విడుదల తేదీ : నవంబర్ 14th,2020
123telugu.com Rating : 3/5
నటీనటులు : పునర్నవి, ఉద్భవ్ రఘునందన్
దర్శకత్వం : పవన్ సాధినేని
కెమరామెన్ : సత్తి ఎన్
ఎడిటర్ : విప్లవ్
ఆర్ట్ : వినోద్
సంగీతం : ఆనంద్ సుదీర్
పునర్నవి, ఉద్భవ్ రఘునందన్ జంటగా వస్తోన్న వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’. విష్ణు, వెంకటేష్, నమ్రత, టీఎన్ఆర్, సాయి శ్వేత తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. కాగా ఓటీటీ వేదిక ఆహాలో విడుదల అయింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ
ఫణి (ఉద్భవ్ రఘునందన్) యుఎస్ నుండి తిరిగి వచ్చి తన లవర్ అను (పునర్నవి) ఇంటికి వెళ్ళి, అకస్మాత్తుగా ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. అయిష్టంగానే అనుఅతనికి యస్ చెబుతుంది. కానీ ఆమె తన ఉద్యోగంలో మరియు జీవితంలో స్థిరపడే విషయంలో కొంత నిబద్ధత అండ్ భయం కలిగి ఉంటుంది. ఈ క్రమంలో వీరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఫణి ప్రవర్తనను అను ద్వేషిస్తోంది. దాంతో ఈ జంట మధ్య అపార్ధాలు మొదలవుతాయి. వీరి బంధం మరింత కష్టతరం అవుతోంది.ఇక వివాహం చేసుకోకూడదని ఇద్దరు నిర్ణయించుకుంటారు. మరి తమ మది ఏర్పిడిన అపార్ధాలను ఈ జంట ఎలా తొలిగించుకున్నారు ? చివరకు వీరి కథ ఎలా ముగుస్తుంది అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూమ్‌మేట్స్’ అనే హిట్ వెబ్ షోకి అధికారిక రీమేక్. అయితే దర్శకుడు పవన్ సాదినేని మరియు అతని బృందం సిరీస్ నేపథ్యాన్ని పట్టణ హైదరాబాదీ నగర సంస్కృతికి చక్కగా సెట్ చేసుకున్నారు. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం మరియు కళా దర్శకత్వం చాలా బాగున్నాయి. సిరీస్ లో చాల చోట్ల మంచి అనుభూతిని ఇస్తుంది.
ఇక హీరోగా నటించిన ఉద్భవ్ రఘునందన్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. పునర్నవితో అతని కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పునర్నవి తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో పునర్నవి మెప్పించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సిరీస్ లో కేవలం ఐదు భాగాలు మాత్రమే ఉన్నాయి. అయితే సిరీస్ లోని మెయిన్ ఎమోషన్.. భావోద్వేగ కోణం బాగున్నా.. మేకర్స్ మరికొన్ని సీన్స్ జోడించి, హీరోయిన్ అనుభవిస్తున్న బాధను ఇంకా బలంగా చూపించే మరికొన్ని ప్రభావవంతమైన సన్నివేశాలను ఎపిసోడ్స్ లో జోడించి ఉంటే, సిరీస్ ఇంకా ప్రభావవంతంగా ఉండేది.
అలాగే ఫణి పాత్రను మేకర్స్ మరింత స్పష్టంగా రాసుకోవాల్సింది. అతను ఎందుకు హఠాత్తుగా ప్రవర్తిస్తుంటాడు మరియు వివాహం కోసం హీరోయిన్‌ను ఎందుకు చికాకు పెడతాడు, అసలు అతని ఉద్దేశాన్ని ఇంకా స్పష్టంగా వివరించాల్సింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. లెంగ్త్ పెరగకుండా ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేశాడు. సిరీస్ లో సినిమాటోగ్రఫీ పర్వాలేదు. దర్శకుడు పవన్ దర్శకత్వం పరంగా బాగా ఆకట్టుకున్నాడు . అలాగే ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకున్నాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
మొత్తం మీద, ఈ కమిట్ మెంటల్ అనేది పట్టణ రోమ్-కామ్. ఈ సిరీస్ చాల సరదాగా సాగుతూ బాగానే ఆకట్టుకుంటుంది. కథ నిత్యకృత్యంగా ఉన్నప్పటికీ, ప్రధాన పాత్రలు మధ్య సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. పవన్ సాదినేని తేలికపాటి కామెడీతో మంచి డ్రామాను పండించే ప్రయత్నం చేశాడు. లవర్స్ కి సిరీస్ లోని అంశాలు నచ్చుతాయి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team