సమీక్ష : ఇద్దరం – ప్రేక్షకుడి సహానానికి ఓ పరీక్ష

Iddaram review

విడుదల తేదీ : 08 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : సుధాక‌ర్ వినుకొండ

నిర్మాత : సుధాక‌ర్ వినుకొండ

సంగీతం : కిర‌ణ్ శంక‌ర్‌

నటీనటులు : సంజీవ్, సాయికృప


తెలుగు పరిశ్రమలో ఇప్పటి వరకూ ప్రేమ కథలను ఆధారంగా చేసుకుని చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. అలా ఎన్ని సినిమాలొచ్చినా మళ్లీ కొత్తగా వచ్చే సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం, ఫీల్ ఉంటుందనే నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా కథలను ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే నూతన దర్శకుడు ‘సుధాకర్ వినుకొండ’ కొత్త నటీనటులు ‘సంజీవ్, సాయికృప’ లు జంటగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమే ఈ ‘ఇద్దరం’. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న ఆ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ప్రేమ మత్తులో యువతీ యువకులు తొందరపడి చేసే తప్పు వల్ల పుట్టే పిల్లలు అనాథలుగా మారుతున్నారన్న కోపంతో ఐదుగురు అనాథలు ఆ తప్పుల్ని ఆపాలని ప్రయత్నిస్తుంటారు. ఆ అనాథలా బ్యాచ్ లో మన హీరో సంజీవ్ (అజయ్) కూడా ఒక మెంబర్. కానీ గ్యాంగ్ లో అతడు తప్ప మిగిలిన నలుగురు ప్రేమ జంటలకు మంచి చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్లి రేప్ చేస్తుంటారు.

ఆ విషయం తెలుసుకున్న అజయ్ వాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం తమ గురించి తెలిసిన అజయ్ కి వార్నింగ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఓ ప్లాన్ వేస్తారు. వాళ్ళు వేసిన ఆ ప్లాన్ ఏమిటి? దాని వల్ల అజయ్ ఎలా భాధపడ్డాడు? చివరికి తన చెడ్డ మిత్రుల్ని ఎలా ఎదుర్కున్నాడు? కథ మధ్యలో వచ్చే మలుపులేమిటి? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పికోవలసింది దర్శకుడు సుధాక‌ర్ వినుకొండ ఎంచుకున్న ప్రేమికుల కారణంగా అనాథలు తయారవకుండా చూడటం అనే పాయింట్. సినిమా మొదట్లో ఈ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ జరిగే సంభాషణ బాగానే ఉంది. అలాగే సినిమాలో మొదటి భాగంలో హీరో పాత్ర చుట్టూ రాసుకున్న కథనం కాస్త థ్రిల్లింగానే అనిపించింది.

కథానుగుణంగా వచ్చే పాటలు అర్థవంతంగా ఉండి సినిమాలో ఏదో పెద్ద విషయమే ఉంది అన్న ఆలోచనను క్రియేట్ చెయ్యడం బాగుంది. హీరోయిన్ పల్లవి, హీరో అజయ్ పాత్రల చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే సినిమా రెండవ భాగంలో హీరో తన చెడ్డ స్నేహితుల్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం కొంచెం ఇంప్రెసివ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాని అనాథలు తయారవకుండా చూడటం అన్న కాన్సెప్ట్ తో మొదలు పెట్టడం బాగానే ఉన్నా మొదటి పది నిముషాల్లోనే కథ పూర్తిగా సైడ్ ట్రాక్ తీసుకుని హీరో వైపుకు వెళ్ళిపోతుంది. సొసైటీని బాగుచేద్దాం అన్న లక్ష్యంతో హీరో ఉన్నాడు అని మొదట చెప్పి ఆ తరువాత ఏ కోశానా కథ కానీ, కథనం కానీ సొసైటీ వైపుకి చూడకపోవడం నిరుత్సాహంగా ఉంది. ఆ నిరుత్సాహాన్నే మొదటి భాగమంతా కొనసాగించి విసుగు తెప్పించారు.

అలాగే సినిమా రెండవ భాగం మొత్తం మొదటికి భాగంలో వదిలేసిన కొన్ని సందేహాలకు సమాధానం చెప్పుకుంటూ సాగింది తప్ప కథలో ముఖ్య పాత్రైనా హీరో తన శత్రువుల్ని ఆఖరి వరకూ కలుసుకోడు. దీంతో కథ మరింత బోరింగ్ గా తయారైంది. ఇక నటీనటులంతా సినిమాలో ఎక్కడా కూడా కంటెంట్ కు కనెక్ట్ అయ్యే విధంగా బలమైన నటన కనబరచకపోవడం విసుగు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల్లోకి వస్తే దర్శకుడు ‘సుధాక‌ర్ వినుకొండ’ కథనాన్ని ఎక్కడా కూడా బలంగా రాసుకోలేదు. అన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు అనుకుని రాసుకున్న బలవంతపు సన్నివేశాల్లాగే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా ప్రేక్షకుడిని కథతో కనెక్ట్ చేసేలా లేవు. రచయితగా దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. ఇక నాగేంద్ర కుమార్ చేసిన ఎడిటింగ్ చాలా చోట్ల నిరుత్సాహపరిచేలా ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. కిర‌ణ్ శంక‌ర్‌ సంగీతం కొంచెం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

తీర్పు :
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ వచ్చిన ఈ సినిమాలో అటు రొమాన్స్ గాని ఇటు థ్రిల్ చేసే సస్పెన్స్ అంశాలు గాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. బోరింగ్ కథనం, పరిణితి లేని నటీనటుల నటన, విసుగు తెప్పించే బలవంతపు సన్నివేశాలు వంటి మైనస్ పాయింట్స్ సినిమాని ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే సినిమాగా చేశాయి. సినిమా మొదట్లో కథా పరిచయం, హీరో, హీరోయిన్ల చుట్టూ రాసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఈ సినిమాలో కాస్త మెచ్చుకోదగ్గ అంశాలు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు కాబట్టి ఏదో థ్రిల్ అవుదాం, రొమాన్స్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుని థియేటర్ కి వెళితే మాత్రం ఖచ్చితంగా భారీ స్థాయి నిరుత్సాహాన్ని మూటగట్టుకోక తప్పదు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version