సమీక్ష : “గని” – అక్కడక్కడ పర్వాలేదనిపిస్తాడు !

సమీక్ష : “గని” – అక్కడక్కడ పర్వాలేదనిపిస్తాడు !

Published on Apr 9, 2022 3:06 AM IST
Ghani Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 08, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద

సంగీత దర్శకుడు: థమన్

సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా గని. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. అల్లు బాబీ, సిద్దు ముద్దలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

గని (వరుణ్ తేజ్) తన తల్లి మాధురి (నదియా)కి కొన్ని కారణాల వల్ల.. లైఫ్ లో ఇక బాక్సింగ్ జోలికి వెళ్లను అని మాట ఇస్తాడు. అయితే.. తన జీవితంలో బాక్సర్ అయిన తన తండ్రి ద్వారా కలిగిన బాధ, అవమానాల ప్రభావంతో ఎలాగైనా బాక్సర్ కావాలని గోల్ పెట్టుకుంటాడు గని. ఈ క్రమంలో తన తల్లికి తెలియకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. పోటిలలో పాల్గొంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటాడు. ఈ మధ్యలో మాయ (సాయి మంజ్రేకర్) గనితో ప్రేమలో పడుతుంది. మరి గని ఆమెను ప్రేమించాడా ? లేదా ? ఇంతకీ గని తండ్రి విషయంలో జరిగిన సంఘటన ఏమిటి ? గని తల్లి ఎందుకు బాక్సింగ్ అడొద్దు అని మాట తీసుకుంది ? ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు)కి గని తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు గని తాను అనుకున్నది సాధించాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

గని పాత్ర‌లో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన సిక్స్ ప్యాక్ తో తన యాక్షన్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు.
అలాగే తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనల ప్రభావంతో.. ఒక బలమైన ఆశయంగా మారి బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. బాక్సింగ్ కి సంబంధించిన స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ఇక ప్రత్యేక పాత్రలో నటించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి – వరుణ్ తేజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. సునీల్ శెట్టి నటన బాగుంది. దర్శకుడు కిరణ్ చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో స్పోర్ట్స్ లవర్స్ కి నచ్చే అంశాలు ఉండటం సినిమాకి ప్లస్ అవుతుంది.

ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. నదియా కూడా తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఆమె చేత చెప్పించిన డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, నవీన్ చంద్ర లు చాలా బాగా నటించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్పోర్ట్స్ కి సంబంధించి.. మెయిన్ గా బాక్సింగ్ కి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. ప్లే వెరీ రొటీన్ గా సాగుతుంది. పైగా అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలు అయితే ముందే అర్థం అయిపోతుంటాయి. పైగా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు ఆ సీన్స్.

పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాలో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా… దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. మెయిన్ గా స్టోరీ పాయింట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం రెగ్యులర్ సీన్స్ తో ఇంట్రెస్ట్ కలిగించలేని సన్నివేశాలతో సినిమా నడిపాడు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కిరణ్ కొర్రపాటి కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. బాక్సింగ్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

“గని” అంటూ బాక్సింగ్ యాక్ష‌న్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో స్పోర్ట్స్ కి సంబంధించిన స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, దర్శకుడు తీసుకున్న ఎమోషనల్ కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో రొటీన్ కంటెంటే ఎక్కువగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే వరుణ్ తేజ్ గనిగా చాలా బాగా నటించాడు. బిలో ఏవరేజ్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు