ఆడియో సమీక్ష : గాయత్రి – థమన్ సంగీతం ఆకట్టుకుంది

ఆడియో సమీక్ష : గాయత్రి – థమన్ సంగీతం ఆకట్టుకుంది

Published on Jan 30, 2018 5:13 PM IST

సీనియర్ హీరో, విశ్వ నట సార్వభౌమ మోహన్ బాబు మదన్ రామిగాని దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘గాయత్రి’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర ఆడియోను ఘనంగా రిలీజ్ చేశారుటీమ్. మరి థమన్ సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : జై హనుమాన్ jai-hanuman

గాయనీ గాయకులు : శంకర మహదేవన్
రచన : సుద్దాల అశోక్ తేజ

‘అండ పిండ బ్రహ్మాండ బాండముల హానుమ’ అంటూ ఆంజనేయస్వామి నైపథ్యంలో సాగే ఈ పాట వినడానికి బాగుంది. భక్తిని, ధైర్యాన్ని కలగలిపి సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ వినడానికి చాలా బాగున్నాయి. శంకర మహదేవన్ పాటను పాడిన విధానం పాటకే సరికొత్త ఊపిరినిచ్చింది. అలాగే సంగీత దర్శకుడు థమన్ అందించిన ఫాస్ట్ బీట్స్ ఊపునిచ్చేలా ఉన్నాయి. అంతేగాక పాట మధ్యలో వచ్చే మోహన్ బాబు వాయిస్ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద ఈ భక్తి పాట ఆల్బమ్ లోని పాటల్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.

Thella Thella2. పాట : తెల్ల తెల్ల
గాయనీ గాయకులు : మధు బాలకృష్ణ
రచన : రామజోగయ్య శాస్త్రి

‘తెల్ల తెల్ల తెల్ల మల్లెపూల మనసున్నోడు’ అంటూ మొదలయ్యే ఈ పాట కథానాయకుడి పాత్రను, వ్యక్తిత్వాన్ని, పరిస్థితిని వివరించేదిగా ఉంది. ఈ పాటలో థమన్ సంగీతం అన్నిటికన్నా ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ‘అటు ఇటు పసితనం పచ్చదనం అల్లుకున్నవాడు, అడుగెటు నడిపినా మంచితనం కంచె దాటిపోడు’ లాంటి అర్థవంతమైన లిరిక్స్ పాటకు అందాన్నిచ్చాయి. విజువల్ గా పాట మరింత బాగుంటుందనిపిస్తోంది.

3. పాట : ఒక నువ్వు ఒక నేనుThalachi Thalachi
గాయనీ గాయకులు : జుబిన్ నౌటియాల్, శ్రేయ ఘోషల్
రచన : రామజోగయ్య శాస్త్రి

‘ఒక నువ్వు ఒక నేను’ అనే ఈ రొమాంటిక్ పాటలో కూడా థమన్ సంగీతం హైలెట్ గా నిలిచింది. ఎంతో శ్రావ్యంగా అనిపిస్తున్న ఈ పాటకు శ్రేయా ఘోషల్, జుబిన్ నౌటియాల్ ల గాత్రం అందాన్ని తెచ్చిపెట్టింది. ఇద్దరు ప్రేమికుల మధ్యన నడిచే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన ‘వీలుంటే గతమంతా చెరిపి మరలా మొదలవనా నీ జత కలిసి’ లాంటి సాహిత్యం రొమాంటిక్ అనుభూతిని అందించింది. ఈ పాట కూడా ఆల్బమ్ లోని మంచి పాటల జాబితాలోకి చేరుతుంది.

champesave4. పాట : వేకువమ్మా
గాయనీ గాయకులు : ఎస్.పి. బాలసుబ్రమణ్యం
రచన : సుద్దాల అశోక్ తేజ

‘పోనీ పోనీ కన్నీళ్ళని పోనీ’ అంటూ మొదలయ్యే ఈ పాట మనిషికి ఊరటను, ముందుకుసాగే ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో హీరో నైపథ్యంలో నడిచే ఈ పాటకు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గాత్రం మరింత ఉన్నతిన్ని తీసుకొచ్చింది. సుద్దాల అశోక్ తేజ రాసిన అచ్చ తెలుగు సాహిత్యం అర్థవంతంగాను, వినదగినదిగాను ఉంది. థమన్ సంగీతం కూడా బాగుంది.

5. పాట : సరసమహా side
గాయనీ గాయకులు : రమ్య బెహ్రా
రచన : రామజోగయ్య శాస్త్రి

‘కాలికి రామ సిలికా తమలపాకు సిలికా’ అంటూ మొదలయ్యే ఈ పాట కొంత పాత స్టైల్లో ఉంది. చాలా పాత సినిమాల్లో ఉండే ఐటమ్ పాటలనే అనిపిస్తోంది. మరి విజువల్స్ తో కలిపి చూస్తే ఆకట్టుకోవచ్చేమో చూడాలి. ఈ పాటకు థమన్ స్వరాలు పర్వాలేదనిపించినా వాటిలో కూడా కొంత పాతదనం కొట్టొచ్చినట్టు వినిపిస్తోంది.

champesave6. పాట : రావణ బ్రహ్మ
గాయనీ గాయకులు : మనో
రచన : సముద్రాల

పూర్తిగా సంస్కృత సాహిత్యంతో నిండిన ఈ పాట వినడానికి కొంత భిన్నంగా ఉంది. పాటకు ప్రధాన బలం థమన్ సంగీతం. భీభత్స వాతావరణానికి తగ్గట్టు థమన్ అందించిన స్వరాలు, మనో యొక్క బేస్ వాయిస్ పాటకు ఎనలేని గాంభీర్యాన్ని అందించాయి. ఈ పాట వింటే సినిమాలో దీనికి సంబందించిన సందర్భం ఆసక్తికరంగా ఉంటుందేమో అనే ఊహ కలుగుతోంది. ఆ ఊహ ప్రకారమే విజువల్స్ బాగుంటే సినిమా విడుదల తర్వాత ఈ పాట అన్ని పాటలకన్నా కొంత ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

తీర్పు:

చాన్నాళ్ల తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో మదన్ రూపొందిన ఈ ‘గాయత్రి’ చిత్రానికి ఈ పాటల ఆల్బమ్ సరైన న్యాయం చేసేదిగానే ఉంది. నిరుత్సాహం తలెత్తకుండా థమన్ అందించిన ఉత్సాహభరితమైన, ఆకట్టుకునే సంగీతం ఈ ఆడియోకు ప్రధాన హైలెట్. పాటల విషయానికొస్తే 1, 2 మరియు 3 పాటలు బాగా ఆకట్టుకోగా 4, 6 పాటలు పర్వాలేదనే స్థాయిలో 5 వ పాట కొంత పాత రీతిలోను ఉన్నాయి. మొత్తం మీద వినదగిన పాటల్ని కలిగి ఉన్న ఈ ఆల్బమ్ సినిమా విజయానికి దోహదం చేస్తుందని చెప్పొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు