విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5 | ||
దర్శకుడు : పోన్ కుమరన్ | ||
నిర్మాత : రమేష్ కృష్ణమూర్తి | ||
సంగీతం: సుందర్ సి బాబు | ||
నటీనటులు : ప్రియమణి, శరణ్య, సీత |
అమ్మోరు, అరుంధతి, మంత్ర వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తరువాత ఆ తరహా సినిమాలు ఒకటి అరా వస్తున్నా ఏవి పెద్దగా ఆడలేదు. ఇప్పడున్న హీరొయిన్లలో ఇలాంటి చాలెంజింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు న్యాయం చేయగల నటి ప్రియమణి అని చెప్పుకోవచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమా అది కూడా అవిభక్త కవలలుగా ప్రియమణి చారులత సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించింది. ప్రేక్షకుల ముందుకి ఈ రోజే వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
అవిభక్త కవలలు పుట్టిన చారు – లత (ప్రియమణి) ఆపరేషన్ చేయించుకోకుండా ఒకరికొకరు అలాగే కలిసి ఉంటారు. వయోలిన్ అంటే మక్కువ ఉన్న చారు-లత వయోలిన్ నేర్పడానికి మాస్టారు నిరాకరించినా పట్టుదలతో వయోలిన్ నేర్చుకుని మాస్టారుని మెప్పిస్తారు. అక్కడే వయోలిన్ నేర్చుకోవడానికి వచ్చిన రవి (స్కంద) చారుని చూసి ప్రేమిస్తాడు. చారు కూడా రవిని ప్రేమిస్తుంది. మరోవైపు లత కూడా రవిని ప్రేమిస్తుంది. రవి చారుని మాత్రమే ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న లత చారు మీద కసి పెంచుకుంటుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు చారు-లత- రవి ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రియమణి తను కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే అంకితం కాదని నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తే సత్తా చూపగలనని మరోసారి చేసి చూపెట్టింది. అవిభక్త కవలలుగా చారు-లత రెండు విభినమైన పాత్రలలో చాలా బాగా చేసింది. సున్నితమైన మనస్కురాలిగా చారు పాత్రలో, నెగటివ్ షేడ్స్ ఉన్న లత పాత్రలో రెండు పాత్రలకి విభిన్నత చూపించడంలో సక్సెస్ అయింది. చారుని ప్రేమించిన రవి పాత్రలో నటించిన స్కంద కూడా బాగా చేసాడు. చారు-లత తల్లిగా శరణ్య పాత్ర చిన్నదే అయినా పర్వాలేదనిపించింది. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుల్ని భయ పెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో ప్రియమణి ఒంటరిగా ఇంట్లో తిరిగే సమయంలో ఒళ్ళు గగుర్పోడిచేలా భయపెట్టాడు.
మైనస్ పాయింట్స్ :
ఎలోన్ అనే థాయ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లోని కథని మాత్రమే తీసుకున్నారు కాని అందులో ఉన్న ఆత్మ కథని మరిచారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉండాలి. కేవలం జనాలని భయపెట్టి సొమ్ము చేసుకుందామంటే కుదరదు. కథ కూడా చిన్నదే కావడంతో స్క్రీన్ ప్లే బలంగా ఉండాలనే విషయం మరిచారు. దర్శకుడు స్టొరీ నేరేషన్ విషయంలో గందరగోళంలో పడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్లు పార్ట్లు చెప్తూ స్టొరీ నేరేషన్ క్లారిటీ లేకుండా చేసాడు. సినిమాకి కీలకమైన ట్విస్ట్ రెవీల్ చేసే సమయంలో ఆసక్తి కలిగించేలా లేకపోవడం బాగా మైనస్ అయింది. పతాక సన్నివేశాలు కూడా సాగాతీస్తూ సహనానికి పరీక్ష పెట్టాడు. కామెడీ కోసం పెట్టిన ట్రాక్ పరమ రోతగా ఉంది. స్వామిజి పాత్ర కేవలం దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి మాత్రమే పెట్టినట్లుగా ఉంది. ఆ పాత్రకి ఎండింగ్ లేదు. చారుకి, రవికి లత దెయ్యం రూపంలో కనపడుతున్నట్లు చూపించిన దర్శకుడు నిజంగా దెయ్యం ఉందా లేదా అన్న జస్టిఫికేషన్ ఇవ్వకుండా వదిలేసాడు.
సాంకేతిక విభాగం :
పన్నీర్ సెల్వన్ సినిమాటోగ్రఫీ బావుంది. చాలా సన్నివేశాల్లో భయపెట్టడంలో కెమెరా యాంగిల్స్ వాడిన విధానం వల్ల బాగా చాలా హెల్ప్ అయింది. సుందర్ సి బాబు సంగీతంలో లాలి లాలి పాట బావుంది. నేపధ్య సంగీతం సినిమాకి బాగా హెల్ప్ అయింది. చాలా సన్నివేశాలు ఎలివేట్ చేయడంలో సఫలం అయ్యాడు సంగీత దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వయోలిన్ బిట్ కూడా చాలా బావుంది.
తీర్పు:
రీమేక్ చేసే విషయంలో దర్శకుడు తడబడటంతో చారు-లత కేవలం భయపెట్టడంలో మాత్రమే సక్సెస్ అయింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు కీలకమైన స్క్రీన్ ప్లే లోపల వల్ల నెమ్మదించి మంచి సినిమా కావాల్సిన దాన్ని చెడగొట్టారు. ప్రియమణి నటన, భయపెట్టించే కొన్ని సన్నివేశాలు తప్ప చారులతలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
అశోక్ రెడ్డి. ఎమ్