సమీక్ష : “ఎఫ్ 3” – నవ్వులు పూయించిన సమ్మర్ సోగ్గాళ్లు

సమీక్ష : “ఎఫ్ 3” – నవ్వులు పూయించిన సమ్మర్ సోగ్గాళ్లు

Published on May 28, 2022 3:02 AM IST
F3 Movie Review

విడుదల తేదీ : మే 27, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, మురళీశర్మ, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం : అనిల్‌ రావిపూడి

నిర్మాత: దిల్ రాజు, శిరీష్

సంగీత దర్శకుడు: దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటర్: తమ్మిరాజు

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సమ్మర్ ఫుల్ గా నవ్వించడానికి ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ సమ్మర్ సోగ్గాళ్లు, ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించగలిగారో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) ఇద్దరు ఎప్పుడూ డబ్బు సంపాదన కోసం తెగ కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు. మరో పక్క హారిక (తమన్నా) ఫ్యామిలీ వీరిని డబ్బు విషయంలో మోసం చేస్తుంటుంది. ఈ క్రమంలో విజయనగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త (మురళీ శర్మ) తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే పూర్తి సమస్యల్లో చిక్కుకున్న వెంకీ, వరుణ్ అలాగే తమన్నా ఫ్యామిలీ కొడుకు అంటూ ఆ ఇంటికి వెళ్తారు. ఎవరికీ వారు కొడుకుగా నమ్మించి కోట్లాది ఆస్తికి వారసులు కావాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు ఏమిటి ? ఆ తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొత్తానికి ఈ సమ్మర్ కి ఫుల్ గా నవ్వించడానికి వచ్చిన సమ్మర్ సోగ్గాళ్లు బాగానే నవ్వించారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కామెడీ కోరుకుంటారో ఈ సినిమాలో ఆ టైపు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, ఫ్యామిలీ సీన్స్ లో, అలాగే మనీ ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తన కామెడీ యాంగిల్ తో, తన మాడ్యులేషన్ తో వెంకీ చాలా బాగా అలరించారు.

వరుణ్ తేజ్ కూడా ఈ కామెడీ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ ముందు కూడా వరుణ్ బాగానే నవ్వించాడు. ఇక అప్పులు తీసుకుని ఎగ్గొట్టే ఫ్యామిలీ గా నటించిన తమన్నా, మెహరీన్ లు కూడా మెప్పించారు. తమ నటనతో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. సోనాల్ చౌహాన్ ఎప్పటిలాగే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. పూజా హెగ్డే సాంగ్ బాగుంది. మరో కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్వించాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కు ఆయనకు మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు బాగున్నాయి.

మురళీశర్మ, అలీ, సత్య, సంపత్ రాజ్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేయగా.. వారి నుండి కూడా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని రాబట్టుకున్నాడు. వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ తో ఆకట్టుకున్నాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కథనంలో ఎక్కడా లాజిక్ లేకుండా సిల్లీ డ్రామాగానే సినిమాని ముగించారు. అయితే, కొన్ని సిల్లీ సన్నివేశాలను ఎంటర్ టైన్ గా మలిచినా.. కథా పరంగా ఆ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలచొచ్చు.

ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ పెర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. మురళీశర్మ ట్రాక్ లో ఇంకా కొంత డెప్త్ ఉండాల్సింది. మురళీశర్మ కొడుకు ట్రాక్ కూడా బాగాలేదు. ఫస్టాఫ్ లో బాగా నవ్వించినా.. సినిమాలో ఫస్టాఫ్ ముగిసే వరకు కథ పై ప్రేక్షకునికి ఒక క్లారిటీ అంటూ రాకపోవడం, సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ గా అనిపించడం, కథకే ప్లాట్ పాయింట్ లాంటి మురళీశర్మ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన కథ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే..బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3లో కూడా తన కామెడీతో ఆకట్టుకున్నారు. కథ మరియు కథనం విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే వెంకీ తన కామెడీ టైమింగ్ తో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే వరుణ్ తేజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆనిల్ రావిపూడి కూడా తన శైలి కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు. మొత్తమ్మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామెడీని ఇష్టపడే వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు