విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే తదితరులు
దర్శకుడు: ఏ. హర్ష
నిర్మాతలు: నిరంజన్ పన్సారి
సంగీత దర్శకుడు: అర్జున్ జన్య
డి ఓ పి: స్వామి జె. గౌడ
ఎడిటర్: దీపు యస్ కుమార్
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ హీరోగా ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’కి ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందింది. నిరంజన్ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
అంజి (శివరాజ్ కుమార్)కి పెళ్లి వయసు దాటిపోతున్నా ఇంకా పెళ్లి కాదు. దాంతో తన అక్క దగ్గరకు వస్తాడు. ఆమె అతనికి పెళ్లి చేస్తానని మాట ఇస్తోంది. ఆ మాట ప్రకారం అంజి పెళ్లి చూపుల ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. మరోపక్క ధన్వంతరి వంశానికి చెందిన వారసుల చేత సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఔషదాలను ఉపయోగించి మత్తు మందులను చేయించి విలన్ గ్యాంగ్ అమ్ముతూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు అంజిని కొట్టి అతని అక్కయ్యను, ఆమె అనుచరులను ఎత్తుకెళ్తారు. ఏం చేయలేని అంజి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే, అతని శరీరంలోకి భజరంగి (శివరాజ్ కుమార్) ఆత్మ ఎలా వచ్చింది ? ఇంతకీ ఈ భజరంగి ఎవరు ? అతనికి – ధన్వంతరి వైద్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు భజరంగి విలన్ గ్యాంగ్ ను ఎలా అంతమొందించాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న డా.శివ రాజ్ కుమార్ ‘ఏమి చేయలేని అంజిలా’, ‘గొప్ప ఆలోచన కలిగిన భజరంగి’లా ఇలా రెండు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. వైద్యానికి సంబంధించి ఓ బలమైన ఆశయంతో ఓ వ్యక్తి తన జీవితాన్నే త్యాగం చేసి సమాజానికి సేవ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ బాగా ఆకట్టుకున్నాయి.
అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక హీరోయిన్ భావన ప్రేమలో పడే సీన్ కూడా బాగుంది. అయితే హీరోయిన్ గా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో ఆమె అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇక మిగిలిన కీలక నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వాళ్ళు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో ధన్వంతరి వైద్య విధానానికి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువయ్యాయి. పైగా అవసరానికి మించి బిల్డప్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు.
ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు ఆ సీన్స్. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. దీనికి తోడు ప్లే ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతుంది.
మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాలో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా… దర్శకుడు ఓవరాల్ గా ఫెయిల్ అయ్యాడు. స్టోరీ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ డ్రామా చుట్టూ సినిమాను నడిపాడు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగా దర్శకుడు ఏ.హర్ష కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలను మాత్రం రాసుకోలేదు. ఇక స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
భారీ అంచనాలతో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో.. కొన్ని యాక్షన్ సీక్వెన్స్, నేపథ్యం, భజరంగి పాత్ర, ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ మరియు శివరాజ్ కుమార్ నటన చాలా బాగున్నాయి. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లోగా బోర్ గా సాగడం, మెయిన్ కంటెంట్ ను దర్శకుడు స్క్రీన్ మీద బలంగా ఎలివేట్ చేయలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని అంశాలు ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో సినిమా మెప్పించదు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team