విడుదల తేదీ : జనవరి 09, 2020
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రజిని కాంత్,సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్ తదితరులు
దర్శకత్వం : ఏ ఆర్ మురుగదాస్
నిర్మాతలు : ఏ. శుభాస్కరన్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ముంబైలో పోలీసులకు సరైన గౌరవం లేక పోలీస్ వ్యవస్థ పూర్తిగా వీక్ అయిన పరిస్థితుల్లో.. అక్కడి యువత డ్రగ్స్ కి బానిసలుగా బతుకుతున్న స్థితిలో.. వెరీ సిన్సియర్ అండ్ పూర్తి ఆవేశపూరితమైన పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబైకి కమీషనర్ గా వస్తాడు. రావడంతోనే వేలమంది ఆడపిల్లలను సేవ్ చేస్తాడు. మరో పక్క తన కూతురు వల్లీ (నివేథా థామస్)తో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే లిల్లీ (నయనతార)తో పరిచయం అవుతుంది. ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం హరి చోప్రా(సునీల్ శెట్టి) ఆదిత్య అరుణాచలాన్ని టార్గెట్ చేస్తాడు. దాంతో ఆదిత్య అరుణాచలం జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి ప్రతీకారంగా హరి చోప్రా మీద ఆదిత్య అరుణాచలం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు హరి చోప్రా గతం ఏమిటి? ఆ గతానికి ముంబైకి సంబంధం ఏమిటి? చివరికి ఆదిత్య అరుణాచలం తానూ అనుకున్నది సాధించాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ తో పాటు కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్ స్టార్ అభిమానులకు.. మురగదాస్ మొత్తానికి రజిని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైలిష్ ఎనర్జిటిక్ నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.
ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో నటించిన నివేథా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నివేథా నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ గా నయనతారకు పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న ఆ కొన్ని సీన్స్ లో తన గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీతో మెప్పించింది.
ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. విలన్ గా సునీల్ శెట్టి పర్వాలేదు. మురగదాస్ ఎక్కడా యాక్షన్ ట్రీట్ తగ్గకుండా.. మరియు కథలోని ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మురగదాస్ గుడ్ యాక్షన్ అండ్ బలమైన ఎమోషన్ తో ఆకట్టుకునప్పటికీ.. అయన స్క్రీన్ ప్లే మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టలేదు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ స్లో అయింది. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. సినిమాలోని మెయిన్ విలన్ కు పెట్టిన ట్రాక్ కూడా ఎపెక్టివ్ గా అనిపించదు. పైగా సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, అలాగే చివరికీ సినిమా రొటీన్ రివెంజ్ డ్రామాగానే ముగింపు పలకడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి.
వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. సినిమా లాస్ట్ నలభై నిముషాలు ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మురగదాస్ భారీ విజువల్స్ తో భారీ యాక్షన్ తో చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలు మరియు కథ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాల బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న యాక్షన్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కెమరామెన్, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. మెయిన్ గా రజినిని చాల యంగ్ గా చూపించారు. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ తో ఇలాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించినందుకు సుభాష్ శరన్ ను అభినందించాలి.
తీర్పు :
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అద్భుతమైన యాక్షన్ తో మరియు బలమైన కొన్ని సెంటిమెంట్ సీన్స్ తో సాగుతూ రజినీకాంత్ ఫ్యాన్స్ కు మంచి యాక్షన్ ట్రీట్ ఇస్తోంది. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టకపోవడం, సెకెండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కానీ రజిని మార్క్ యాక్టింగ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.
మెయిన్ గా రజిని అభిమానులకు ఈ సినిమా డీసెంట్ ఫీస్ట్ లా అనిపిస్తోంది. అయితే ఈ సంక్రాంతి పోటీలో నిలబడి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team
Click Here For English Version