సమీక్ష : జగన్ – చిరాకు తెప్పించే ఓ క్రైమ్ స్టొరీ..

jagan విడుదల తేదీ : 15 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 0.5/5
దర్శకుడు : వెంకన్నబాబు యేపుగంటి
నిర్మాత : శాఖమూరి మల్లిఖార్జునరావు, తోట హేమ చందర్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు : శివ, సంజన, సరయు, శృతి రెడ్డి…


శివ హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న సినిమా ‘జగన్’. సంజన, సరయు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ద్వారా వెంకన్నబాబు యేపుగంటి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. శాఖమూరి మల్లిఖార్జునరావు, తోట హేమ చందర్ నిర్మించిన ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకి సరైన సమయం దొరకక, అలాగే ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ అసలు ఈ జగన్ ఎవరు?అతను చేసిన మెరమేంటి? అసలు అతను నిర్దోషా? కాదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

హైదరాబాద్లో ఫేమస్ చిత్ర కళాకారుడు జగన్(శివ). ఓ రోజు అత్యసరంగా ఓ నెగటివ్ బ్లడ్ కావాలంటే జగన్ వెళ్లి ఇస్తాడు అలాగే బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన సంధ్య(సరయు), జాన్సి (శృతి రెడ్డి) అతని మంచి తనాన్ని చూసి ఇష్టపడుతారు. కట్ చేస్తే వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఇలా ఇద్దారూ ఒకరికి తెలియకుండా ఒకరు జగన్ ని లవ్ చేస్తారు. సంధ్యకి అజయ్ అనే అతనితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు కానీ సంధ్య అతని బిహేవియర్ నచ్చక తిరష్కరిస్తుంది. ఒకరోజు అనుకోకుండా కొందరి బలవంతం వల్ల జగన్ – సంధ్యలకి పెళ్ళవుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒకరోజు జగన్ – సంధ్య మధ్య గొడవ జరుగుతుంది, దాంతో సంధ్య పై జగన్ చేయ్యిచేసుకొని బయట వెళ్ళిపోతాడు. అతను తిరిగి వచ్చేసరికి సంధ్య అనుమానాస్పదంగా చనిపోయి శవమై ఉంటుంది. అందరూ జగనే సంధ్యని చంపేసాడు అని ఆరోపించడంతో అతన్ని అరెస్టు చేస్తారు. కోర్టులో జగన్ కి ఉరిశిక్ష పడడంతో జగన్ తనను ఆ నేరం చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి జైలు నుంచి తప్పించుకుంటాడు.

అలా తప్పించుకున్న జగన్ జ్యోతి(సంజన) వాళ్ళ ఇంట్లో జొరబడి ఆమెని బెదిరించి ఆ రాత్రి అక్కడే ఉంటాడు. కానీ ఆ రోజు సాయంత్రానికి ముంబై నుండి ఇంటికి తిరిగి రావాల్సిన జ్యోతి భర్త రామ్మోహన్ అదే ఇంట్లో శవమై తేలడంతో ఆ కేసు కూడా జగన్ పై పడుతుంది. అసలు సంధ్యని ఎవరు చంపారు? రామ్మోహన్ ని ఎవరు చంపారు? ఈ రెండు హత్యలు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? ఈ రెండు హత్యా కేసుల నుండి జగన్ ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన కథ..

ప్లస్ పాయింట్స్ :

సంజన సీన్స్ లో, పాటల్లో అందాలు విపరీతంగా ఆరబోసి ముందు బెంచ్ వారిని విపరీతంగా ఆకట్టుకుంది. మేమేమన్నా తక్కువా అని మిగతా ఇద్దరూ హీరోయిన్స్ అయిన సరయు, శృతి రెడ్డి కూడా తమ వంతు అందాల్ని వారు ఆరబోశారు.

మైనస్ పాయింట్స్ :

హీరో శివలో ఒక్క సిక్స్ ఫీట్ హైట్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాలో సంతోషమొచ్చినా, బాధ వచ్చినా, ఫైట్ చేసినా, డాన్స్ చేసినా ఒకటే ఎక్స్ ప్రెషన్. అలాగే అన్ని రకాల సీన్స్ కి ఒకటే వాయిస్ మాడ్యులేషన్. అతని వాయిస్ కొంచెం లౌడ్ గా ఉండడం వల్ల కొంచెం కూల్ గా చేయాల్సిన సీన్స్ లో కూడా అతని వాయిస్ బాగా లౌడ్ గా ఉండడంతో సన్నివేశానికి సెట్ అవ్వలేదు. ఫైట్స్ వరకూ బాగానే మేనేజ్ చేసినా డాన్సుల విషయంలో మాత్రం తేలిపోయాడు. అలాగే మేకప్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సింది. సీన్స్ లో సన్నివేశానికి తగ్గట్టు సర్దుకున్నా పాటల్లో కూడా అదే గడ్డం, అలిసిపోయిన పేస్ తో కనపడటం ఎం బాగోలేదు. సినిమాలో ఒక్క పాట కూడా సందర్భానుసారంగా రాదు కమర్షియల్ హంగులలో ఒక భాగం కావున సినిమాకి 5 పాటలుండాలి, ఆ పాటల్లో హీరోయిన్స్ బాగా ఎక్స్ పోజింగ్ ఉండాలి అన్నట్లు గుడ్డిగా తీసినట్టు ఉంటుంది.

డైరెక్టర్ వెంకన్నబాబు ఈ సినిమా కోసం నాలుగు విభాగాలను ఎంచుకున్నాడు. ముందుగా కథ – పాత కథలన్నీ మిక్స్ చేసి రాసుకున్న రొటీన్ క్రైమ్ స్టొరీ. స్క్రీన్ ప్లే – మర్డర్ హిస్టరీ స్టొరీ అంటే స్క్రీన్ ప్లే ఎంతో ఉత్కంఠంగా ఉండేలా, అసలు హత్య వాడు చేసాడా వీడు చేసాడా అనే సస్పెన్స్ తో ఆడియన్స్ సీట్లో నుంచి కదలనీయకుండా చేయాలి కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎ మాత్రం టెన్సన్, సస్పెన్స్ క్రియేట్ చేయకపోగా చిరాకు తెప్పిస్తుంది. ఇక డైలాగ్స్ – చాలా డైలాగ్స్ లో భూతు తప్ప ఇంకేమీ కనపడలేదు. కథకి పనికొచ్చే డైలాగ్స్ ఓ 10 – 20% మాత్రమే ఉంటాయి. చివరిగా డైరెక్షన్ – నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కొత్తగా ఓ హీరో ని లాంచ్ చేస్తున్నప్పుడు అతనిలోని ఒకటి రెండు యాక్టింగ్ యాంగిల్స్ అన్నా చూపించాల్సింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ముందుకు వెళ్ళాలా వద్దా అన్న రీతిలో ఉంటుంది. సెకండాఫ్ లో కూడా పెద్ద జోరేమీ ఉండదు చివరి పది నిమషాల్లో అటు తిప్పి ఇటు తిప్పి
కథని కంచికి పంపి శుభం కార్డు వేసేస్తాడు.

సినిమా మొదలయ్యాక హీరోని ప్రమోట్ చేసుకోవడం ఒక పెద్ద ఫైట్ సుమారు 10 నిమిషాలు అదే ఉండొచ్చు. అసలు అక్కడ అంత అవసరం లేదు. జ్యోతి ఇంట్లోకి దూరిన జగన్ ని ఎవరో ఇంటికి వచ్చిన వారికి అతను ఇంట్లో ఉన్నాడని చెప్పకుండా సైలైంట్ గా ఉన్న కారణానికి డైరెక్టర్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఓ డ్యూయెట్ సాంగ్ పెట్టేసాడు. అంతకుముందే జ్యోతికి పెళ్లైందని చూపిస్తాడు కానీ వీరిద్దరి మధ్య సాంగ్ ఎందుకు వచ్చిందో అనే లాజిక్ డైరెక్టర్ కి అన్నా తెలుసో లేదో మరి. పాటలు అన్నీ సందర్భం పాడూ లేకుండా ఇలానే ఉంటాయి. జ్యోతి, జగన్ ఇద్దరూ ఒకే చోట ఉంటారు, ఒకసారి చూస్తే శవం ఉంటుంది మళ్ళీ చూస్తే శవం ఉండదు. ఆ సీన్ తర్వాత పారిపోతూ మాయమైపోయిన శవాన్ని చూసిన జగన్ పై ఒకడు అటాక్ చేసాడు. అసలు వాడెవాడు ఎందుకు అటాక్ చేసాడు అనేదే మిస్టరీగానే మిగిల్చేసాడు. రెండు మర్డర్ హిస్టరీలకి ఒకే లింక్ పెడదామని పెట్టలేక డైరెక్టర్ చివరికి దేని దారిన దానిని వదిలేసాడు.

కమెడియన్స్ ఎమ్.ఎస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ లాంటి వారిని సరిగ్గా వినియోగించుకొకపోగా వారి కామెడీ మరీ దారుణంగా ఉంటుంది. అలాగే మీ అందరి కోసం సినిమా అయిన తర్వాత బయటకి వస్తున్నప్పుడు కొంతమంది అన్న మాట ఏమిటంటే ‘ఈ సినిమా కన్నా మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు చాలా బాగుంటాయి కదా’ అని అనుకుంటూ వెళ్తున్నారు.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను ఎంచుకున్న వెంకన్నబాబు ఏ ఒక్క దాన్ని ఫుల్ ఫిల్ చెయ్యలేకపోవడంతో సినిమా గంగపాలైపోయింది. ఈ సినిమాతో డైరెక్టర్ తన చేతులు తనే కాల్చుకున్నట్టు అయ్యింది. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి ఎడిటర్ ని పెట్టుకొని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. సినిమాటోగ్రఫీ గురించి సింపుల్ గా బిలో యావరేజ్ అంటే ఒక్కమాటతో సరిపోతుంది. వందేమాతరం శ్రీనివాస్ పాటలు పెద్దగా హెల్ప్ అవ్వలేదు, అలాగే అమర్ మొహిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాటల కన్నా దారుణంగా ఉంది. నందు ఫైట్స్ ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

మర్డర్ హిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘జగన్ సినిమాలో ప్రేక్షకులు చూడటానికి సంజన అందాల ఆరబోత తప్ప ఇంకీమీ లేవు. చాలా మంది ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ మీద ఉండే స్టిల్స్ చూసి రాజకీయ నాయకుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీసిన సినిమా అనుకుంటున్నారు, అలా అనుకొని సినిమాకి వెళితే మాత్రం మీరు పెద్ద తప్పుచేసినట్టే, అలాగే పూర్తి నిరుత్సాహంతో, నీరసంగా బయటకి వస్తారు. ఈ సినిమాని సి ఆడియన్స్ ఏమన్నా చూస్తారేమో అనేది ఈ వారంతలోపు తెలిసిపోతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 0.5/5

రాఘవ

Exit mobile version