సమీక్ష : D for దోపిడీ – B for బోరింగ్..

D-For-Dopidi-telugu-review విడుదల తేదీ : 25 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : సిరాజ్ కల్ల
నిర్మాత : రాజ్ – డికె, నాని
సంగీతం : మహేష్ శంకర్
నటీనటులు : వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలినా కన్నోకద..

వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలినా కన్నోకద ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘D for దోపిడీ’. బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రాజ్ – డికె నిర్మించిన ఈ సినిమా ద్వారా సిరాజ్ కల్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే ఈ సినిమా బాగా నచ్చడంతో హీరో నాని వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు. దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు D for దోపిడీ సినిమా ప్రేక్షకుల మనసుని దోపిడీ చేసుకుందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

విక్కీ (వరుణ్ సందేశ్), రాజీవ్ అలియాస్ రాజు (సందీప్ కిషన్), హరీష్ (నవీన్), బన్ను(రాకేష్) మంచి ఫ్రెండ్స్. విక్కీకి ఏమో గర్ల్ ఫ్రెండ్స్ పిచ్చి ఉండడంతో అందరికీ షాపింగ్ లకి అని బాగా డబ్బు ఖర్చు పెట్టేసి ఆ డబ్బులు కట్టలేక రికవరీ ఏజంట్స్ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సో విక్కీకి మనీ కావాలి. రాజు సినిమా హీరో అవ్వాలని ఇండస్ట్రీలో తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక రైటర్ కమ్ డైరెక్టర్ నువ్వు 20 లక్షలు ఇస్తే నువ్వే హీరో అని చెప్తాడు. సో రాజీవ్ కి డబ్బు అవసరం. హరీష్ కి తన మరదలు అంటే ఇష్టం. తనను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మామతో డబ్బు సంపాదిస్తానని శబదం చేస్తాడు. సో హరీష్ కి డబ్బు కావాలి. ఇక చివరిగా బన్నుకి పెద్ద సమస్యలు ఏమీ లేవు కానీ వాని అంటే ఇష్టం. దాంతో బాగా బొద్దుగా ఉండే బన్ను మూడు రోజుల్లో సిక్స్ ప్యాక్ తెచ్చుకొని వానికి ప్రపోజ్ చెయ్యాలనుకుంటాడు. దానికి బన్నుకి కూడా మనీ కావలి.

సో ఇలా పలు రకాల ఇబ్బందుల వల్ల అందరికీ డబ్బు అవసరం అవ్వడంతో ఓ బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఈ నలుగురు ఎంతవరకూ దోపిడీ విషయంలో సక్సెస్ అయ్యారు? ఆ దోపిడీ సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి అనుకున్న డబ్బుతో బయటపడ్డారా? లేక పోలీసుల చేతికి చిక్కారా? అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నాని ఈ సినిమాలో బాగస్వామి కావడం. దానివల్ల సినిమా ప్రమోషన్స్, రిలీజ్ కి చాలా హెల్ప్ అయ్యింది. ఇక సినిమా మొదట్లో పాత్రలను పరిచయం చేయడానికి వచ్చే నాని వాయిస్ ఓవర్ మరియు డైలాగ్స్ చాలా బాగున్నాయి.

సినిమాలో అందరి పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మంచి నటనని కనబరిచాడు. సందీప్ కిషన్ నటన కూడా బాగుంది. సందీప్ చేత చెప్పించిన కొన్ని వెటకారపు డైలాగ్స్ బాగున్నాయి. నవీన్, రాకేష్ ల నటన కూడా డీసెంట్ గా ఉంది. మెలినా కన్నోకదకి పెద్ద పాత్ర లేకపోయినా, తెరపై కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ చూడటానికి బాగుంది. పోలీస్ ఆఫీసర్ కృష్ణమాచారి పాత్రలో డైరెక్టర్ దేవకట్టా బాగా చేసాడు. లోకముద్దు పాత్రలో తనికెళ్ళ భరణి ఎపిసోడ్ కాసేపు ప్రేక్షకులని నవ్విస్తుంది. ముఖ్యంగా మడక దున్నే ఎపిసోడ్. అలాగే ఘోస్ట్ రైటర్ అంటూ చెవులపిల్లి అనే తాగుబోతు పాత్ర చేసినతను అక్కడక్కడా నవ్వించినా తాగుబోతు రమేష్ ని ఇమిటేట్ చేసినట్టుంది. ఆ పాత్రని తాగుబోతు రమేష్ చేసుంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యుండేది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

D for దోపిడీ అనే సినిమా ఎ ఫర్ యావరేజ్ గా, బి ఫర్ బోరింగ్ గా, స ఫర్ సిల్లీగా ఉంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ క్లైమాక్స్. అంతవరకూ ఒకలా ఉన్న సినిమా ఒక్కసారిగా బాగా రొటీన్ గా ఉంది. చెప్పాలంటే అసలు సినిమా అలా ఎలా ముగిసిపోయింది అనే అనుమానం ప్రేక్షకులకి క్రియేట్ చేసి సినిమాకి శుభం కార్డు వేసారు. అలాగే సినిమాలో లాజిక్స్ కోసం వెతికితే మీకు ఒక్కటి కూడా కనిపించకపోవచ్చు. ఒక బ్యాంకు ని దోపిడీ చెయ్యడం అంటే ఇంత ఈజీనా అనేలా బ్యాంకు రాబరీ ఉంటుంది. అందులోనో ఆ దోపిడీలో పెద్దగా లాజిక్స్ కూడా ఉండవు.

మరీ దొంగతనం మీద వచ్చిన సినిమాలు చూసి దొంగతనం ప్లాన్ చెయ్యడం, మొదటి నుంచి బ్యాంకులోకి రాలేక ఇబ్బంది పడుతున్న పోలీస్ ఆఫీసర్ చివర్లో లోపలి రావడం, చివర్లో వచ్చే ఓ నెగటివ్ పాత్రకి కర్త, కర్మ, క్రియ లాంటివి లేకపోవడం అనే కొన్ని మినిమమ్ లాజిక్స్ ని డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడో ఆయనకే తెలియాలి. అలాగే సినిమాలో సిల్లీగా అనిపించేవి కూడా చాలా ఉన్నాయి. సినిమాని ఎక్కువ సేపు ఒకేచోట తీసెయ్యడం, పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ ని నిడివి కోసం సాగదీసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో పాటలు లేవు ఉన్నవి కూడా బ్యాక్ గ్రౌండ్ లో వస్తాయి. సో ఓవరాల్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనేలా ఉంది. ఎడిటర్ కొన్ని బోరింగ్ సీన్స్ మీద కేర్ తీసుకొని కత్తిరించి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగున్నాయి. సిరాజ్ కల్లకి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్స్ ని బాగానే డీల్ చేసాడు. కానీ సినిమాని రెండు గంటలు సాగదీయకుండా నిడివి తక్కువగా ఉండేలా చూసుకొని, క్లైమాక్స్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఓకే.

తీర్పు :

‘డార్క్ కామెడీ’ జోనర్ లో వచ్చిన ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా ప్రేక్షకుల మనసులను పెద్దగా దోచుకోలేకపోయింది. కేవలం కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలిగింది. నటీనటుల డీసెంట్ పెర్ఫార్మన్స్, డైలాగ్స్, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో చెప్పదగినవి అయితే వీక్ క్లైమాక్స్, సాగదీసినట్టు అనిపించే సెకండాఫ్, పెద్దగా ఎంటర్టైన్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా పెద్ద కథ లేకపోయినా, లాజిక్స్ లేకపోయినా కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటే పరవాలేదు అనుకునే వారు ఈ సినిమాని చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version