విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం : వివి.వినాయక్
నిర్మాత : సి.కళ్యాణ్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫర్ : ఎస్వి. విశ్వేశ్వర్
ఎడిటర్ : గౌతంరాజు
సి.కళ్యాణ్ నిర్మాతగా వివి.వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ అయ్యాడా ? లేదా ? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
తేజ (సాయి ధరమ్ తేజ్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పనిచేసే కంపెనీకి, యజమానికి నిజాయితీగా ఉంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక క్రిమినల్ గ్యాంగ్ అతని బాస్ (నాజర్) ని చంపి కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అలా సమస్యల్లో పడిన కంపెనీని కాపాడటానికి ధర్మా భాయ్ రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరీ ధర్మా భాయ్, కంపీనీత్రో అతనేం చేశాడు, అన్ని సమస్యల్ని ఎలా పరిష్కరించాడు అనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
నిజాయితీ కలిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ధరమ్ తేజ్ నటన బాగుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి ధర్మా భాయ్ గా మారి, తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. డ్యాన్సులు బాగా చేశాడు. మొత్తంగా తేజ్ తన డ్యూటీని తాను సిన్సియర్ గా చేశాడనోచ్చు. లావణ్య త్రిపాఠి గ్లామర్ సినిమాకు కొంత వరకు ప్లస్.
ఇంటర్వెల్ సమయంలో పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డిలపై వచ్చే కామెడీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి రివీల్ అయ్యే ధర్మా భాయ్ క్యారెక్టర్ బాగుంది. ధర్మా భాయ్ పాత్రపై బ్రహ్మానందం చేసే కామెడీ కొంత నవ్విస్తుంది. నిర్మాత సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కథ చాలా పాతది. సొసైటీ లో జరిగే అన్యాయాన్ని హీరో సైలెంట్ గా అంతం చేయడం అనే కథని మనం చాలా సినిమాల్లో చూశాం. ఆకుల శివ అందించిన కథ మాటాల్లో పెద్దగా పస లేదు. కథ పాతదే అయినా ఆకట్టుకునే కథనం, సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో అలాంటివేమీ లేవు. కథనం మొత్తం నిరుత్సాహంగానే నడిచింది. అనవసరమైన సందర్భంలో వచ్చే పాటలు కొంత ఇబ్బందిపెడతాయి.
ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సాదా సీదా హీరో, ఒక్కసారిగా డాన్ గా మారిపోవడం, అతనికి భయపడి పెద్ద పెద్ద విలన్స్ హీరో కాళ్ళ మీద పడ్డం వంటి సన్నివేశాలను జీర్ణించుకోవడం ప్రేక్షకులకు కొంత కష్టమే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్రకు కథలో తగిన ప్రాధాన్యం లేదు. కథలో గుర్తుంచుకోదగిన, ఎగ్జైట్ ఫీలవ్వగలిగిన మలుపు ఒక్కటి కూడ లేదు. దీంతో చిత్రం ఆసాంతం చప్పగానే నడిచింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు వినాయక్ పనితనం ఈ సినిమాలో అస్సలు కనబడలేదు. ఆయన కెరీర్లో వచ్చిన అత్యంత బలహీనమైన చిత్రమేదంటే ‘ఇంటిలిజెంట్’ అనేలా ఉంది ఔట్ ఫుట్. బలమైం కథ, కతనాలు లేకపోవడం, ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమవడంతో ప్రేక్షకుడు సినిమాకు కనెక్టయ్యే సందర్భాలు చాలా చాలా తక్కువ.
కెమరా పనితనం పర్వాలేదు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిరుత్సాహపరిచింది. ‘చమకు చమకు’ పాటలో కొరియోగ్రఫీ బాగోలేదు. ఎడిటింగ్ ద్వారా కొన్ని సన్నివేశాలను తొలగించి ఉండాల్సింది. ఆకుల శివ డైలాగులు పాత ధోరణిలోనే ఉన్నాయి. సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు:
‘ఖైదీ నెంబర్ 150’ లాంటి హిట్ సినిమా తరువాత వినాయక్ తీసిన ఈ ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఇదసలు వినాయక్ సినిమానేనా అనే సందేహం కలిగేలా ఉంది. ఈ తరహా సినిమాను ఏ స్టార్ హీరో కూడ నిలబెట్టలేడు. పాత కథ, సులభంగా ఊహించగలం రొటీన్ కథనం, ఆసక్తికరమైన మలుపులు, సన్నివేశాలు లేకపోవడం తీవ్రంగా నిరుత్సాహపరిచే అంశాలు కాగా హీరోగా ధరమ్ తేజ్ చేసిన సిన్సియర్ ఎఫర్ట్, ఆయన నటన, డ్యాన్సులు, కొద్దిగా కామెడీ మెప్పించే అంశాలు. మొత్తం మీద వినాయక్ ను చూసి పెద్దగా ఆశించి ఈ సినిమాకు వెళితే తీవ్ర నిరుత్సాహం తప్పదు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team