ఆడియో సమీక్ష : గోపాల గోపాల – గోపాలుడిని మెప్పించే మెలోడియస్ ఆల్బమ్.!

ఆడియో సమీక్ష : గోపాల గోపాల – గోపాలుడిని మెప్పించే మెలోడియస్ ఆల్బమ్.!

Published on Jan 5, 2015 5:03 PM IST

gopala-gopala

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెనక్తేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం శిల్పకళవేదికలో జరిగింది. సంక్ర్నతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్ లో మొత్తం మూడు పాటలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు పాటలు కూడా సందర్భానుసారంగా వచ్చే పాటలే.. మరి ఈ ఆల్బంలోని పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : ఎందుకో01

గాయకుడు : కైలాస్ ఖేర్

సాహిత్యం : చంద్రబోస్
‘ఎందుకో’ అంటూ సాగే ఈ సాంగ్ ఆల్బమ్ లో వచ్చే మొదటి సోలో సాంగ్. బాలీవుడ్ సింగర్ కైలాస్ ఖేర్ ఈ పాటని పాడారు. అనాది కాలంగా మనుషులు నమ్ముతూ వస్తున్న మూడనమ్మకాలని ఆధారంగా చేసుకొని చంద్రబోస్ ఈ పాటని రాసారు. నీలో ధైర్యం ఉండగా, నీ ఆత్మశక్తి నీకు తోడు ఉండగా ఇలాంటి మూడనమ్మకాలను ఎందుకు నమ్ముతారు అంటూ ఓ సందేశం ఇస్తూ సాగే ఈ పాటని చంద్రబోస్ బాగానే రాసాడు. మనం నిత్య జీవితంలో ఫాలో అవుతున్న అన్ని మూడనమ్మకాలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పాటకి కైలాస్ ఖేర్ తన వాయిస్ తో పూర్తి న్యాయం చేసాడు. అనూప్ రూబెన్స్ ఈ పాటలో వినసొంపైన వాయిద్యాలతో సాహిత్యం ఎక్కువగా వినపడేలా ఈ పాటని కంపోజ్ చేసాడు. ఈ పాటలో వాడిన గజల్స్, సన్నాయి సౌండ్స్, డ్రమ్స్ అన్నీ పాటకి బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా చివర్లో హిందీ సినిమాలోని ‘గో గో గోవిందా’ లైన్స్ ని ‘గో గో గోపాల’ అంటూ యాజిటీజ్ గా కొట్టేసినా, పాత చివర్లో బాగానే సెట్ అయ్యింది.

022. పాట : నీదే నీదే

గాయకుడు : సోను నిగమ్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గోపాల గోపాల ఆల్బంలో వచ్చే మరో మెలోడియస్ సోలో సాంగ్ ‘నీదే నీదే’.. ఈ పాటని ఫేమస్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసారు. ఆయన మార్క్ తో రాసిన సాహిత్యం ఈ పాట వినే వారిలో తెలియకుండానే ఓ తెలియని ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. సోను నిగమ్ తన ప్రాణం పెట్టి ఈ పాటలోని పదాలకి జీవం పోశాడని చెప్పాలి. గోపాలుడైన పవన్ కళ్యాణ్ గోపాలరావు(వెంకటేష్)కి దైవం అనేది ఎక్కడో లేదు నీలోనే ఉందని చెప్పే గీతోపదేషమే ఈ పాట. పాట మధ్యలో వచ్చిన హి కుదా లైన్ మీలో పాటపై మరింత ఆసక్తిని పెంచుతుంది. పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే ఈ పాట విజువల్ గా చాలా బాగుంటుందని ఆశించవచ్చు. అనూప్ రూబెన్స్ ఈ పాటలో వాడిన స్నేర్ డ్రమ్, తబలా, వయొలిన్ మరియు మధ్య మధ్యలో వచ్చే ఫ్లూట్ సౌండ్ వినేవారిలో ఓ కొత్త ఫీల్ ని కలిగిస్తుంది.

3. పాట : భజే భాజే03

గాయకుడు : హరి చరణ్

సాహిత్యం : అనంత శ్రీరామ్

‘భజే భాజే’ అంటూ సాగే ఈ పాట ఆడియో రిలీజ్ కంటే ముందే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటలో హరిచరణ్ తన వాయిస్ లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ పాడిన విధానం సింప్లీ సూపర్బ్. దేవుడికి – నాస్థికుడికి మధ్య వచ్చే చర్చే ఈ పాట. అలాంటి సందర్భాన్ని అనంత శ్రీరామ్ చాలా చక్కగా ఓ పాట రూపంలో మలిచాడు. ఆ విషయంలో అతని హ్యాట్సాఫ్ చెప్పాలి. వయొలిన్, గజల్స్, సన్నాయి, ఫ్లూట్ సౌండ్స్ తో మరింత వినసొంపుగా అనూప్ రూబెన్స్ ఈ పాటకి సంగీతాన్ని అందించాడు. ఈ పాటలో భజే భాజే అంటూ వచ్చే లైన్ అప్పుడప్పుడు హై పిచ్ కి వెళ్ళడం చాలా బాగుంది. ఈ పాటలో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కలిసి డాన్స్ చెయ్యడం ఆన్ స్క్రీన్ మీద అభిమానులకు కన్నులపండుగ అని చెప్పవచ్చు. ఈ ఆల్బంలో వినగానే నచ్చేసే పాట ‘భజే భాజే’..

తీర్పు :

పవన్ కళ్యాణ్ – వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమా.. దేవుడికి – నాస్థికుడికి మధ్య జరిగే పోరుని ఇతివృత్తంగా చేసుకొని సాగే ఈ సినిమాలో అన్ని సందర్భానుసారంగా వచ్చే పాటలే కావడం వలన అనూప్ రూబెన్స్ అన్నీ మెలోడియస్ సాంగ్స్ అందించాడు. ఎంతో అర్ధవంతంగా ఉన్న ఈ పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ ఆల్బంలోని మూడు పాటల్లో ‘భజే భాజే’ సాంగ్ వినగానే అందరికీ నచ్చేస్తే.. మిగిలిన ‘నీదే నీదే’, ‘ఎందుకో’ పాటలు వినగా వినగా బాగుంటాయి. ఫైనల్ గా ‘గోపాల గోపాల’ ఆల్బమ్ గోపాలుడికి అందించిన మధురమైన స్వర నీరాజనం.

గోపాల గోపాల ఆడియో సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు