పాటల సమీక్ష : జై లవ కుశ – సాహిత్యం, సంగీతం రెండూ బాగున్నాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘జై లవ కుశ’. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా యొక్క ఆడియో నిన్ననే విడుదలైంది. మరి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : రావణ

గాయనీ గాయకులు : దివ్య కుమార్
రచన : చంద్రబోస్

‘విశ్వ విశ్వ నాయక, రాజ్య రాజ్య పాలక’ లాంటి పవర్ ఫుల్ పల్లవితో మొదలయ్యే ఈ పాట పూర్తిగా ‘జై’ పాత్రను ఉద్దేశించి ఉంటుంది. ఈ పాటను వింటే జై పాత్ర స్వభావం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. ఒకవైపు నమ్ముకున్న వాళ్లకు మంచిగానే కనిపించే జై మరోవైపు శత్రువులకు మాత్రం రాక్షసుడిలా కనిపిస్తాడని అనగా పురాణాల్లో రావణుడిలానే ఉంటాడని ఇందులో చెప్పడం జరిగింది. రచయిత చంద్రబోస్ రాసిన ‘పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకర , అందమైన రూపమున్న అతిభయంకర’ వంటి పోలికలు పాత్రపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సాహిత్యం పరంగా ఈ పాటకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వొచ్చు. ఇక దివ్య కుమార్ గాత్రం, దేవిశ్రీ సంగీతం పర్ఫెక్ట్ గా కుదిరిపోయి చాలా శక్తివంతగా వినిపిస్తోన్న ఈ పాట విజువల్స్ తో చూస్తే ఇంకా ఆవేశానికి గురిచేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ పాటే ఆల్బమ్ లో ప్రథమ స్థానంలో ఉంటుందని అనొచ్చు.

2. పాట : ట్రింగ్ ట్రింగ్
గాయనీ గాయకులు : జస్ప్రీత్ జాజ్, రానిన రెడ్డి
రచన : రామజోగయ్య శాస్త్రి

‘స్వప్న సుందరి, స్వర్ణ మంజరి’ అనే అందమైన లిరిక్స్ తో మొదలయ్యే ఈ పాట సినిమాలో రెండవ పాత్రైన లవ కుమార్ అతని జోడి రాశి ఖన్నాల మధ్య నడుస్తుంది. లవ కుమార్ తను ప్రేమిస్తున్న అమ్మాయి మీద ఎంత ప్రేముందో తెలుపుతూ అదే సమయంలో ఆమె అందాన్ని కూడా వర్ణించే సమయంలో ఈ పాట వస్తుంది. వినడానికి చాలా ఆర్డినరీగానే ఉన్న పాటను విజువల్స్ తో, ఎన్టీఆర్ స్టెప్పులతో స్క్రీన్ మీద చూస్తే ఎంజాయ్ చేయొచ్చని అనిపిస్తోంది. రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటలో పెద్దగా వైవిధ్యమైన లిరిక్స్ ను రాయలేదు. దేవిశ్రీ సంగీతం కూడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తోంది. కాబట్టి ఆల్బమ్ మొత్తంలో ఈ పాటకు చివరి స్థానం ఇవ్వొచ్చు.

3. పాట : నీ కళ్ళలోన
గాయనీ గాయకులు : హేమ చంద్ర
రచన : చంద్రబోస్

ఈ మూడవ పాట కూడా మొదటి పాటలానే జై పాత్రకు సంబందించిన పాట. కానీ ఈసారి ప్రేమ కోణంలో సాగే సాంగ్. ‘నీ కళ్ళలోన కాటుక ఓ నల్లమబ్బు కాదు’ అంటూ మొదలయ్యే ఈ పాటలో జై తన ప్రేయసి అందాన్ని ప్రకృతితో పోలుస్తూ, ఆమె మీద తనకెంత ప్రేముందో వివరిస్తాడు. రచయిత చంద్రబోస్ జై ప్రేమ గొప్పతనాన్ని వివరించేందుకు ‘నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరదా’ వంటి ఆసక్తికరమైన వాక్య ప్రయోగాన్ని చేశారు. అంతేగాక మొదటి సగం వరకు సౌమ్యంగా, అందంగా సాగిన ఏ పాట ఉన్నట్టుండి భీభత్సంగా అనగా జై పాత్ర అసలు స్వభావానికి తగిన రీతిలో మారిపోతుంది. ఆ బీభత్సంలో కూడా ప్రియురాలి పట్ల జై ప్రేమే కనిపిస్తుంది అయితే కొంచెం క్రూరంగా కనిపిస్తుంది. ఇలా రెండు స్వభావాలు కలిగిన ఈ పాట విజువల్ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. దేవిశ్రీ కూడా ఈ పాటకు భిన్నమైన ట్యూన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆల్బమ్ లో ఈ సాంగ్ రెండవ స్థానంలో నిలుస్తుంది.

4. పాట : దోచేస్తా
గాయనీ గాయకులు : నాకాష్ అజిజ్
రచన : చంద్రబోస్

ఇది మూడవ పాత్ర కుశకు సంబందించిన పాట. ‘మీ కష్టాలన్నీ దోచేస్తా, మీ కన్నీళ్ళనీ దోచేస్తా’ అంటూ మొదలయ్యే ఈ పాటలో హీరో జనాల కష్టాలని, కన్నీళ్ళని, బాధల్ని, బరువుల్ని తీర్చడమే తన పనని చెప్తుంటాడు. అనగా జనం కోసం బ్రతికడమే తనికిష్టమని వివరిస్తాడు. ఒకరకంగా రాముడు, కృష్ణుడు కలిసిన పాత్రే కుశ అని ఈ పాటలో తెలుస్తోంది. మంచి హుషారుగా సాగే ఈ పాటలో సాహిత్యం సాధారణంగానే ఉన్నా అర్థవంతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. పాట చివర్న వచ్చే ఫాస్ట్ బీట్ ను వింటే తారక్ స్టెప్పులు అదిరిపోయే రీతిలో ఉంటాయని మాత్రం అర్థమవుతోంది. ఆల్బమ్ లో ఈ పాటకు మూడవ స్థానాన్ని ఇవ్వొచ్చు.

తీర్పు:

రెండు వరుస హిట్ల తర్వాత ‘ఎన్టీఆర్’ చేసిన సినిమా కాబట్టి దీనికి సంబందించిన ప్రతి అంశం గొప్పగా ఉండాలని అభిమానులు ఆలోచిస్తారు. ఆడియో ఖచ్చితంగా బాగుండి తీరాలని కోరుకుంటారు. దేవి శ్రీ ప్రసాద్ తన పనితనంతో వాళ్ళ అభిష్టాన్ని చాలా వరకు నిలబెట్టాడనే చెప్పాలి. ఉన్న నాలుగు పాటలకు నాలుగు విధాలైన సంగీతాన్ని అందించి ఒక్క ‘ట్రింగ్ ట్రింగ్’ అనే పాట మినహా మిగతా మూడింటినీ ముఖ్యంగా మొదటి పాటను మళ్ళీ మళ్ళీ వినాలనే రీతిలో మలచాడు. అటు సాహిత్యం, ఇటు సంగీతం రెండు బాగా కుదిరిన ఈ ‘జై లవ కుశ’ ఆల్బమ్ సినిమా విడుదలయ్యే వరకు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతూనే ఉంటుంది.

Click here for English Music Review

Exit mobile version