విఫలమయ్యాడు. చాలా చోట్ల ఒకటే సన్నివేశాలు, సందర్భాలు రిపీటై విసుగు తెప్పిస్తాయి. వయసులో ఉన్న మధ్యతరగతి కుర్రవాడు ఎదుర్కునే బీదరికం, అసమానత, శారీరక కోరికలు వంటి వాటిని నవలలో నుండి తీసుకున్నాడే కానీ వాటిని ప్రభావవంతంగా చూపలేకపోయాడు దర్శకుడు.
అలాగే సినిమా మొత్తం ఉదయం నుండి రాత్రి 10: 16 గంటల వరకూ ఓ విద్యార్థికి ఎదురయ్యే అనుభవాలని, అవే అతనికి కర్తవ్య బోధ చేస్తాయని అన్నారేగాని ఎక్కడా కదిలించే, చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. పైగా మొదటగా క్యాంపస్ విద్యార్థికి అంపశయ్యలా అనిపిస్తుందని, కానీ దాన్ని పూలశయ్యలా భావిస్తే విద్యార్థి తన కర్తవ్యాన్ని చేరుకుంటాడని లేకుంటే భయపడుతూనే ఉంటాడని ఓ మంచి మాట చెప్పారు గాని నడిపిన కథనం మాత్రం పూర్తిగా ఆ మాటకు న్యాయం చెయ్యలేదు. పైగా చివరగా క్లైమాక్స్ లో అంతటి సంఘర్షణ అనుభవించిన విద్యార్థికి ఒకే ఒక్క చిన్న సంఘటనతో అతనిలో ఉన్న భయాలన్నీ పోయి నార్మల్ గా మారుతాడని చూపడం అస్సలు మింగుడు పడదు.
సాంకేతిక విభాగం :
నవల నుండి మంచి కథాంశాన్ని తీసుకున్నాడే గాని ఆ నవలలోని కథనాన్ని తెరపై నడపడంలో రచయితగా, దర్శకుడిగా ప్రభాకర్ జైని విఫలమయ్యారు. సంగీతం విషయానికొస్తే ఎక్కడా కూడా వినదగ్గ సంగీతం అందించలేదు ‘ఘంటసాల విశ్వనాథ్’. రవికుమార్ నీర్ల కెమెరా పనితనం అసలు ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ మినహా మిగతా నటీనటుల నటన బాగోలేదు. అలాగే ఎడిటింగ్ కూడా బాగోలేదు. విజయలక్ష్మి జైని నిర్మాణ విలువల పరవాలేదనేలా ఉన్నాయి.
తీర్పు :
ఎందరి హృదయాలనో కదిలించిన ప్రసిద్ధ నవలను సినిమాగా చెయ్యాలని అనుకున్నప్పుడు అందులోని కథానాన్నీ, మాటలను సినిమా వాతావరణానికి తగ్గట్టు చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. ఆయా పాత్రల్లో నటించే నటీనటుల నటనలో పరిణితి ఉండేలా చూసుకోవాలి, కథనంలో ప్రేక్షకుడిని కదిలించే బలముండాలి. కానీ ఇవేవీ ఈ సినిమాలో లేవు. మానసిక సంఘర్షణ అని చూపినప్పుడు అవి ప్రేక్షకుడికి దగ్గరగా ఉండేలా ఉండాలి. కానీ ఈ సినిమా అలా లేదు. అంత మానసిక సంఘర్షణ అనుభవించాడని చెప్పిన (చూపలేదులెండి) విద్యార్ధి ఒకే ఒక్క చిన్నపాటి ఐకమత్యపు సన్నివేశంతో పూర్తిగా పరిణితి సాధిస్తాడని అరకొరగా సినిమాని తేల్చేశాడు దర్శకుఢు. ఒక్క మాటలో చెప్పాలంటే నావెల్ బేస్డ్ మూవీ అనుకుని, అందులో ఏదో ఉంటుందనుకుని వెళితే మాత్రం ఖచ్చితంగా నిరుత్సాహం తప్పదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team