సమీక్ష : ఎలుకా మజాకా – ‘మజా’ మిస్ అయ్యింది

Veeri Veeri Gummadi Pandu Review

విడుదల తేదీ : 26 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : రేలంగి నరసింహారావు

నిర్మాత : మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు

సంగీతం : బల్లేపల్లి మోహన్

నటీనటులు : వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పావని..

ఒకప్పుడు కామెడీ సినిమాలు తీసి సంచలన విజయాలు తన ఖాతాలో వేసుకున్న సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు చాలా రోజుల తరువాత ‘ఎలుకా మజాకా’ అంటూ మరో కామెడీ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇది ఆయనకు 75వ సినిమా. కామెడీలో తమదైన టైమింగ్ సెట్ చేసుకున్న బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎంతమేరకు నవ్వించింది? చూద్దాం..

కథ :

వెన్నెల కిషోర్ హైద్రాబాద్‌లో జరిగే పలు వేడుకలకు పూలు సరఫరా చేసే వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అలాంటి వెన్నెల కిషోర్, చెప్పిన టైమ్‌కి రాకపోయినా, చెప్పిన పని చేయకపోయినా విచిత్రమైన కండిషన్లతో ఇబ్బంది పెట్టే రఘుబాబు కూతురిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే రఘుబాబు కండిషన్‌కు కట్టుబడి ఉండేందుకు వెన్నెల కిషోర్, వినాయకుడిని కూడా లెక్కచేయకూడని పరిస్థితి వస్తుంది. దీంతో వినాయకుడి వాహనమైన ఎలుక అతడిని ఎలాగైనా శిక్షించాలని ఓ ఎలుక (బ్రహ్మానందం)ను అతడుండే ప్రదేశానికి పంపిస్తుంది.

కండిషన్స్ పెట్టే మామతోనే తట్టుకోవడం కష్టమనే పరిస్థితుల్లో వెన్నెల కిషోర్, ఈ ఎలుక పెట్టే ఇబ్బందులను కూడా ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పరిస్థితులన్నీ అతడి కాపురంలో ఎలాంటి మార్పులు తెచ్చాయి? చివరకు వీటన్నింటినీ వెన్నెల కిషోర్ ఎలా ఎదుర్కొని బయటపడ్డాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు కథ ఒక్కటే ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక ఎలుక, ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం అనే నేపథ్యం నుంచి కామెడీ పండించాలనుకోవడం మంచి ఆలోచనే! బేసిక్ కథగా చూస్తే ఇందులో మంచి కామెడీ ఎలిమెంట్ ఉందనే చెప్పొచ్చు.

వెన్నెల కిషోర్, బ్రహ్మనందం ఇద్దరి పైనే సినిమా అంతా నడుస్తూంటుంది. ఎక్కువగా వీరిద్దరి చుట్టూనే తిరిగే కథ కావడం, ఇద్దరూ బాగా నటించడం సినిమాకు మంచి ప్లస్‌గా చెప్పుకోవచ్చు. అందరికీ కండిషన్స్ పెట్టే పాత్రలో రఘబాబు “కుండ బద్దలు కొట్టి చెపుతున్నా” అని చెప్పే మేనరిజం ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ కొత్తగా అనిపించినా దానిచుట్టూ రాసుకున్న సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోవు. ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఆకట్టుకోని సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక సీన్ తరువాత ఇంకో సీన్ వస్తూనే ఉంటాయి కానీ అవి అంతగా ఆకట్టుకోవు. ఎలుక ఇబ్బంది పెట్టే ఏ పనులు కూడా హాస్యాన్ని కలిగించలేదు. ఎలుకగా నటించిన బ్రహ్మానందం నటన మొదట్లో బాగుందనిపించినా తరువాత విసుగెత్తిస్తుంది. ఉన్నట్లుండి పనిమనిషితో ఒక ఐటం సాంగ్ పెట్టడం చూస్తే ఏమనుకోవాలో అర్థం కాదు.

కథను ఇంట్లో, షాపులో, గార్డెన్‌లో ఇలా అతి తక్కువ లొకేషన్స్‌లో చిత్రీకరించడం వల్ల సినిమాలో మొనాటనీ ఎక్కువైందనిపిస్తుంది. ప్రతి సీన్ లో కామెడీ కోసం ప్రయత్నించినా ఎక్కడా అది పండకపోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్. నలభై నిముషాల పాటు గ్రాఫిక్స్ ఉన్నాయి అని చెప్పుకున్నా అవి ఎంత మాత్రం ఆకట్టుకునేలా లేవు. 2 గంటల 11 నిముషాల రన్ టైం కూడా ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు రేలంగి నరసింహారావు గురించి చెప్పుకుంటే, ఇలాంటి కథను సినిమాగా చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను అభినందించాల్సిందే. కానీ ఆ ఆలోచనను ఒక పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో మాత్రం ఏమాత్రం మెప్పించలేకపోయాడు. సన్నివేశాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. దర్శకుడి ప్రతిభ చూపించే సన్నివేశాలు ఎక్కడా కానరావు.

ఇక ఉన్నంతలో సినిమాటోగ్రఫీ ఫరవాలేదనిపిస్తుంది. సంగీత దర్శకుడి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. టైటిల్ సాంగ్ ఫరవాలేదనిపించినా మిగతా పాటలేవీ బాగాలేవు. ఎడిటింగ్ కూడా బాగా లేదు. గ్రాఫిక్స్ 40 నిముషాలు పాటు ఉన్నా ఏదీ అబ్బురంగా అనిపించదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంతమాత్రమే!

తీర్పు :

ఎలుక నేపథ్యంతో కామెడీ అన్న ప్రచారంతో ముందుకొచ్చిన సినిమా ‘ఎలుకా మజాకా’, అసలు చెప్పిన ప్రధానాంశమే లేని ఓ అర్థం పర్థం లేని కామెడీగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు లేకపోవడం, కామెడీతో మనల్ని ఎంతగానో నవ్వించిన యాక్టర్స్ ఉన్నా కూడా ఆ పాత్రల్లోనూ బలం లేకపోవడం, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అన్నదానికి చాలా దూరంలో నిలవడం లాంటి ఎన్నో మైనస్‌లతో ముందుకు వచ్చిన ఈ సినిమాలో బేసిక్ కథ బాగుందన్న విషయం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏం చెప్పాలని వచ్చిందో, అదే చెప్పకుండా, ఎటూ కాకుండా నిలిచిన సినిమాయే ‘ఎలుకా మజాకా’!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version