సమీక్ష : ద్వారక – విజయ్ లోని భిన్న కోణాలను ఆవిష్కరించిన చిత్రం

Dwaraka movie review

విడుదల తేదీ : మార్చి 03, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం :శ్రీనివాస్ రవీంద్ర

నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపతి, గణేష్ పెనుబోతు

సంగీతం :సాయి కార్తీక్

నటీనటులు :విజయ్ దేవరకొండ, పూజ జావేరి

ఈ వారం రిలీజవుతున్న మూడు చిత్రాల్లో ‘ద్వారక’ కూడా ఒకటి. ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కావడం వలన మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో పరిశీలిద్దాం…

కథ :

శ్రీనివాస్ (విజయ్ దేవరకొండ) అనే చిన్న దొంగ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక దొంగతనం చేయబోయి అది విఫలమవడంతో రక్షణ కోసం ‘ద్వారక’ అనే అపార్ట్మెంట్లోకి వెళ్లి దాక్కుంటాడు. అలా అక్కడికి చేరిన విజయ్ ను అక్కడివారు స్వామి కృష్ణానంద అని నమ్మడం మొదలుపెడతారు. అలా దొంగ నుండి స్వామిగా మారిన శ్రీనివాస్ ను కొన్ని సంఘటనల వలన అక్కడి వారు పూర్తిగా నమ్మి సేవిస్తుంటారు.

స్వామిగా మారిన శ్రీనివాస్ పేరు మీద అతని స్నేహితులు ఒక ట్రస్ట్ పెట్టి డొనేషన్స్ వసూలు చేస్తుంటారు. శ్రీనివాస్ కూడా అక్కడే ఉండే ఒక అమ్మాయి వసుధ (పూజ జావేరి) ని ప్రేమించే పనిలో ఉంటాడు. ఇంతలోనే హేతువాది అయిన రామకృష్ణ ( మురళీ శర్మ) శ్రీనివాస్ ను చూసి అతను దొంగబాబా అని ప్రూవ్ చేయాలని అనుకుంటాడు. ఇంతలో ఈ కథలోకి ముఖ్యమంత్రి ఎంటరవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ తన భక్తుల్ని ఎలా హ్యాండిల్ చేశాడు ? స్వామిజీ ముసుగు నుండి ఎలా బయటికొచ్చాడు ? అనేదే ఈ సినిమా కథ..

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘ద్వారక’ చిత్రం పూర్తిగా విజయ్ దేవరకొండ పాపులారిటీ మీదే నడిచింది. అతను కూడా అంచనాలకు తగ్గట్టు నటించాడు. ఒక దొంగగా, దొంగ బాబాగా, ప్రేమికుడిగా, సమాజ శ్రేయస్సు కోరుకునే మంచి వాడిగా మంచి నటన కనబరిచాడు. కామెడీ సన్నివేశాల్లో ఇతర నటీనటుల సపోర్ట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ పండించాడు.

కమెడియన్ పృథ్వి కూడా తన ఫుల్ లెంగ్త్ రోల్ లో బాగా మెప్పించాడు. డైలాగులు, కామెడీ టైమింగ్ తో ఒక సున్నితమైన పూజారి పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రభాకర్, మురళి శర్మ, రఘుబాబు, ప్రకాష్ రాజ్ లు తమ పాత్రల మేర బాగానే నటించారు. హీరోయిన్ పూజ జావేరి కూడా తన పాత్రకు తగిన విధంగా నటించి మెప్పించింది. ఇందులో కామెడీ కూడా బాగుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా చాలా క్లీన్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది సినిమా రన్ టైమ్ గురించి. రెండున్నర గంటల రన్ టైమ్ ఎక్కువనే అనిపించింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని ఎడిటింగ్ లో కట్ చేసి ఉండాల్సింది. అలాగే క్రిమినల్ రికార్డ్ ఉన్న ఒక దొంగ బాబా అంత సులభంగా ప్రజల దగ్గర్నుండి కోట్ల రూపాయల్ని ఎలా కలెక్ట్ చేస్తాడు, అది కూడా మరొకరి కంట్రోల్ ఉండి చేయడం ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ అంశాలు సాధారణ ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలోని కథనంలో ఇంకాస్త వేగం పెంచి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండటం అవి కూడా కథనంతో కలిసి సాగిపోవడం ఆకట్టుకుంది. సినిమాను ఎక్కువ కాలం షూట్ చేయడం వలన విజయ్ దేవరకొండ లుక్స్ లో కాస్త తేడా కనిపించింది. చాలా సన్నివేశాల్లో సినిమా లో బడ్జెట్లో రూపొందినదని తెలుస్తోంది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాలోని కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని తొలగించి ఉండాల్సింది.

తీర్పు :

ఈ ‘ద్వారక’ చిత్రం ఒకసారి చూడదగ్గ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది. భిన్న కోణాల్లో విజయ్ దేవరకొండ నటన చాలా బాగా మెప్పించింది. దొంగబాబాకు, అతని వ్యతిరేకులకు మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఎక్కువైన రన్ టైమ్ ను పట్టించుకోకపోతే చూడదగ్గ, ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా తయారు చేశాయి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version