సమీక్ష: ‘జై భీమ్’ – తెలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

Jai Bhim Telugu Movie Review

విడుదల తేదీ : నవంబర్ 2, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: సూర్య, ప్రకాశ్ రాజ్, లిజోమొల్ జోస్, రావు రమేశ్, రజిషా విజయన్

దర్శకత్వం : టి.జె. జ్ఞానవేల్

నిర్మాతలు: సూర్య, జ్యోతిక

సంగీత దర్శకుడు: సీన్ రోల్డన్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుని సినిమాలను చేసే హీరో సూర్య తాజాగా టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో “జై భీమ్” అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నాడు. నేడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

గిరిజన దంపతులైన రాజన్న(మణికందన్), చిన్నతల్లి(లిజోమొల్ జోస్) జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక ధనవంతుని ఇంట్లో దోపిడీ జరగ్గా అది రాజన్న చేశాడని పోలీసులు రాజన్నను మరియు అతడి భార్య, కుటుంబసభ్యులను చిత్ర హింసలకు గురిచేస్తారు. కొంతకాలం తర్వాత రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెడతారు? అయితే కనిపించకుండా పోయిన రాజన్న ఏమైపోయాడు? భర్త జాడ కోసం చిన్నతల్లి నిజాయితీగల లాయర్ చంద్రు(సూర్య)ని ఎలా సంప్రదించింది? చంద్రు ఆ కేసును ఎలా ఛేదించాడు? అనేది పూర్తి కథ.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు సూర్య నటన ప్రధాన బలమని చెప్పాలి. లాయర్ చంద్రుగా సూర్య డైనమిక్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రలో సూర్య ఒదిగిపోయారనే చెప్పాలి. అయితే సినిమా మొదలు నుంచి చివరి వరకు సూర్య ఎక్కడ కూడా అతిగా చేయకుండా చక్కటి భావోద్వేగాలను కనబరిచాడు.

గిరిజన మహిళగా నటించిన లిజోమల్ జోస్ తన పాత్రతో ఆకట్టుకుంది. తన భర్త కోసం నిస్సహాయ గర్భిణిగా పోరాడుతున్న ఆమెను చూపించిన విధానం చాలా బాగుంది. అదే విధంగా రాజన్న పాత్రలో మణికందన్ కూడా ఘాటుగానే ఉన్నాడు. అతని లుక్ ఏదైనా కావచ్చు లేదా అన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో నొప్పిని ప్రదర్శించే విధానం వాస్తవికంగా కనిపిస్తుంది.

ఇక రావు రమేష్ ప్రభుత్వ లాయర్‌గా కనిపించి తన పాత్రలో చాలా పవర్ ఫుల్‌గా నటించాడు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడి సూర్యకి గట్టిపోటీ ఇచ్చాడు. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. మిగతా నటీనటులు తమిళులే అయినప్పటికీ చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

 

మైనస్ పాయింట్స్:

జై భీం ఫస్ట్ హాఫ్ అవార్డు గెలుచుకున్న తమిళ చిత్రం ‘విసరణై’కి పోలికలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సీన్‌లు అదే మాదిరిగా అనిపిస్తాయి. సినిమా ప్రధాన ప్లాట్‌లోకి ప్రవేశించడానికి కొంత సమయం పడుతుంది.

సినిమా చాలా సీరియస్‌గా ఉంది. దీని కారణంగా సూర్య నుండి కమర్షియల్ హంగులు చూసే వారు ఒకింత నిరాశ చెందే అవకాశం ఉంది. సినిమా కొంచెం లెంతీగా అనిపించిది, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు చాలా వాస్తవికంగా ఉన్నాయి. కోర్టు హాలు మొత్తం చెన్నైలో వేసిన భారీ సెట్‌తో అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్ మరియు గిరిజన తారాగణం చాలా చక్కగా ప్రదర్శించబడింది. సీన్ రోల్డాన్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది.

ఇక దర్శకుడు జ్ఞానవేల్ విషయానికి వస్తే సినిమాను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. లాయర్ చంద్రుడి నిజ జీవిత కథను తీసుకొని అతని అత్యుత్తమ కేసులలో ఒకదాన్ని తెరపై చూపిస్తూ గ్రిప్పింగ్ నేరేషన్‌తో స్క్రీన్‌ప్లేను అడాప్ట్ చేసిన విధానం హైలైట్ అని చెప్పాలి. గిరిజన దంపతులు పడే బాధను మనసును కదిలించే రీతిలో ప్రదర్శించారు.

 

తీర్పు:

1995లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ‘జై భీమ్’ చిత్రంలో లాయర్‌గా కనిపించిన సూర్య అన్యాయం జరిగిన ఓ గిరిజన మహిళకు న్యాయం జరిగేలా చేయడం నిజంగా ప్రతి ఒక్కరినైతే ఆకట్టుకుంటుంది. ప్రధాన కథలోకి రావడానికి కొంత సమయం పట్టినా, కమర్షియల్ అంశాలు లేకపోయినా కూడా చివరి వరకు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తిగానే అనిపిస్తుంది. అయితే ఓటీటీ ద్వారా మంచి సీరియస్ ఫిలింస్ కోరుకునే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్ అని చెప్పాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version