పాటల సమీక్ష : గౌతమీపుత్ర శాతకర్ణి : శాతకర్ణి జీవితానికి రూపమిచ్చాయి !

Gautamiputra-Satakarni
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ చెప్పిన కథ ఎంతో బాగా నచ్చడంతో బాలయ్య ఈ సినిమాని చాలా మక్కువతో చేశారు. ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుక నిన్న సాయంత్రం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి ‘కంచె’ ఫేమ్ చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. అతిరథ మహారథుల నడుమ నిన్ననే విడుదలైన ఈ ఆడియో పాటలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

1. పాట : ఏకిమీడా


గాయనీ గాయకులు : భువనేశ్వరిపుత్ర ఉదిత్ నారాయణన్, శర్మిష్టపుత్రిక శ్రేయ ఘోశాల్

సాహిత్యం : సుబ్బలక్ష్మిపుత్ర సీతారామశాస్త్రి

‘ఏకిమీడా నా జత వీడనని వరమిడవా..’ అంటూ సాగే ఈ పాట కథలో భార్య భర్తలైన బాలకృష్ణ, శ్రియ శరన్ ల మధ్య సాగే రొమాంటిక్ పాట. ఆలు మగల అనుబంధానికి, ఒకరి నుండి ఒకరు ఏం కోరుకుంటున్నారు, వారి కొంటె ఆలోచనలు ఎలా సాగుతాయి, అనే అంశాలను రచయిత సీతారామ శాస్త్రి గారు చాలా చక్కగా వర్ణించారు. ఇందులో కొన్ని బరువైన పదాలనే ప్రయోగించారాయన. ఇక ఈ పాటకు భారతీపుత్ర చిరంతన్ భట్ సంగీతం, ఉదిత్ నారాయణన్, శ్రేయ ఘోశాల్ ల గాత్రం చాలా బాగా సరిపోయి పాట బాగానే ఉంది.


2. పాట : గణ గణ గణ


గాయనీ గాయకులు : సుబ్బలక్ష్మిపుత్ర సింహ, గిరిజపుత్ర ఆనంద్ భాస్కర్, లక్ష్మీపుత్ర వంశీ

సాహిత్యం : సుబ్బలక్ష్మిపుత్ర సీతారామశాస్త్రి

‘గణ గణ గణ గుండెలలో జే గంటలు మోగెను..’ అంటూ నడిచే ఈ పాట గౌతమిపుత్ర శాతకర్ణి వీరత్వాన్ని, ధైర్యాన్ని పొగుడుతూ ప్రజలకు ఆయనే అండని, శత్రువులు ఎవరైనా ఎదుర్కొనే ధైర్యం ఆయనలో ఉందని చెబుతూ సాగుతుంది. ఈ పాటలో సీతారామ శాస్త్రిగారు పదాలను మరీ భీకరంగా కాకుండా కాస్త ఉత్సాహభరితమైన రీతిలో ఉండేలా వాడారు. చిత్రంలో ఏదైనా విశేషంలో రాజుని పొగుడుతూ ప్రజానీకం పాడే పాటలా ఇది అనిపిస్తోంది. దీనికి ఆనంద్ భాస్కర్, వంశీలు ఇచ్చిన గాత్రం బాగుండి పాట పర్వాలేదనిపించేలా ఉంది.

3. పాట : మృగనయనా


గాయనీ గాయకులు : శకుంతలపుత్ర బాలసుబ్రహ్మణ్యం, శర్మిష్టపుత్రిక శ్రేయ ఘోశాల్

సాహిత్యం : సుబ్బలక్ష్మిపుత్ర సీతారామశాస్త్రి

‘ఆధరమదోలా అదిరినదేల..’ అంటూ సాగే ఈ పాట రాజైన శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ, ఆతని భార్య వాశిష్టి పాత్రలో చేసిన శ్రియ శరన్ ల మధ్య నడిచే పాట. ఇందులో భార్య భర్తల ఏకాంత సమయంలో వారి అనుబంధం ఎలా ఉంటుందో చెబుతూ భర్త భార్యను మచ్చిక చేసుకునే, భార్య భర్తపై తనకున్న ప్రేమను తెలిపే అంశాలను ప్రసావించారు. ఇందులో ‘మృగనాయనా భయమేలనే’ వంటి పదాలతో సీతారామ శాస్త్రిగారు గోప్ప సాహిత్యాన్ని అందిస్తే బాలసుబ్రమణ్యం, శ్రేయ ఘోశాల్ ల గాత్రం ఊపిరి పోసింది. ఆడియోలోని ఉత్తమమైన పాటల్లో దీన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు.


4. పాట : సాహో సార్వభౌమ సాహో

గాయనీ గాయకులు : లోపాముద్రపుత్ర విజయప్రకాష్, పార్వతీపుత్ర కీర్తి సగాతియ

సాహిత్యం : సుబ్బలక్ష్మిపుత్ర సీతారామశాస్త్రి

‘సాహో సార్వభౌమ సాహో..’ అంటూ నడిచే ఈ పాటలో మహారాజు గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని, వ్యక్తితాన్ని ఎంతో గొప్పగా వివరించారు. ఒక రాజు, ఒక కుమారుడి యొక్క అసలైన కర్తవ్యమేమిటి అనేది తెలిపారు. సినిమాలోని కీలక యుద్ధ సమయంలో ఈ పాట వచ్చేలా అనిపిస్తోంది. ఈ పాట పూర్తిగా శాతకర్ణి ధీరత్వం, ఆయన దేశాన్ని కాపాడటం అనే అంశాల చుట్టూనే తిరుగుతోంది. దీనికి విజయప్రకాష్ గానం, సీతారామ శాస్త్రి సాహిత్యం, చిరంతన్ భట్ ట్యూన్స్ చాలా బాగా కుదిరి విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయనిపిస్తోంది.


5. పాట : సింగంపై లంఘించెను (కథాగానం)

గాయనీ గాయకులు : లోపాముద్రపుత్ర విజయప్రకాష్

సాహిత్యం : జయలక్ష్మిపుత్ర సాయిమాధవ్

‘సింగంపై లంఘించెను బాలుడు పేరు శాతకర్ణి..’ అంటూ సాగే ఈ కథాగానంలో వ్యక్తులు శాతకర్ణి పుట్టిన దగ్గర్నుంచి ఎలా పెరిగాడు, ఎలా పట్టాభిషిక్తుడయ్యాడు, ఆయన వివాహమెలా అయింది, ఆ జంటకు ఎలాంటి కష్టమెదురైంది, ఆ కష్టాన్ని తీర్చడానికి, దేశాన్నికాపాడటానికి శాతకర్ణి ఏం చేశాడు. ఆ ప్రయత్నంలో అతను పడ్డ భాధలేమిటి, అతని భార్య వాశిష్టి దేవి భాధ ఎలా ఉంది అనే అంశాలను ఇందులో చాలా గొప్పగా వివరించారు. సినిమాలోని కీలకమైన సన్నివేశంలో వచ్చే ఏ కథా గానానికి సాయి మాధవ్ సాహిత్యం, విజయప్రకాష్ గాత్రం, చిరంతన్ భట్ సంగీతం చాలా గొప్పగా కుదిరి పాటలోని వీరత్వాన్ని, భాధను స్పష్టంగా పలికించాయి.

తీర్పు :

బాలకృష్ణ తన 100వ చిత్రంగా ఈ ప్రాకేతును అనౌన్స్ చేసిన నాటి నుండి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ ప్రకటించడం, ఫస్ట్ లుక్స్, టీజర్,ట్రైలర్ అన్నే చూస్తే శాతకర్ణి మహారాజు జీవితాన్నే సినిమాగా తీశారని స్పష్టమవుతోంది. ఇంతటి ఈ గొప్ప ప్రాజెక్టుకు చిరంతన్ భట్ సంగీతం చాలా గొప్పగా అందిచాడనే చెప్పాలి. చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన సినిమా కనుక ఎంటర్టైన్మెంట్ అనే ధోరణికి పోకుండా సినిమాలోని అసలైన భావం శాతకర్ణి జీవితం, గొప్పతనం, వ్యక్తిత్వం, వీరత్వం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాటలు వింటే నచ్చుతాయి. మొత్తం మీద శాతకర్ణి జీవితానికి రూపమిచ్చేలా ఉన్న ఈ ఆడియోలో 1, 2 పాటలు పరవాలేదనిపించినా విజువల్స్ తో కలిపి చూస్తే 3, 4, 5 పాటలు ఇంకా మెరుగ్గా ఉండేలా ఉన్నాయి.

Click here for English Review

Exit mobile version