సమీక్ష: C/O కంచరపాలెం – హృదయానికి హత్తుకుపోతుంది

 Coco Kokila movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 07, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్

దర్శకత్వం : వెంకటేశ్ మ‌హా

స‌మ‌ర్ప‌ణ‌ : ద‌గ్గుపాటి రానా

నిర్మాత : విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

సంగీతం : స‌్వీక‌ర్ అగ‌స్తి

సినిమాటోగ్రఫర్ : ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్

ఎడిటర్ : రవితేజ గిరిజిల

నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ కంచెర పాలెం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ కె, నిత్య శ్రీ తదితరులు నటించగా పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం..

 

కథ :

కంచెర పాలెంలో అనే ఊరిలో నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి కానీ రాజు అనే వ్యక్తితో ఈ కథ మొదలవుతుంది. అదే ఊరిలో ఉండే ఐదు సంవత్సరాల పిల్లలు సునీత – సుందరం మధ్య ప్రేమ కథతో పాటుగా జోసెఫ్ – భార్గవి, అలాగే గడ్డం – సలీమా ప్రేమ కథలతో ఈ సినిమా సాగుతుంది. సరదాగా సాగుతున్న ఈ ప్రేమ కథలకు మతం, కులం, వయస్సు, అంతస్తు ఇలా సమాజంలోని ముఖ్యమైన సామాజిక అంశాలన్నీ ఈ ప్రేమ కథలకు అడ్డుగోడగా నిలుస్తాయి.

మరి ఈ ప్రేమికులు ఆ అడ్డుగోడల నుండి తప్పించుకొని తమ ప్రేమను గెలిపించుకున్నారా ? లేక ఆ మతం, కులం పిచ్చికి తమ ప్రేమలో ఓడిపోయారా ? అసలు ఈ ప్రేమ కథలన్నిటికి ఉన్న సంబధం ఏమిటి ? ఈ కథల్లోని పాత్రలన్ని ఒకే కథలో ఏ విధంగా కలుస్తాయి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్.. ఈ కథ జరిగిన నేపధ్యమే అని చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు కంచెర పాలెం అనే ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు మహా రాసుకున్న సున్నితమైన ప్రేమ కథలు కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం అబ్బురపరుస్తుంది.

అలాగే ప్రధానంగా సాగే నాలుగు ప్రేమ కథలు కూడా ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి. వీటితో పాటు మహా టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. కథనంలో ఫ్లో తగ్గుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ లేదా ఫన్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతాయి.

దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రేమ, కామెడీ, మరియు కులం, మతం వంటి సున్నితమైన అంశాలను వాటి వల్ల మనుషులు పడుతున్న ఇబ్బందలను చూపించటం నేటి సమాజంలో కూడా కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాలను చాలా వాస్తవికంగా చూపించటం ఆకట్టుకుంటుంది.

మహా రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. ఇక 50 ఏళ్ల వయస్సులో ఉన్న రాజు – రాధ ప్రేమ కథ, చాలా సరదాగా సాగుతూ మంచి అనుభూతిని మిగులుస్తోంది. అలాగే గడ్డం సలీమా విషాదపు ప్రేమ కథ భావోద్వేగాలతో మన హృదయాన్ని కదిలిస్తాయి. ఇదే కోవకు చెందే మరో ప్రేమ కథ జోసెఫ్ – భార్గవిలది. ఇక పిల్లలు సునీత సుందరం ప్రేమ మన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది.

సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

ఇక ఫైనల్ గా స్వీకర్ అగస్తి అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్. అగస్తి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.

 

మైనస్ పాయింట్స్ :

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు మహా కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. మొదటి ఇరవై నిముషాలు ఈ సినిమా స్థాయికి తగట్లు లేదు.

అందరూ నూతన నటినటులతోనే సినిమాని తెరకెక్కించడం ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడంతో, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

జోసెఫ్ ప్రేమలో పడే బ్రాహ్మణ యువతి భార్గవి ప్రేమ కథ బాగా వివరించినప్పటికీ, వారి కథను తేలికగా ముగించడం సంతృప్తికరంగా అనిపించదు.

 

సాంకేతిక విభాగం :

మహా దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. కాకపోతే సినిమా మొదటి ఇరవై నిముషాల పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి అందించిన నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఇలాంటి చిన్న చిత్రానికి అగస్తి చాలా కాలం గుర్తుండిపోయే పనితనం కనబర్చారు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.

నిర్మాత పరుచూరి విజయ ప్రవీణాను ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాత పాటించిన ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న రానాను కూడా అభినందించి తీరాలి.

 

తీర్పు :

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పణలో నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ చిత్రం సగటు ప్రేక్షకుడ్ని భావేద్వేగమైన ప్రేమ కథలతో, సున్నితమైన హాస్యంతో మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా సినిమా చూస్తున్నంత సేపు కంచెర పాలెం అనే ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేని ఈ సినిమా.. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.

కానీ దర్శకుడు ‘మహా’ రాసుకున్న ప్రేమ కథలు, పాత్రలు, ఆ పాత్రాల తాలూకు సంఘర్షణలు.. మళ్లీ ఆ కథలను పాత్రలను ఒకే కథలోకి కలిపిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో సందేహం లేదు.
123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

 

గమనిక : ‘కేరాఫ్ కంచెర పాలెం’ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన ‘రామానాయుడు స్టూడియో’లో ప్రెస్ కి ప్రత్యేకంగా ప్రివ్యూ వేయటం జరిగింది. కావున మేము చిత్రం చూసిన తర్వాత, మాకు కలిగిన స్పందనను ఈ ‘సమీక్ష’ రూపంలో రాశాము. ఇక ఈ ‘కేరాఫ్ కంచెర పాలెం’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల అవ్వబోతుంది.

 

Click here for English Review

Exit mobile version