సమీక్ష : దండకారణ్యం – ఆదివాసీల పోరాట కథ!

Savitri review

విడుదల తేదీ : ఏప్రిల్ 2 2016

123తెలుగు.కామ్ రేటింగ్ :N/A

దర్శకత్వం : ఆర్. నారాయణ మూర్తి

నిర్మాత : ఆర్. నారాయణ మూర్తి

సంగీతం : ఆర్. నారాయణ మూర్తి

నటీనటులు : ఆర్. నారాయణ మూర్తి, గద్దర్..


తెలుగు సినీ పరిశ్రమలో విప్లవ సినిమాల కథానాయకుడంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ఆర్. నారాయణ మూర్తి. ప్రజల బాధలనే తన కథలుగా చేసుకొని ఎన్నో విప్లవ చిత్రాలను తెరకెక్కించిన ఆయన, తాజాగా ‘దండకారణ్యం’ పేరుతో మరో విప్లవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆదివాసీల పోరాటం నేఫథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించడమే కాక కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం.. ఇలా ఇన్ని బాధ్యతలనూ ఆయనే చేపట్టడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందీ?? చూద్దాం..

కథ :

శ్రీకాకుళం, ఒడిషా, చత్తీస్‌గడ్ తదితర ప్రాంతాలను కలుపుకొని ఉన్న దండకారణ్యం ఫారెస్ట్ పరిసరాల్లోని బాక్సైట్ నిల్వల కోసం పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు ఆ అడవులను ధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటారు. అదే క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు/కోటన్న (నారాయణమూర్తి) అనే ఓ మధ్య తరగతి వ్యక్తి నక్సలైట్‌గా మారి ప్రజల తరపున పోరాటం చేస్తూంటాడు.

ఇక ఈ అటవీ ప్రాంతం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న కోపంతో అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కోటన్న పోరాటం సాగిస్తాడు. ఈ పోరాటాన్ని ఆయన ఏ పంథాలో కొనసాగించారు? చివరకు ఈ పోరాటంలో విజయం సాధించారా? లాంటి ప్రశ్నలకు సమాధానమే దండకారణ్యం.

ప్లస్ పాయింట్స్ :

ఆర్. నారాయణ మూర్తి సినిమా అంటే ప్రజల కష్టాలను, ఆ కష్టాలకు కారణమైన పరిస్థితులను, ఆ పరిస్థితులపై పోరాటాలను చెప్పే సినిమా అన్నది సత్యం. ఈ సినిమాలోనూ ఆయన ఓ సామాజిక అంశాన్ని తీసుకొని, అటవీ ప్రాంతం, అక్కడి ప్రజలు, వారి కష్టాలను శక్తిమేర చెప్పే ప్రయత్నం చేయడం అభినందించదగ్గ విషయం. అటవీ ప్రాంత సంపదను కొందరు నాయకులు, పారిశ్రామికవేత్తలు దోచుకుంటున్న విధానాన్ని, అక్కడి తెగల వారిపై వారి పెత్తనాన్ని నారాయణమూర్తి తనదైన పంథాలో అద్భుతంగా స్పృశించారు.

ఇక నారాయణ మూర్తి ఎప్పట్లానే తనదైన నటనతో కట్టిపడేశారనే చెప్పాలి. ఓ సామాజిక అంశంపై పోరాడే నాయకుడిగా నారాయణమూర్తి అన్నివిధాలా సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఆయన తప్ప ఇలాంటి సినిమాను మరొకరు పూర్తి స్థాయి కథానాయకుడిగా నడిపించలేరన్నది వాస్తవం. ఇక ఈ సినిమాకు స్వయంగా దర్శక, నిర్మాత కూడా ఆయనే కావడం, తాను నమ్మిన సిద్ధాంతాలనే సినిమాలుగా చెప్పాలనుకునే ఆయన తత్వాన్ని చూస్తే నారాయణ మూర్తి ప్రత్యేకత ఏ స్థాయిదో అర్థమైపోతుంది. ఇక అదేవిధంగా డైలాగ్స్ సినిమాకు ఓ ప్రధాన బలంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో ఏ తరహా ఇంటెన్సిటీ ఉన్న డైలాగ్స్ అవసరమో అందుకుతగ్గట్టుగానే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాలో ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఒక సామాజిక సమస్యను, కమర్షియల్ పంథాకు ఏమాత్రం సంబంధం లేని ఫార్మాట్‌లో తెరకెక్కించే ఇలాంటి సినిమాలో ఒక సాధారణ సినిమాలో చూసే మైనస్ పాయింట్స్ లాంటివి ఎక్కువ ప్రస్తావించలేం. అయితే సినిమా లెంగ్త్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. అదేవిధంగా సెకండాఫ్‌లో పాటలు కాస్త ఎక్కువైపోయి సినిమాను కాస్త నెమ్మదించేలా చేశాయి. తెలిసిన నటులు లేకపోవడం కూడా ఓ మైనస్‌గా చెప్పుకోవచ్చు.

సాంకేతిక విభాగం :

‘దండకారణ్యం’ సినిమాకు నారాయణ మూర్తి అన్నీ తానై చేసుకొచ్చారు. ఒక సామాజిక సమస్య, దానిపై పోరాటం లాంటి సినిమా నుంచి టెక్నికల్‌గా ఎలాంటి స్టాండర్డ్స్ కోరుకుంటామో దండకారణ్యం అందులో తగ్గలేదు. నారాయణ మూర్తి స్వయంగా అందించిన సంగీతం ఆయన అభిమానులను, ఈ తరహా సినిమాలను ఇష్టపడే వారిని విపరీతంగా అకట్టుకుంటాయి. నారాయణ మూర్తి స్క్రీన్‌ప్లే ఫస్టాఫ్ వరకూ చాలా బాగుంది. సెకండాఫ్ విషయంలో మరికాస్త శ్రద్ధ వహించాల్సింది.

ఇక దర్శకుడిగా నారాయణ మూర్తి తన పంథాను ఎక్కడా మార్చకుండా, తాను ఏం చెప్పాలనుకున్నారో దాన్నే బలంగా, పలు ఎమోషనల్ సన్నివేశాలతో చెప్పుకొచ్చి మెప్పించారు. దర్శకుడిగా నారాయణ మూర్తి ఆలోచనను, పరిమితమైన వనరులతో ఆయన ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందించదగ్గదే!

తీర్పు :

ఆర్. నారాయణ మూర్తి ఒక సినిమాతో వస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక సామాజిక సమస్యపై పోరాటంగానే ఆ సినిమా ఉంటుందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. తనకున్న పరిధిలోనే ఆ సమస్యను ఓ సినిమాగా చెప్పే నారాయణమూర్తి నిరంతర ప్రయత్నాన్ని ముందుగా అభినందించాలి. అటవీ ప్రాంత సంపద దోపిడీకి గురవుతుందంటూ, ఆదివాసీలు కష్టాల పాలవుతున్నారంటూ నారాయణ మూర్తి తెరకెక్కించిన తాజా విప్లవ సినిమాయే దండకారణ్యం. ఒక్క లెంగ్త్ ఎక్కువైందన్న అంశాన్ని పక్కనబెడితే నారాయణ మూర్తి మార్క్ విప్లవ సినిమాల్లో కోరే అంశాలన్నింటినీ నింపుకున్న ఈ సినిమా, ఇలాంటి తరహా సినిమాలను కోరేవారిని బాగా ఆకట్టుకుంటుంది. నారాయణ మూర్తి లాగా నమ్మిన సిద్ధాంతాలనే సినిమాలుగా తీసేవారు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తుల ప్రయత్నాలను ఆదరించాల్సిన బాధ్యతను ఓ అవసరంగా భావించైనా ఈ సినిమా తప్పక చూడాల్సినదిగా చెప్పుకోవచ్చు.

గమనిక : పూర్తిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి తీసిన విప్లవ సినిమాకు సాధారణ సినిమాలకు ఇచ్చినట్లుగా రేటింగ్ ఇవ్వడం భావ్యం కాదన్న ఆలోచనతో, ‘దండకారణ్యం’ సినిమాకు 123తెలుగు రేటింగ్ ఇవ్వట్లేదు.

123telugu.com Rating : N/A
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version