సమీక్ష : Dr. సలీమ్ – వీక్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ హిట్.!

Dr Saleem

విడుదల తేదీ : 13 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఎన్.వి నిర్మల్ కుమార్  

నిర్మాత : సురేష్ కొండేటి – తమటం కుమార్ రెడ్డి

సంగీతం : విజయ్ ఆంటోని

నటీనటులు : విజయ్ అంటోని, అక్ష పార్ధసాని

సౌత్ ఇండియాలో బాగా ఇమేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అంటోని సినిమా ‘సలీమ్’. ఈ సినిమాని తెలుగులో ‘Dr. సలీమ్’ పేరుతో అనువదించారు. తెలుగువారికి మంచి అనువాద చిత్రాలను అందించే సురేష్ కొండేటి కుమార్ రెడ్డితో కలిసి ఈ సినిమాని తెలుగులో డబ్ చేసారు. విజయ్ అంటోని సరసన అక్ష పార్దసాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గత సంవత్సరం తమిళంలో రిలీజ్ అయ్యి మంచి థ్రిల్లర్ గా నిలిచింది. గతంలో ‘నకిలీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ అంటోని ఈ సినిమాతో ఎంతవరకూ ఆకట్టుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సలీమ్ ఓ అనాధ. కానీ ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. తనొక అనాధ కావడం వలన సమాజానికి తనకు వీలైనంత సహాయం, సేవ చేస్తూ ఉంటాడు. సలీమ్ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ మిషి ప్రాణం కంటే డబ్బే ప్రధానం, కానీ సలీమ్ మాత్రం ఫ్రీగా కొందరికి వైద్యం చేస్తూ ఉంటాడు. సలీమ్ ఇలా చేయడం ఆ హాస్పిటల్ డీన్ కి నచ్చదు. మరోవైపు సలీమ్ కి నిషా(అక్ష)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. నిశ్చితార్ధం కూడా అవుతుంది. కానీ సలీమ్ చేసే సమాజ సేవ వల్ల తనతో ఎక్కువగా సమయం గడపడం లేదని, తనని పట్టించుకోవడం లేదని నిషా పెళ్లిని క్యాన్సల్ చేస్తుంది.

ఆ టైంలోనే సలీమ్ గ్రూప్ రేప్ చేయబడిన నర్మదని చావుబతుకుల్లో ఉండగా కాపాడతాడు. నర్మదకి ఆ గతి పట్టిన వారికి శిక్ష పడాలని నర్మదా తల్లి సలీమ్ ని కోరుతుంది. ఆ మరుసరోజే విజయ హాస్పిటల్స్ డీన్ సలీమ్ ని జాబ్ నుంచి తీసేస్తాడు. అటు చూస్తే నర్మద, తన తల్లి మిస్ అవుతారు. ప్రేమించిన అమ్మాయి నో అనడం, ఉద్యోగం పోవడం, కాపాడిన అమ్మాయి కనపడకుండా పోవడం ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా రావడంతో సలీమ్ సంకటంలో పడతాడు. అక్కడి నుంచి కట్ చేస్తే రాష్ట్ర హోం మంత్రి అయిన ధర్మమూర్తికొరుకు గురు అండ్ బ్యాచ్ ని కిడ్నాప్ చేసి ఒక్కొక్కరిని చంపేస్తాడు. అసలు సడన్ గా హోం మినిస్టర్ కొడుకు బ్యాచ్ మీద సలీం ఎందుకు అటాక్ చేసాడు.? కనపడకుండా పోయిన నర్మద, తన తల్లి ఏమయ్యారు.? అసలు నర్మదని అంత దారుణంగా రేప్ చేసింది ఎవరు.? తనను వదిలి వెళ్ళిపోయిన నిషా తిరిగి సలీమ్ ని చేరుకుందా లేదా అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘Dr. సలీమ్’ అనే థ్రిల్లర్ సినిమాకి సెకండాఫ్ మేజర్ హైలైట్ అయ్యింది. డైరెక్టర్ నిర్మల్ కుమార్ సెకండాఫ్ మొత్తాని చాలా గ్రిప్పింగ్ గా తీసాడు. తను థ్రిల్లింగ్ కోసం ప్లాన్ చేసుకున్న ఎలిమెంట్స్, అలాగే కాస్త డిఫరెంట్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. అన్నిటికంటే మించి కథలో ఉన్న పెయిన్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవడం వలన సెకండాఫ్ లో హీరో తీసుకునే స్టెప్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. హోటల్లో జరిగే కొన్ని డిష్కషన్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఉలి ఉలే ఉలే ఉలేలే అనే సాంగ్ క్లైమాక్స్ లో మంచి ఊపు తెస్తుంది.

రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న సలీమ్ పాత్రలో విజయ్ అంటోని మంచి నటనని కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాఫ్ట్ అండ్ కామ్ గా కనిపించిన విజయ్ అంటోని సెకండాఫ్ లో అగ్ని పర్వతం బద్దలైన లావాలా సీరియస్ గా కనిపించి డైరెక్టర్ అనుకున్న కథకి పూర్తి న్యాయం చేసాడు. ఇక అక్ష పాటల్లో గ్లామరస్ గా కనిపించింది. అది పక్కన పెడితే, అక్ష ఇందులో రెగ్యులర్ గలం డాల్ రోల్ కాకుండా బాగా పొగరున్న అమ్మాయి పాత్రలో మంచి నటనని కనబరిచింది. ఎలా అంటే ఇలాంటి పొగరుబోతు గర్ల్ ఫ్రెండ్ నాకొద్దురా బాబు అనుకునేలా.. మిగతా నటీనటులందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని తమిళ నటులు. తన కొడుకుని కిడ్నాప్ చేస్తే తండ్రి పడే ఆవేదనని హోం మినిస్టర్ పాత్ర చేసిన మనోహర్ బాగా చేసాడు. అలాగే నెగటివ్ షేడ్స్ ని కూడా బాగా చూపించాడు. పోలీస్ ఆఫీసర్ గా ఆరుళ్ దాస్ మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. విజయ్ అంటోని మ్యూజిక్ మరియు గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్.. డైరెక్టర్ నిర్మల్ కుమార్ సమాజంలో నిజాయితీగా ఉండాలి అనుకున్న ఓ కుర్రాడు ఈ సమాజంలో చేసే చెడుపై రియాక్ట్ అయితే ఎలా ఉంటుందనేది ఇందులో చూపాలనుకున్నాడు. దాని కోసం తన పాత్ర, ఆ పాత్ర బిహేవియర్ ఏంటనేది మొదటి 20 లేదా 30 నిమిషాల్లో చూపిస్తే సరిపోద్ది, అలా కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం పదే పదే అతని పాత్ర ఇదే అని చెప్పడానికి ఒకే రకమైన సీన్స్ ఎక్కువ రాసేసుకోవడం వలన ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అలాగే విజయ్ అంటోని – అక్ష రొమాంటిక్ ట్రాక్ కూడా ఆడియన్స్ కు నచ్చేలా లేదు. దీన్ని రొమాంటిక్ ట్రాక్ అనడం కంటే టాం & జెర్రీ గొడవలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అరుపులు, గొడవలతోనే వీళ్ళ రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అస్సలు ఉండదు. ఈ మధ్య కాలంలో వచ్చిన పటాస్, టెంపర్, అలాగే ఈ రోజు రిలీజ్ అయిన జగన్నాటకం సినిమాలో కూడా ఇదే స్టొరీ లైన్ ని డీల్ చేయడం వలన కొంతమందికి బోర్ కొట్టచ్చు. హీరో చేసే కిడ్నాపింగ్ ప్రాసెస్ చాలా చిన్నది, ఈ కిడ్నాప్ ని బ్రేక్ చెయ్యడానికి నేషనల్ కమాండోస్ ని కూడా రంగంలోకి దించుతారు. కానీ ఏమీ చేయకుండా వాళ్ళని కేవలం బొమ్మల్లా వాడుకోవడం తప్ప ఉపయోగం లేకుండా పోయింది. ఈ పార్ట్ లో డైరెక్టర్ ఇంకాస్త ఇంటెలిజెంట్ గా కథని రాసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే ని మరీ ఎక్కువగా సాగదీసి ఉన్నందు వల్ల రన్ టైం కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ గురించి.. గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ మొత్తం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. విజయ్ అంటోని అందించిన ట్యూన్స్ కి సాహితి రాసిన తెలుగు లిరిక్స్ కూడా బాగా సెట్ అవ్వడంతో వినడానికి బాగానే ఉన్నాయి. పాటల కంటే మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సస్పెన్స్ ఎలిమెంట్స్ లో మ్యూజిక్ హైలైట్ అయ్యింది. తమిళ్ తో పోల్చుకుంటే తెలుగులో లెంగ్త్ ని కాస్త కట్ చేసారు. అయినా కానీ ఫస్ట్ హాఫ్ చాలా లెంగ్తీగా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం చేసింది ఎన్.వి నిర్మల్ కుమార్. ఒక డైరెక్టర్ గా నిర్మల్ కుమార్ సక్సెస్ అయ్యాడు. అలాగే సమాజంలో ఉన్న ఒక పెయిన్ ఫుల్ పాయింట్ ని కథగా చెప్పడంలోనూ సక్సెస్ అయ్యాడు. కానీ మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సురేష్ కొండేటి – కుమార్ రెడ్డి డబ్బింగ్ విలువలు క్వాలిటీగా ఉన్నాయి.

తీర్పు :

ఓ గుడ్ మెసేజ్ తో థ్రిల్లర్ మూవీగా ఈ వారం వచ్చిన మరో సినిమా ‘Dr. సలీమ్’. ఓ సోషల్ మెసేజ్ తో పాటు సెకండాఫ్ ని మంచి సస్పెన్స్ తో నడిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఆడియన్స్ సినిమాలోని సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. అందుకే ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో అండ్ బోరింగ్ గా ఉన్నా సెకండాఫ్ సినిమాని చాలా వరకూ సేవ్ చేసేసింది. ఇలా సెకండాఫ్ లో చూపిన థ్రిల్స్ లో సగం అన్నా ఫస్ట్ హాఫ్ లో చూపించి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఓవరాల్ గా మీరు ఓపికతో ఫస్ట్ హాఫ్ ని చూడగలిగితే సెకండాఫ్ లో ‘Dr. సలీమ్’ చూపించే థ్రిల్స్ మీకు నచ్చుతాయి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR TELUGU REVIEW

Exit mobile version