సమీక్ష : గంగ – మాస్ ని మెప్పించే మరో ‘ముని’

Ganga

విడుదల తేదీ : 1 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రాఘవ లారెన్స్

నిర్మాత : బెల్లంకొండ సురేష్

సంగీతం : ఎస్ఎస్ తమన్

నటీనటులు : రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్..

గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ‘ముని’, ‘కాంచన’లకు ప్రాంచైజీగా వచ్చిన సినిమా ‘గంగ’. రాఘవ లారెన్స్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చేసిన ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తాప్సీ హీరోయిన్ గా నటించగా నిత్యా మీనన్ కీ రోల్ చేసింది. కాంచన ఎఫెక్ట్ వలన భారీ గానే అంచనాలు ఉన్న ఈ గంగ సినిమా ఎలా ఉంది.? ఈ సీక్వెల్స్ తో రాఘవ లారెన్స్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

‘గంగ’ సినిమా కథ – కథనం ‘ముని’, ‘కాంచన’లను మక్కికి మక్కి దించితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.. ఇక గంగ కథలోకి వెళితే .. గత రెండు సినిమాల లానే రాఘవ(రాఘవ లారెన్స్)కి దెయ్యాలంటే భయం. రాఘవ గ్రీన్ టీవీలో కెమెరామెన్ గా పనిచేస్తుంటాడు. అదే చానల్ లో నందిని(తాప్సీ) ప్రోగ్రాం డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ గ్రీన్ టీవీ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి వచ్చిందని, మళ్ళీ దాని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దెయ్యాల మీద ఓ క్రేజీ ప్రోగ్రాం తీద్దాం అని భీమిలి బీచ్ లోని ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. ఆ పాడుబడ్డ బంగ్లాకి ఆనుకొని ఉన్న బీచ్ లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్ లో చిత్ర విచిత్రమైన భయానక సంఘటనలు జరుగుతుంటాయి.

అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం అని ఓ స్వామీజీ దగ్గరికి వెళితే ఆ తాళి బొట్టు ఒక ఆత్మది అని చెబుతాడు. దాన్ని ఎలా అన్నా వదిలించుకోవాలని చూస్తున్న టైంలో గంగ ఆత్మ నందినిలో ప్రవేశిస్తుంది. నందిని శరీరంలో ఉన్న గంగ ఆత్మ వలన రాఘవ శరీరంలోకి శివ ఆత్మ ప్రవేశిస్తుంది. అసలు ఈ గంగ, శివలు ఎవరు.? వారు ఆత్మలుగా నందిని, రాఘవల లైఫ్ లోకి ఎందుకు వచ్చారు.? అసలు గంగ – శివల కథ ఏమిటి.? గంగ – శివలు ఎవరి మీద పగ తీర్చుకున్నారు.? అన్నది మీరు వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ మధ్య కాలంలో వస్తున్న సక్సెస్ ఫార్మాట్ హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన మరో సినిమా ‘గంగ’. ఈ జోనర్లో రావడమే ఈ సినిమాకి కాస్త ప్లస్ పాయింట్. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్.. సినిమా మొదటి నుంచి ఇంటర్వల్ వరకూ కామెడీ – భయం – మళ్ళీ కామెడీ – మళ్ళీ భయం అనే ఫార్మాట్ లోనే సీన్స్ రాసుకొని ఆడియన్స్ కి అటు ఎంటర్టైన్మెంట్ ని, ఇటు భయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే ఫస్ట్ హాఫ్ ని ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఇంటర్వల్ బ్లాక్ లో థ్రిల్ ఫీలవుతారు. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం బాగున్నాయి. నిత్యా మీనన్ – లారెన్స్ మీద షూట్ చేసిన సాంగ్ బాగుంది.

ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ప్రతి సినిమాలోనూ రాఘవ లారెన్స్ హైలైట్ అవుతుంటాడు, కానీ ఈ సినిమాలో తాప్సీ హైలైట్ అవ్వడం విశేషం.. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ కథ అంతా తన చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో దెయ్యాలను చూసి తను భయపడుతూ ప్రేక్షకులను భయపెట్టిన తాప్సీ, సెకండాఫ్ లో తనే దెయ్యంగా మారి భయ పెట్టింది. ఒక సాంగ్, కొన్ని సీన్స్ లో గ్లామరస్ గా కూడా కనిపించింది. చాలా వరకూ తను సినిమాని సేవ్ చేసింది. రాఘవ లారెన్స్ పాత్ర గత సినిమాల్లానే దెయ్యాలంటే భయం అంటూ ఇందులోనూ ప్రేక్షకులని నవ్విస్తాడు. రాఘవ మరియు శివ అనే రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని బాగానే చూపించాడు. ఇక ఫిజికల్లీ హ్యాండీ కాప్ పాత్రలో నిత్య మీనన్ బాగానే చేసింది. కానీ తన పాత్ర ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది. కోవై సరళ, శ్రీ మాన్, రేణుకలు కొన్ని సీన్స్ లో బాగా నవ్వించారు. ఇక పూజ రామ చంద్రన్, జయ ప్రకాష్, మనోబాల, సుహాసినిలు తమ పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

గంగ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ చాలా చాలా రెగ్యులర్ గా అనిపించే కథ.. మొదటి రెండు సినిమాలకి కాస్త స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని తీసుకొని, అందరినీ ఆకట్టుకునేలా కథని రాసుకున్న రాఘవ లారెన్స్ ఈ సినిమా విషయంలో కథకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రతి ప్రాంచైజీకి హెల్ప్ అవుతున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇందులో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం వలన ఆడియన్స్ కి పెద్దగా నచ్చదు. ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ముని సినిమాలో ఫాలో అయిన సీన్ టు సీన్ ఫార్మాట్ నే కాంచనలో వాడాడు, అదే ఫార్మాట్ ని ఇందులో కూడా వాడాడు కానీ అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి ఎక్కడికో తీసుకెళ్తే, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అప్పటి వరకూ ఉన్న ఫీల్ ని కూడా కిందకి తీసుకోచ్చేసింది.

కథ – కథనం బాగా దెబ్బ తిన్నప్పుడు సూటిగా సుత్తిలేకుండా అన్నా కథని ముగించేయాలి. కానీ అలా చెప్పకుండా కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ కి సినిమా సాగుతోంది తప్ప కథ ముందుకు పోవడం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. నిత్యా మీనన్ ట్రాక్ చాలా రొటీన్ గా ఉంది. ఇంతా పక్కన పెట్టిన ప్రతి సినిమాకి క్లైమాక్స్ చాలా కీలకం, ఇలాంటి హర్రర్ సినిమాలకి ప్రాణం మొత్తం క్లైమాక్స్ లోనే ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ ని నాశిరకమైన గ్రాఫిక్స్ తో, ఒక క్లారిటీ లేకుండా దబిడి దిబిడే అన్నట్టు ముగించేయడం ఆడియన్స్ ని నిరాశ పరుస్తుంది. ఆత్మ – ప్రేతాత్మ అని చెప్పిన పాయింట్ ని ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పలేదు. అలాగే ఇలాంటి సినిమాలకి పెద్ద ప్లస్ కావాల్సిన నేపధ్య సంగీతం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. ఎందుకంటే ఆడియన్స్ వినడానికి ఇబ్బంది పడేంత లౌడ్ గా ఉంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఇది బాగుంది అనిపించేలా కొన్ని డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసిన వారున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్స్ గురించి.. కిషోర్ – రాజవేల్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో చేసిన గ్రాఫిక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. చాలా సీన్స్ లో పరవాలేదనిపించినా క్లైమాక్స్ లో మాత్రం అస్సలు బాలేవు. ఇకపోతే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ లౌడ్ గా ఉంది. సినిమాలోకి ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చెయ్యాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండాఫ్ లో తన మ్యూజిక్ ఆడియన్స్ ని సినిమాకి కనెక్ట్ కాకుండా చేసింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా చాలా వేగంగా, ఎంటర్టైనింగ్ గా ఉన్నా సెకండాఫ్ మాత్రం చాలా లెంగ్త్ అయిపొయింది. చాలా సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.

ఇకపోతే కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం డీల్ చేసిన రాఘవ లారెన్స్ గురించి చెప్పాలి.. కథ విషయంలో లారెన్స్ రాంగ్ స్టెప్ వేయడమే కాకుండా, స్ట్రాంగ్ గా రాసుకోలేకపోయాడు. ఇకపోతే కథనం కూడా ఆసక్తికరంగా లేదు ముఖ్యంగా సెకండాఫ్ లో చాలా ఊహాజనితంగా తయారైంది. ఒక డైరెక్టర్ గా మాస్ ఆడియన్స్ కి ఇవ్వాల్సింది ఇవ్వగలిగాడు, కానీ వారిని ఆధ్యంతం ఆసక్తికి లోనయ్యేలా చేయలకేపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

సూపర్ హిట్ ప్రాంచైజ్ అయిన ‘ముని’, ‘కాంచన’ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ‘గంగ’ సినిమా ప్యూర్ మాస్ ఎంటర్టైనర్. గంగ సినిమా ముని, కాంచనల ఫార్మాట్ కి మక్కికి మక్కి కాపీలా ఉంటుంది. అలాగే ఆ సినిమాలతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ బి, సి సెంటర్ మాస్ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్, లౌడ్ నెస్ ఈ సినిమాలో ఉన్నాయి. అవే ఈ సినిమాని బాక్స్ ఆఫీసు వద్ద సేవ్ చేస్తాయి. బాగా ఎంజాయ్ చేసే ఫస్ట్ హాఫ్, తాప్సీ పెర్ఫార్మన్స్ మేజర్ ప్లస్ అయితే రొటీన్ స్టోరీ, బోరింగ్ సెకండాఫ్, వీక్ క్లైమాక్స్ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. లౌడ్ నెస్ ని బాగా తట్టుకోగలిగిన మాస్ ఆడియన్స్ ని మాత్రమే ఎంటర్టైన్ చేసే సినిమా ‘గంగ’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version