సమీక్ష : అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ – ఎవరినీ మెప్పించలేని సినిమా..

acam_review విడుదల తేదీ : 03 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : కోనేటి శ్రీను
నిర్మాత : లక్ష్మన్ క్యాదారి
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : వరుణ్ సందేశ్, హరిప్రియ..


బాక్స్ ఆఫీసు వద్ద తను చేసిన సినిమాలు వరుసగా దండయాత్రలు చేస్తూ ఫ్లాప్స్ అందుకుంటున్న ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాలని వరుణ్ సందేశ్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా వరుణ్ సందేశ్ అమాయకుడి పాత్రలో, ‘పిల్ల జమిందార్’ ఫేం హరిప్రియ వేశ్యగా, ఫుల్ మాస్ పాత్రలో చేసిన సినిమా ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’. కోనేటి శ్రీను డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి లక్ష్మణ్ క్యాదారి నిర్మాత. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమాతో మళ్ళీ వరుణ్ సందేశ్ ఈ సినిమాతో అన్నా హిట్ కొట్టాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

శ్రీ(వరుణ్ సందేశ్) తల్లి తండ్రులు లేకపోవడంతో భామ్మ(శ్రీ లక్ష్మి) దగ్గరే పెరుగుతాడు. శ్రీని భామ్మ చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి దూరంగా ఉండేలా పెంచడంతో అతను అమ్మాయిలంటే ఆమడదూరం పారిపోతుంటాడు. అలాంటి శ్రీకి అంజలి ప్రపోజ్ చేస్తుంది. అదే తరుణంలో శ్రీ కంపెనీ లాస్ లో ఉండడం వల్ల స్పాన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అంజలి ఫాదర్ మరియు అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి కెకె (ఆహుతి ప్రసాద్) శ్రీని పిలిచి నేను మీ కంపెనీకి స్పాన్సర్ చేస్తాను కానీ నా కూతురు అంజలిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాడు. శ్రీకి మరో దారిలేక ఒప్పుకుంటాడు.

అమ్మాయిలకు దూరంగా ఉండే శ్రీ పెళ్లిలోపు తనకు అమ్మాయిలంటే ఉన్న భయం పోవాలని కొద్ది రోజులు ఒకమ్మాయితే గడపాలనుకుంటాడు. అప్పుడే వేశ్య అయిన నీరు(హరిప్రియ)ని కాంట్రాక్ట్ మీద కొన్ని రోజులు తన ఇంటికి తెచ్చుకుంటాడు. అదే టైములో దాస్(కాశీ విశ్వనాధ్) నీరుని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. నీరు శ్రీ లైఫ్ లోకి వచ్చాక జరిగిన మార్పులేమిటి? నీరు శ్రీని ఎంతలా మార్చేసింది? దాస్ అసలు నీరుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అలాగే చివరికి శ్రీ అంజలిని పెళ్లి చేసుకున్నాడా? లేదా అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి మేజర్ హైలైట్ గా చెప్పుకోవాల్సింది హరిప్రియ. వేశ్య పాత్రలో తన నటన బాగుంది. మొదటి సినిమాలో క్లాస్ గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో నేనూ గ్లామర్ పాత్రలు చేయగలను అన్న రీతిలో అందాలను ఆరబోసింది. ముఖ్యంగా ‘మై హూనా’ పాటలో రెచ్చిపోయి మరి అందాలను ఆరబోసింది. మొదటి నుంచి వేశ్య పాత్రలో కనిపించి చివరిలో కాస్త ట్రెడిషనల్ లుక్ లో కూడా ఆడియన్స్ ని మెప్పించింది. వరుణ్ సందేశ్ నటన ఎప్పటిలానే ఉంది. పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. శ్రీనివాస్ రెడ్డి ఒకరి రెండు సార్లు నవ్వించడానికి తనవంతు ప్రయత్నం చేయగా, మొగలి రేఖులు సీరియల్ ఎపిసోడ్ అనగానే ఆడియన్స్ మరోసారి నవ్వుతారు చివర్లో వచ్చే పెళ్లి ఎపిసోడ్ పరవాలేదనిపిస్తుంది. ‘మనసులోన’ పాటని గోవా లోని అందమైన లోకేషన్స్ లో బాగా షూట్ చేసారు. అలాగే ‘లిరిల్ సోపుతో’ ఐటెం సాంగ్ లో కౌష తన అందాలతో ముందు బెంచ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కథని ‘ప్రెటీ ఉమెన్’ అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా చేసుకొని రాసుకున్నారు. అలాగే కాశీ విశ్వనాథ్ ఎపిసోడ్ ని ‘కహాని’ అనే హిందీ సినిమాలో నుంచి లేపి ఈ కథలో కలిపేసారు. అయినప్పటికీ కథని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. కథ పక్కన పెడితే స్క్రీన్ ప్లే మరీ ఊహాజనితంగా ఉంది. చాలా సీన్స్ చూసినప్పుడు ఈ సీన్ ఆ సినిమాలోలానే ఉంది కాదా, అరె ఈ సీన్ అందులో ఉంది కదా అనే ఫీలింగ్ మీకొస్తుంది. శ్రీనివాస్ రెడ్డి ఒకటి రెండు జోక్స్, మొగలి రేఖులు ఎపిసోడ్ తప్ప ప్రేక్షకుడు మరోసారి నవ్వుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఆడియన్స్ పిచ్చ బోర్ ఫీలవుతున్నారు. అమ్మాయిలూ అంటే హీరో భయపడతాడు అని చూపించడానికి డైరెక్టర్ ఎక్కువ సీన్స్ పెట్టడం వల్ల ఆడియన్స్ రిపీటెడ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని ఫీలవుతారు.

సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా గవర్నమెంట్ ఆఫెసుల్లో పని జరిగినట్టు చాలా నెమ్మదిగా సాగుతుంది. సినిమాలో చాలా లాజిక్ లేని సీన్స్ చాలా కనిపిస్తాయి. ప్రొడక్షన్ పరంగా హీరోతో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలియదు గానీ ఫస్ట్ హాఫ్ లో కొంత వరకు వరుణ్ సందేశ్ కి వేరే ఎవరితోనో డబ్బింగ్ చెప్పించడం, మళ్ళీ కొద్ది సీన్స్ కి వరుణ్ సందేశ్ డబ్బింగ్ చెప్పడం ఆదిఅయ్నస్ కి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్ని చోట్ల నటీనటుల డైలాగ్స్ కి లిప్ సింక్ అవ్వలేదు. అలీ, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ ని సినిమాలో పెట్టుకున్నప్పటికీ వారి నుండి ఎలాంటి కామెడీని రాబట్టుకోలేక డైరెక్టర్ విఫలమయ్యాడు. క్లైమాక్స్ ని అసంపూర్ణంగా ముగించేయడం వల్ల ఆడియన్స్ కాస్త అసంతృప్తికి లోవవుతారు.

సాంకేతిక విభాగం :

సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఇది వరకే చెప్పినట్టు ‘మనసులోన’ సాంగ్ ని చాలా బాగా షూట్ చేసాడు. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ లో మూడు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ చెప్పుకోదగిన విధంగా లేదు. సినిమాలో రిపీటెడ్ గా అనిపించే సీన్స్ ని లేపేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ కూడా బిలో యావరేజ్ గా ఉన్నాయి.

కథ పలు చోట్ల నుండి స్ఫూర్తి తీసుకొని రాసుకున్నా కానీ పెద్ద గొప్పగా లేదు, దానికి బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే తోడవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. ఒకరి ఇద్దరి దగ్గర నుంచి నటనని రాబట్టుకున్నా, మిగతా నటీనటులను వాడుకోవడంలో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ తోలి చిత్రం కావడంతో చాలా విషయాల్లో పెర్ఫెక్షన్ కనిపించదు. నిర్మాణ విలువలు బాగా రిచ్ గానే ఉన్నాయి కానీ సినిమాకి ఎందుకో ఎక్కువ పెట్టేసారు అనిపిస్తుంది. చాలా చోట్ల జాగ్రత్త తీసుకొని ఉంటే నిర్మాత చాలా సేవ్ అయ్యేవాడు.

తీర్పు :

‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ సినిమా అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకోలేని విధంగా ఉంది. వరుణ్ సందేశ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ప్రతి సినిమాలో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుండడం వాటిని కరెక్ట్ చేసుకోకపోవదానికి ప్రయత్నించకపోవడం బాధాకరమైన విషయం. ఈ సినిమా కథలో దమ్ము లేకపోవడం, వీక్ స్క్రీన్ ప్లే, లెస్ కామెడీ లాంటివి చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ అయితే హరిప్రియ అందాలు, ఒకటి రెండు పాటలు సినిమాకి కాస్త ప్లస్ అయ్యాయి. హరిప్రియ అందాలను బాగా ఆరబోసిన కారణంగా ఈ సినిమా సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఆకట్టుకోవచ్చు కానీ గ్యారటీ లేదు. నిర్మాత ఎంతవరకూ సేవ్ అవుతాడనేది ప్రేక్షకులే నిర్ణయించాలి.


123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version