సమీక్ష : గీత గోవిందం – రొమాంటిక్ కామెడీ

 Geetha Govindam movie review

విడుదల తేదీ : ఆగష్టు 15, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక, నాగబాబు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

దర్శకత్వం : పరుశురాం

నిర్మాతలు : బన్ని వాసు

సంగీతం : గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : మణి కందన్

స్క్రీన్ ప్లే : పరుశురాం

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూ.. తన పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉండగా, ఆ కలలో ఓ అమ్మాయి (గీత) కనబడుతుంది. అయితే గీత (రష్మిక) గుడిలో ఎదురుపడగా విజయ్ ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అలా ఓ సందర్భంలో విజయ్, గీత(రష్మిక)తో బస్ ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా జరిగే ఓ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత విజయ్ ను పుర్తిగా ఓ రోగ్ గా అర్ధం చేసుకుంటుంది.

ఆ తరువాత జరిగే కొన్ని ఊహించని పరిణామాలతో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సి రావటం. ఆ ప్రయాణంలో విజయ్ మీద గీతకి ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలగడం. వీటన్నిటి మధ్య విజయ్ గీతని ఎలా కన్వీన్స్ చేసాడు ? తన ప్రేమలోని సిన్సియారిటీని ఎలా నిరూపించుకున్నాడు ? విజయ్ ని ప్రేమించిన నీలు, విజయ్ ప్రేమకు ఎలా ఉపయోగపడింది ? చివరకి గీత, గోవిందంను ప్రేమిస్తుందా ? ప్రేమిస్తే మరి వారి ప్రేమకు వచ్చే సమస్య ఏంటి ? ఫైనల్ గా గీత గోవిందం పెళ్లి చేసుకుంటారా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే గీత గోవిందం చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా హీరోయిన్ని బ్రతిమాలుకునే విధానం, వారి మధ్య కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది.

ఇక కథానాయకిగా నటించిన రష్మిక, గీత పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోని టార్చర్ పెట్టే సన్నివేశాల్లో ఆమె నటన మరియు హీరో మీద కోపం చూపించే సందర్భాల్లో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

విజయ్ కు తండ్రి పాత్రలో నటించిన నాగబాబు తన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా ఎప్పటిలాగే సీరియస్ పాత్రలో కనిపించిన సుబ్బరాజు సినిమాలో సీరియస్ నెస్ తీసుకురావటానికి ఉపయోగపడ్డాడు. ఇక వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, రాహుల్ రామకృష్ణ, అభయ్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, అన్నపూర్ణ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు పరుశురామ్ సినిమాని ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ కథ సింపుల్ గా ఉండటం, బస్ లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రెగ్యూలర్ గా ఉండటం ముఖ్యంగా హీరోయిన్ని ఇంప్రెస్ చేయటానికి హీరో చంటిబిడ్డని ఎత్తుకొని ఆడించే సీన్ కావొచ్చు, మరియు హీరోతో, హీరోయిన్ మీకు పిల్లలు ఎంతమంది ? అని అడిగే టైపు డైలాగ్ లు ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూశాము.

మొదటి భాగం సరదాగా సాగిపోయిన, రెండవ భాగం మొదట్లో మాత్రం కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న మైనస్ లు కూడా లేకుండా ఉండి ఉంటే ‘గీత గోవిందం’ మరో స్థాయిలో ఉండి ఉండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పరుశురామ్ సింపుల్ కథను తీసుకున్నప్పటికీ మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ , అన్నపూర్ణ మధ్య కామెడీ ట్రాక్ తో బాగా నవ్విస్తాడు. మణి కందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. హీరోయిన్ హీరోల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని బన్నివాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చిన్న పాత్రలకి కూడా మెయిన్ హీరోయిన్స్ ను గెస్ట్ అప్పియరెన్స్ గా పెట్టి సినిమాలో చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఇచ్చారు.

తీర్పు:

ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు పరుశు రామ్ సింపుల్ కథను తీసుకున్నా చక్కని ట్రీట్మెంట్ తో మంచి కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. రష్మిక నటన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ కామెడీ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన గీత గోవిందం యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version