సమీక్ష : ఘాజి – ప్రతి ఒక్కరూ చూసి గర్వించదగిన చిత్రం !

Ghazi movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం :సంకల్ప్ రెడ్డి

నిర్మాతలు :పివిపి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం :కృష్ణ కుమార్

నటీనటులు :రానా, తాప్సి, కే కే మీనన్, అతుల్ కులకర్ణి

1971 కాలంలో విశాఖపట్టణ తీరంలో భారతీయ నేవీకి, పాకిస్థాన్ నేవీకి మధ్య జరిగిన, ఎవరికీ తెలియని జలాంతర్గామి యుద్దాన్ని సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియజెప్పాలని నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందించిన చిత్రమే ఈ ‘ఘాజి’. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి సబ్ మెరైన్ డ్రామా కావడం, తెలియని యుద్ధం గురించి చెబుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాలను మోసుకొస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి’ అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు.

కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకొన్న భారతీయ నేవీ భారతీయ జలాంతర్గామి ఎస్21 ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి’ ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందులో భాగాంగానే విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది. అలా పథకాలు వేస్తున్న ఘాజి ని ఇండియా యొక్క ఎస్ 21 ఎలా ఎదుర్కొంది? ఆ రెండు జలాంతర్గాముల మధ్య యుద్ధం ఎలా సాగింది ? ఇండియన్ సబ్ మెరైన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్ కమాండెంట్ రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్), లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా)లు యుద్ధం ఎలా నడిపారు ? చివరికి ఎవరు గెలిచారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని బలమైన అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరికీ తెలియని చరిత్ర ఆధారంగా రూపొందించబడిన కథ గురించి. చాలా మందికి ఈ యుద్ధ చరిత్ర అంతగా పరిచయం లేదు కనుక దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొన్ని వాస్తవిక అంశాలు, కొన్ని కల్పిత అంశాలు జోడించి చాలా స్పష్టమైన కథను తయారు చేశాడు. అంతేగాక దాన్ని చాలా వివరణాత్మకంగా వివరించాడు కూడా. సినిమా చూస్తున్నంత సేపు కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ తలెత్తదు. అంతా 1971 ప్రస్తుతంలోనే నడుస్తూ ముందుకెళుతూ స్పష్టంగా ఉంటుంది.

ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి వేసిన సబ్ మెరైన్ లోపలి సెట్టింగ్స్ చాలా అద్భుతంగా అనిపిపించాయి. ఏదో వేశామంటే వేశామని కాకుండా అన్ని సాంకేతిక విభాగాలను చాలా ఖచ్చితంగా రూపొందించి సబ్ మెరైన్ అంతర్భాగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపాడు. ఆ విషయంలో అతని ఖచ్చితత్వాన్ని మెచ్చుకోవలసిందే. అలాగే సబ్ మెరైన్ నీళ్ళలోకి దిగడం, పైకి లేవడం, సముద్రపు అడుగున టార్పీడో (మిసైల్స్) లతో పరస్పర యుద్ధం, ఎస్ 21, ఘాజి అటాక్ నుండి తప్పించుకొని ఎదురు పోరాడటం వంటి వాటిని విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించడం, సబ్ మెరైన్ లో ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, క్రూ ఎలా పని చేస్తారు అనేది చాలా బాగా వివరించడం ఆకట్టుకున్నాయి.

ఫస్టాఫ్లో ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్స్ గా ఉన్న కేకే మీనన్, రానా ల మధ్య తలెత్తే అభిప్రాయం బేధాలను ఆసక్తికరంగా చూపారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఇండియన్ నేవీ పని తీరును, వేసిన యుద్ధ ప్రణాళికలను చాలా గొప్పగా చూపించారు. కీలకమైన పాత్రల్లో నటించిన రానా, కే కే మీనన్, అతుల్ కులకర్ణి, సత్యదేవ్ లు నటన ఆకట్టుకుంది. చివర్లో పాక్ ఈ చరిత్రను ఎలా వక్రీకరించిందో కూడా టైటిల్స్ రూపంలో చెప్పి చరిత్ర మరుగునపడటానికి గల కారణాన్ని బయటపెట్టడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :
సినిమాలోని బలహీనతల విషాయానికొస్తే కథ క్లిస్టర్ క్లియర్ గా, ఆసక్తిగా ఉన్నప్పటికీ సినిమాని పైకి లేపే కొన్ని కీలక సన్నివేశాల్లో అనగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో అవసరమైన ఎమోషన్ ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడు. సన్నివేశాల సృష్టి బాగున్నా వాటిలో తగినంత భావోద్వేగం లేకపోవడంతో సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని కదిలించలేకపోయింది. సినిమా అంతా సముద్రం అడుగు భాగంలో జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది.

ఫస్టాఫ్ లో చూపిన ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21 కెప్టెన్స్ కమాండెంట్ రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్), లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా) మధ్య సంఘర్షణ బాగానే ఉన్నాఇతర సన్నివేశాలు కొన్ని అడ్డు తగిలినట్టు తోచాయి. చివరగా ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజి’ ని కూల్చే సన్నివేశాలు ఇంకాస్త వివరంగా చూపి ఉంటే సంతృప్తిగా ఉండేది. పైగా ఇందులో కమర్షియల్ అంశాలకు స్థానం లేదు కనుక బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కాస్తంత నిరుత్సాహం తప్పదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక పరంగా ‘ఘాజి’ చిత్రం గొప్ప స్థానంలోనే ఉంది. సబ్ మెరైన్ ను, వాటి అంతర్భాగాలను నిర్మించిన తీరు ఆకట్టుకుంది. సముద్రంలో యుద్ధం, సబ్ మెరైన్ కదలికలు వంటి అంశాలను విఎఫ్ఎక్స్ ద్వారా చాలా బాగా సృష్టించారు. సామాన్య ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా విజువల్స్ ఉన్నాయి. మది అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి అంశాన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు.

ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి విషయానికొస్తే చరిత్రను, కల్పనను కలిపి చాలా మంచి, స్పష్టమైన కథ, కథనాలను తయారు చేసుకున్నాడు. సినిమాలో నటీనటుల కదలికలు, ఇతర అంశాలను చూస్తున్నంత సేపు సబ్ మెరైన్ లో ఉన్న అనుభూతినే కలిగించాడు, యుద్ధ ప్రణాళికలను బాగా రాసుకున్నాడు. కానీ కొన్ని కీలక సన్నివేశాల్లోనే ఎమోషన్ ను ప్రదర్శించలేకపోయాడు. కృష్ణ కుమార్ నైపథ్య సంగీతం బాగానే ఉన్నా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ బాగుంది. పివిపి, పివి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఈ ‘ఘాజి’ చిత్రం తెలుగు పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన సినిమా అనే చెప్పాలి. భారతీయ నేవీ చరిత్రలో అడుగున పడిపోయిన గొప్ప వీరోచితమైన చరిత్రను సినిమాగా చేసి చెప్పడం నిజంగా మెచ్చుకోదగిన అంశం. మంచి కథ, కథనాలు, ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్, నటీనటుల నటన, కొన్నే అయినా ఆకట్టుకున్న యుద్ధ సన్నివేశాలు ఇందులో ప్రధాన బలాలు కాగా కీలక సన్నివేశాల్లో ఎమోషన్ మిస్సవడం, అండర్ వాటర్ వార్ కనుక పెద్దగా యుద్ధ సన్నివేశాలు లేకపోవడం నిరుత్సాహపరిచే అంశం. మరోవైపు చిత్రం ఏ సెంటర్స్ క్లాస్ ఆడియన్సును బాగానే మెప్పించగలుగుతుంది కానీ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వారికి మాత్రం కాస్త నిరుత్సాహం కలిగించే అవకాశముంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘ఘాజి’ తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వించదగిన, ప్రతి ఒక్కరు చూడదగిన చిత్రం.

నోట్ : చిత్ర టీమ్ ప్రదర్శించిన ప్రీమియర్ షో ద్వారా రివ్యూ ఇవ్వబడినది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version